దేవేందర్ గౌడ్ ఇప్పుడు ఏమి చేస్తున్నారు..?

By Ritwika Ram Jul. 18, 2021, 08:24 pm IST
దేవేందర్ గౌడ్ ఇప్పుడు ఏమి చేస్తున్నారు..?

దేవేందర్ గౌడ్.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఓ వెలుగు వెలిగిన నేత. పలు మార్లు ఎమ్మెల్యేగా, హోం మంత్రిగా, రాజ్యసభ సభ్యునిగా పని చేశారు. 15 ఏళ్ల కిందటి దాకా తెలుగుదేశం పార్టీలో నంబర్ 2గా ఉండేవారు. కానీ దశాబ్ద కాలంగా ఆయన క్రియాశీల రాజకీయాలకు దూరమయ్యారు. నిజానికి ఆయన ఏ పార్టీలో ఉన్నారన్న విషయం కూడా చాలా మందికి తెలియదు. ప్రస్తుతం దేవేందర్ గౌడ్ టీడీపీలోనే ఉండగా.. ఆయన కొడుకు వీరేందర్ గౌడ్ బీజేపీలో ఉన్నారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి.. దేవేందర్‌‌తో భేటీ కానుండటంతో మరోసారి ఆయన పేరు తెరపైకి వచ్చింది.

పార్టీలోకి రమ్మంటున్న రేవంత్

పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రేవంత్ రెడ్డి.. లీడర్ల ఇళ్లను చుట్టేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి వెళ్లిపోయిన వాళ్లను, తనతో గతంలో టీడీపీలో కలిసి పని చేసిన వాళ్లను కలుస్తున్నారు. కాంగ్రెస్‌లోకి రావాలని ఆహ్వానిస్తున్నారు. ఈ క్రమంలోనే డి. సంజయ్, ఎర్ర శేఖర్, గండ్ర సత్యనారాయణరావు తదితరులు కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమయ్యారు. వీరితో పాటు మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డిని కూడా పార్టీలో చేరేందుకు ఒప్పించారు. ఈ క్రమంలోనే దేవందర్ గౌడ్‌ను రేవంత్ కలుస్తున్నారు. ఆయన కొడుకులను కూడా పార్టీలో చేర్చుకునేందుకు ఆయన పావులు కదుపుతున్నారు. దేవేందర్, రేవంత్ గతంలో ఒకే పార్టీలో పని చేయడం, తెలంగాణలో దేవందర్ కీలకమైన కమ్యూనిటీకి చెందని వ్యక్తి కావడంతో ఎలాగైనా పార్టీలో చేర్చుకోవాలని భావిస్తున్నారు.

క్రియాశీల రాజకీయాలకు దూరంగా..

మేడ్చల్ నుంచి వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు దేవేందర్ గౌడ్. చంద్రబాబు నాయుడు హయాంలో హోం మంత్రిగా పని చేశారు. కానీ 2008లో తెలంగాణ విషయంలో చంద్రబాబుతో విభేదించి టీడీపీకి రాజీనామా చేశారు. నవ తెలంగాణ పార్టీ పెట్టారు. కానీ దాన్ని ఎక్కువ రోజులు నడపలేకపోయారు. అప్పుడే ఏర్పాటైన ప్రజారాజ్యం పార్టీలో విలీనం చేశారు. 2009 ఎన్నికల్లో పీఆర్పీ నుంచి ఒక లోక్ సభ, ఒక అసెంబ్లీ స్థానానికి పోటీ చేశారు. కానీ రెండు చోట్ల ఓటమి పాలయ్యారు. తర్వాత కొన్నాళ్లకు తిరిగి సొంత గూటికి చేరుకున్నారు. 2012లో రాజ్యసభకు ఎన్నికయ్యారు. కానీ అనారోగ్య కారణాలతో అప్పటి నుంచే ఆయన క్రియాశీల రాజకీయాలకు దూరమయ్యారు. క్యాన్సర్ వ్యాధి బారినపడిన దేవేందర్ గౌడ్ అమెరికాలో శస్త్ర చికిత్స చేయించుకుని కోలుకున్నారు.

గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో టీడీపీ నుంచి బీజేపీలోకి చేరుతారని ప్రచారం జరిగింది. కానీ సైకిల్ పార్టీలోనే ఆయన కొనసాగుతున్నారు. ప్రస్తుతం తెలుగుదేశం పూర్తిగా కనుమరుగైపోవడంతో ఆయన్ను కాంగ్రెస్‌లోకి తీసుకురావాలని రేవంత్ భావిస్తున్నారు. ఆయనతోపాటు వీరేందర్ గౌడ్‌ను కూడా రప్పించే ప్లాన్ చేస్తున్నారు.వీరేందర్ గౌడ్ రెండేళ్ల కిందటే బీజేపీలో చేరారు. అంతకుముందు 2014 ఎన్నికల్లో చేవెళ్ల లోక్‌సభ స్థానం నుంచి,2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఉప్పల్ నుంచి టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత బీజేపీలో చేరారు. ఈ నేపథ్యంలో తండ్రీ కొడుకులకు కాంగ్రెస్ నుంచి ఆహ్వానం అందుతోంది. మరి దేవేందర్ గౌడ్ యాక్టివ్ అవుతారా? పూర్వ వైభవం తిరిగి తెచ్చుకుంటారా?

Also Read : హుజూరాబాద్ లో ఈటల జమున పోటీ చేయాలనుకుంటున్నారా..?

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp