స‌రోజా బ‌స్సు స‌ర్వీస్‌

By G.R Maharshi Jan. 14, 2021, 08:07 pm IST
స‌రోజా బ‌స్సు స‌ర్వీస్‌

ఇపుడైతే అన్ని బ‌స్సులు ఒకేలా వుంటున్నాయి కానీ, మా చిన్న‌త‌నంలో ప్ర‌తి బ‌స్సుకి ఒక ప్ర‌త్యేక స్వ‌రూపం, పేరు, క్యారెక్ట‌ర్ వుండేవి. ఆర్టీసీ వ‌చ్చాకా అన్ని ఎర్ర‌బ‌స్సులై పోయాయి. బ‌స్సుతో మాన‌సిక సంబంధం పోయి యాంత్రిక‌త వ‌చ్చేసింది.

రాయదుర్గం క‌ర్నాట‌క బార్డ‌ర్ కాబ‌ట్టి బ‌ళ్లారికి ఎక్కువ బ‌స్సులు తిరిగేవి. గంట‌కో బ‌స్సు. 50 కిలోమీట‌ర్లు 3 గంట‌లు ప్ర‌యాణించేవి. కోళ్లు, మేక‌లు, గొర్రెలు, మ‌నుషులు అంద‌రూ క‌లిసిమెలిసి ప్ర‌యాణించేవాళ్లు. ఎద్దులు, ఎనుములు ప‌ట్ట‌వు కాబ‌ట్టి ఎక్కించుకునే వాళ్లు కాదు. చేయి ఊపిన ప్ర‌తివాన్ని లోప‌లికి లాక్కోవ‌డ‌మే. ఈ కాసింత జ‌ర్నీకి మ‌ధ్య‌లో టిఫెన్ బ్రేక్‌. సోమ‌లాపురంలో డ్రైవ‌ర్‌కి కాసేపు రెస్ట్‌. ఒక్కోసారి చెంబు తీసుకుని చెట్ల‌లోకి వెళ్లేవాళ్లు. ప్ర‌యాణికుల ఆహాకారాల త‌ర్వాత నింపాదిగా వ‌చ్చేవాడు. ప్ర‌తి బ‌స్సుకీ ఓ పేరు. అన్నింటి చివ‌రా మోటార్ స‌ర్వీస్ అని కామ‌న్‌. దాదాహ‌య‌త్ అనే బ‌స్సుకి మాత్రం కిటికీల‌కి అద్దాలుండేవి. మిగిలిన వాటికి టార్బాలిక్ ప‌ట్ట‌లు కొన్ని చిరిగిపోయి వుండేవి. వానొస్తే ప్ర‌యాణీకుల‌కి స్నానం ఫ్రీ. VDNS అనే బ‌స్సులో రైలులా ఎదురెదురు సీట్లు ఉండేవి. బ‌స్సు లోప‌ల చేతులు బ‌య‌ట‌పెట్ట‌రాదు, పొగ‌తాగ‌రాదు, మందుగుండు సామాగ్రికి అనుమ‌తి లేదు అని రాసి వుండేది. డ్రైవ‌ర్‌, కండ‌క్ట‌ర్‌తో స‌హా స‌గానికి పైగా మ‌గ‌వాళ్లు బీడీ, సిగ‌రెట్లు ముట్టించేవాళ్లు. ఆడ‌వాళ్లు, పిల్ల‌లు ద‌గ్గేవాళ్లు.

అనంత‌పురానికి కూడా చాలా బ‌స్సులుండేవి. స‌రోజా బ‌స్సు చాలా ఫేమ‌స్‌. తెల్లారుజామున 5.30కి బ‌య‌ల్దేరి 90 కిలోమీట‌ర్లు 4 నుంచి 5 గంట‌లు ప్ర‌యాణించేది. మ‌ధ్య‌లో క‌ల్యాణ‌దుర్గం టిఫెన్ హాల్ట్‌. మా వూరు చీమ‌ల‌వాగు ప‌ల్లెకి పోవాలంటే ఈ బ‌స్సులోనే వెళ్లేవాళ్లం. మా ప‌ల్లె కొన్ని వంద‌ల మైళ్లు ఉంద‌ని అనుకునేవాన్ని. ఎందుకంటే తెల్లారి 4 గంట‌ల‌కి నిద్రలేపే వాళ్లు. అంద‌రూ స్నానాలు చేసి ఒక పెద్ద ట్రంక్ పెట్టెలో బ‌ట్ట‌లు స‌ర్దుకుని రోడ్డు మీద ల‌క్ష్మీవిలాస్ ద‌గ్గ‌ర నిల‌బ‌డితే బ‌స్సు వ‌చ్చేది. ట్రంకు పెట్టెల‌కి బ‌స్సులో అనుమ‌తి లేదు. టాప్ మీద వేయాల్సిందే. హ‌మాలీల‌కి మా నాన్న‌కి గొడ‌వ‌. వాళ్లు 2 రూపాయ‌ల ద‌గ్గ‌ర స్టార్ట్ అయితే ఈయ‌న పావ‌లా నుంచి మొద‌లెట్టేవాడు. మొత్త‌మ్మీద అర్ధ‌రూపాయి ద‌గ్గ‌ర డీల్ కుదిరేది. స‌రోజా బ‌స్సు అన్ని ప‌ల్లెల్లో ఆగుతూ క‌ల్యాణ దుర్గం చేరేది. వూరి బ‌య‌ట హోట‌ల్‌లో టిఫెన్‌. పూరి, దోసె తినాల‌ని వుండేది. మా నాన్న ఇడ్లీకి మించి చెప్పేవాడు కాదు. అనంత‌పురం 10కి చేరేది. అక్క‌డ్నుంచి తాడిప‌త్రి బ‌స్సుకి ప‌డిగాపులు. మధ్యాహ్నం 2.30కి మా వూరి చేరేవాళ్లం. 150 కి.మీ, 9 గంట‌ల ప్ర‌యాణం. ఈ అల‌స‌ట 2 రోజులుండేది.

మా పెద్ద‌వాళ్ల కాలంలో బొగ్గు బ‌స్సులుండేవ‌ట‌. అవి ఇంకా దుర్మార్గం. వాన వ‌స్తే ఆరిపోయేవి. స్టీమ్ రోడ్డు రోల‌ర్‌ని చూశాను కానీ, బ‌స్సుని చూడ‌లేదు.

స్కూల్లో చ‌దివేట‌ప్పుడు ఈ బ‌స్సులు టైమ్ టేబుల్‌లా ప‌నిచేసేవి. స్కూల్ బ‌య‌టే రోడ్డు కాబ‌ట్టి బ‌స్సుల‌న్నీ క‌న‌ప‌డేవి. ఉద‌యం 7.30 నుంచి 10.30 వ‌రకూ స్కూల్‌. మ‌ధ్య‌లో 9 గంట‌ల‌కి ఇంట‌ర్వెల్‌. NMS అనే బ‌స్సు వ‌స్తే ఇంట‌ర్వెల్‌. GRS అనే బ‌స్సు వ‌స్తే ఇంటిక‌ని అర్థం. మ‌ధ్యాహ్నం 2 నుంచి 4.30 వ‌ర‌కూ స్కూల్ టైమ్‌లో దాదాహ‌య‌త్ వ‌స్తే ఇంట‌ర్వెల్‌. VDMS వ‌స్తే ఇంటికి. ఈ బ‌స్సుతో పాటు సూర్యున్ని కూడా Follow అయ్యేవాళ్లం. బోర్డు మీదికి ఎండ వ‌స్తే స్కూల్ వ‌దులుతార‌ని అర్థం. కుర్రాళ్లంతా అయ్య‌వారి పిలుపు కోసం సిద్ధంగా ఉండేవాళ్లం. ఎవ‌డు బెల్ కొడితే వాడు హీరో. ఇక చాలురా అయ్యా అనేవ‌ర‌కూ ఇనుప క‌మ్మీని ద‌డ‌ద‌డ‌లాడించే వాళ్లం.

మామూలు బ‌స్సులు కాకుండా మూతి బ‌స్సు వుండేవి. హ‌నుమంతుడి మూతిలా దానికి పొడుగాటి మూతి వుండేది. ప‌ల్లెలు తిరిగే బ‌స్సు. ఖాకీ నిక్క‌ర్ వేసుకున్న ఒకాయ‌న క్లీన‌ర్ క‌మ్ కండ‌క్ట‌ర్‌గా వుండే వాడు. వ్యాన్‌కి, బ‌స్సుకి మ‌ధ్య‌స్తంగా వుండే దీంట్లో జ‌నాల్ని ఎక్కించ‌డ‌మే ఆయ‌న ప‌ని. ఒక‌సారి మ‌నుషుల‌తో పాటు పొట్టేళ్ల‌ని ఎక్కించాడు. వాటికి ఊపిరాడ‌క తిక్క‌లేసి జ‌నాల్ని కుమ్మాయి. భ‌యంతో కొంత‌మంది కిటికీల్లోంచి దూకేశారు.

గుండ్ల‌ప‌ల్లి అనే చోట ఒక ఏరు వుండేది. బాగా వ‌ర్షాలు వ‌చ్చిన‌ప్పుడు అది పొంగేది. ఒకసారి RTS అనే బ‌స్సు వాగులో ఇరుక్కుంది. జ‌నాలంతా దిగారు కానీ కండ‌క్ట‌ర్ మాత్రం టాప్‌మీద‌కి ఎక్కాడు. బ‌స్సుతో పాటు అత‌నూ పోయాడు.

మా క్లాస్‌మేట్ స‌రోజా అనే అమ్మాయి వాళ్ల నాన్న ఒక‌సారి బ‌స్సును కొన్నాడు. ఎర్ర‌టి క‌ల‌ర్‌తో వుండేది. కొంత కాలం బాగానే తిరిగింది కానీ, త‌ర్వాత ఏమైందో ఏమో ఆగిపోయింది. వాళ్ల ఇంటి ముందున్న ఖాళీ స్థ‌లంలో చాలా కాలం వుండేది. పిల్ల‌లం ఎక్కి దొంగాపోలీస్ ఆడేవాళ్లం. టైర్లు లేని ఆ బ‌స్సుకి డ్రైవ‌ర్‌గా వుంటూ ప్ర‌యాణికుల్ని తిప్పేవాన్ని. నిజ‌మైన బ‌స్సుతో ఆడుకోవ‌డం మాకు మాత్ర‌మే దొరికిన అవ‌కాశం.

కొంత కాలానికి సీట్లు చిరిగిపోయాయి. ఆ స్పాంజితో ప‌ల‌క‌లు తుడుచుకునేవాళ్లం. టికెట్ పుస్త‌కాల‌తో ప‌డ‌వ‌లు చేసుకున్నాం. త‌ర్వాత ఆ బ‌స్సు ఏమైందో తెలియ‌దు.

ఒక‌సారి ఇంట్లో వాళ్ల‌పై కోపం వ‌చ్చి GRS అనే బ‌స్సు నిచ్చెన ఎక్కి అనంత‌పురం పారిపోదామ‌నుకున్నాను. నిచ్చెన‌కి వేలాడుతున్న న‌న్ను గ‌మ‌నించి డ్రైవ‌ర్ బ‌స్సు ఆపి త‌రుముకున్నాడు.

చిన్న‌ప్పుడు నాకే కాదు, నాలాంటి చాలా మంది కుర్రాళ్ల యాంబిష‌న్ బ‌స్సు డ్రైవ‌ర్ కావాల‌ని. చ‌క్రం తిప్పే అత‌ను శ్రీ‌మ‌హావిష్ణువులా క‌నిపించేవాడు. యంత్రానికి వేగం పెరిగి ప్ర‌యాణ భారం త‌గ్గింది. ఆ యంత్రం మ‌న శ‌రీరంలోకి కూడా ప్ర‌వేశించింది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp