నేదురుమల్లి వారసులు ఏం చేస్తున్నారు..?

By Karthik P Jun. 10, 2021, 01:30 pm IST
నేదురుమల్లి వారసులు ఏం చేస్తున్నారు..?

తెలుగు రాజకీయాల్లో పరిచయం అక్కర్లేని పేరు నేదురుమల్లి జనార్థన్‌ రెడ్డి. రాజ్యసభ సభ్యుడిగా, ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా, మంత్రిగా, ముఖ్యమంత్రిగా మూడు దశాబ్ధాల పాటు ఆయన ప్రజాసేవలో ఉన్నారు. నెల్లూరు జిల్లా గూడురు నియోజకవర్గం వాకాడుకు చెందిన నేదురుమల్లి జనార్థన్‌ రెడ్డి.. కాంగ్రెస్‌ పార్టీలో అంచెలంచెలుగా ఎదిగారు. కాంగ్రెస్‌ పార్టీ నుంచి రాజకీయ జీవితం మొదలుపెట్టిన నేదరుమల్లి.. తుది శ్వాస వరకూ ఆ పార్టీలోనే ఉన్నారు. ఎంపీగా 2014లో అనారోగ్యంతో పరమపదించారు.

ముఖ్యమంత్రిగా 17 నెలలపాటే నేదురుమల్లి కొనసాగారు. ప్రైవేటు ఇంజనీరింగ్‌ కాలేజీ సీట్ల విషయంలో తీసుకున్న నిర్ణయం ఆయన పదవికి ఎసరు తెచ్చింది. వారి కుటుంబానికి వాకాడులో ఎన్‌బీకేఆర్‌ (నేదురుమల్లి బాలకృష్ణారెడ్డి) ఇంజనీరింగ్‌ కాలేజీ ఉంది. ముఖ్యమంత్రి పదవి తర్వాత.. నేదురుమల్లి జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టారు. సతీమణి నేదురుమల్లి రాజ్యలక్ష్మీని రాష్ట్ర రాజకీయాల్లో ప్రోత్సహించారు.

వెంకటగిరి నియోజకవర్గం నుంచి రాజ్యలక్ష్మీ 1999లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. 2004లోనూ మరోసారి వెంకటగిరి నుంచి శాసన సభకు ఎన్నికయ్యారు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి కేబినెట్‌లో స్త్రీ,శిశు సంక్షేమ శాఖా మంత్రిగా పని చేశారు. 2009లో త్రిముఖ పోరులో రాజ్యలక్ష్మీ ఓటమి చవిచూశారు. 2007లో నేదురుమల్లి దంపతులపై నక్సల్స్‌ దాడి చేశారు. అదృష్టవశాత్తూ వారిద్దరూ ఆ దాడి నుంచి సురక్షితంగా బయటపడ్డారు.

2014 మే 10వ తేదీన నేదురుమల్లి జనార్థన్‌ రెడ్డి మరణించారు. ఆయన మరణం తర్వాత.. రాజ్యలక్ష్మీ రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. హైదరాబాద్‌లో ప్రశాంతమైన జీవితం గడుపుతున్నారు.

నేదురుమల్లి దంపతులకు నలుగురు కుమారులు. రామ్‌కుమార్‌ రెడ్డి, అశోక్‌ కుమార్‌ రెడ్డి, గౌతమ్‌ రెడ్డి, భరత్‌ కుమార్‌ రెడ్డి. రామ్‌కుమార్‌ రెడ్డి మినహా మిగతా ముగ్గురూ వ్యాపారాల్లో ఉన్నారు. రామ్‌కుమార్‌ రెడ్డి తన కుటుంబ రాజకీయ వారసత్వాన్ని కొనసాగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

2014లో రామ్‌కుమార్‌ రెడ్డి వెంకటగిరి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేశారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో కాంగ్రెస్‌ పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నికల తర్వాత కొద్ది కాలానికి రామ్‌కుమార్‌ రెడ్డి బీజేపీలో చేరారు. ఆ పార్టీలో కొంత కాలం పని చేసిన ఆయన 2018లో వైసీపీలో చేరారు. వైఎస్‌ జగన్‌ ప్రజాసంకల్ప పాదయాత్ర విశాఖపట్నం చేరిన సమయంలో రామ్‌కుమార్‌ రెడ్డి జగన్‌ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు.

Also Read : ఆచితూచి అడుగులు వేస్తున్న జూపూడి ప్రభాకర్‌

అటు గూడురు, ఇటు వెంకటగిరిలలో నేదురుమల్లి వర్గాన్ని కాపాడుకుంటూ వస్తున్నారు రామ్‌కుమార్‌ రెడ్డి. అయితే నేదురుమల్లి, రాజ్యలక్ష్మీ స్థాయిలో రాజకీయ పట్టును రామ్‌కుమార్‌ రెడ్డి సాధించలేకపోతున్నారు. నేదురుమల్లి బ్రాండ్‌తో రాజకీయాలు చేస్తున్నారు. ప్రస్తుతం వైసీపీలో బాపట్ట, తిరుపతి పార్లమెంట్‌ పరిశీలకులుగా ఉన్నారు.

వైసీపీలో చేరినా.. 2019లో టిక్కెట్‌ కోసం పట్టుబట్టలేదు. వెంకటగిరిలో పోటీ చేసిన మాజీ మంత్రి ఆనం రామ్‌నారాయణ రెడ్డి విజయానికి రామ్‌కుమార్‌ రెడ్డి పని చేశారు. ఎన్నికల ముగిసిన తర్వాత కూడా.. వర్గ రాజకీయాలు చేయడం లేదు. తన పని తాను చేసుకుంటున్నారు. ఎక్కువ సమయం హైదరాబాద్‌లో గడుపుతున్నారు. అప్పుడప్పుడు సొంత గ్రామం వాకాడు, వెంకటగిరి నియోజకవర్గానికి వస్తున్నారు. నేదురుమల్లి అనుచరులుగా ఉన్న వారితో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారు.

రాజకీయాల్లో ఆది నుంచి రామ్‌కుమార్‌ రెడ్డి దూకుడుగా వ్యవహరించలేదు. తండ్రి ద్వారా వచ్చిన వర్గాన్ని కాపాడుకోవడానికి తప్పా.. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి కుటుంబ వారసత్వాన్ని కొనసాగించాలనే కసితో రామ్‌కుమార్‌ రెడ్డి రాజకీయాలు చేయడం లేదనే చెప్పారు. ఇటీవల జరిగిన తిరుపతి ఉప ఎన్నికల్లోనూ రామ్‌కుమార్‌ రెడ్డి ఉత్సాహంగా పని చేశారు. గుడూరు నియోజకవర్గంలో నేదరుమల్లి వర్గాన్ని అంతా ఏకతాటిపైకి తెచ్చి వైసీపీ అభ్యర్థి డాక్టర్‌ గురుమూర్తి విజయం కోసం పని చేశారు. వైసీపీలో నిబద్ధతతో పని చేయడం వల్ల ఏదో ఒక పదవి వస్తుందనే ఆశతో రామ్‌కుమార్‌ రెడ్డి అనుచరులున్నారు. ఈ తరహాలో రాజకీయాలు చేస్తున్న రామ్‌కుమార్‌ రెడ్డి నేదురుమల్లి వారసత్వాన్ని విజయవంతంగా కొనసాగించగలరా..? లేదా తన కుటుంబ వర్గానికి ప్రతినిధిగా ఉండేందుకు రాజకీయాలు చేస్తారా..? వేచి చూడాలి.

Also Read : సోమిరెడ్డికి అలుపేరాదా..?

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp