ఆ బాలీవుడ్ సినిమా ప్రేరణతో బోయిన్‌పల్లి కిడ్నాప్‌కు ప్లాన్ ?

By Rishi K Jan. 13, 2021, 09:10 am IST
ఆ బాలీవుడ్ సినిమా ప్రేరణతో బోయిన్‌పల్లి కిడ్నాప్‌కు ప్లాన్ ?

తెలుగురాష్ర్టాల్లో సంచలనం కలిగించిన బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో పోలీసులు అఖిలప్రియను కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. నేటితో అఖిలప్రియ కస్టడీ ముగియనుంది. ఈ నేపథ్యంలో విచారణలో కీలక విషయాలు రాబట్టారు పోలీసులు. ఓ బాలీవుడ్ సినిమా చూసిన అనంతరం కిడ్నాప్ ప్లాన్ కి స్కెచ్ గీసినట్లు విచారణలో తేలింది.

వివరాల్లోకి వెళితే హాఫిజ్ పేటలోని 45 ఎకరాల భూమికి సంబంధించి ప్రవీణ్ రావు సోదరులు,భూమా అఖిల ప్రియ,ఏవీ సుబ్బారెడ్డిల మధ్య వివాదం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ప్రవీణ్ రావు సోదరులను కిడ్నాప్ చేయాలని భూమా అఖిలప్రియ ప్లాన్ వేశారు. దీనికి ప్రేరణగా బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ నటించిన "స్పెషల్ 26" సినిమా నిలవడం గమనార్హం. కిడ్నాప్ లో పాల్గొనే 8 మంది నిందితులకు స్పెషల్ 26 సినిమా చూపించి శిక్షణ ఇవ్వాలని అఖిలప్రియ చెప్పడంతో ఆమె భర్త భార్గవ్ రామ్ సోదరుడు చంద్రహాస్ 8 మందిని యూసుఫ్‌గూడలోని ఎంజీఎం ఇంటర్నేషనల్‌ ఉంచి ఐటీ అధికారుల్లా నటించేందుకు శిక్షణ ఇచ్చారు. చంద్రహాస్ ఐడీ కార్డులు రెడీ చేసి, శ్రీ నగర్ కాలనిలో ఐటీ అధికారుల డ్రెస్సులు అద్దెకు తీసుకున్నారు. ఈ కిడ్నాప్ లో అఖిల ప్రియ భర్త భార్గవ్ రామ్ స్వయంగా పాల్గొన్నట్లు విచారణలో తేలింది.

బాలీవుడ్ సినిమా చూసి కిడ్నాప్ ప్లాన్ వేసినట్లు తేలడంతో ప్రవీణ్ రావు సోదరుల కిడ్నాప్ కేసులో నిందితులుగా ఉన్న భార్గవ్ రామ్ మరియు గుంటూరు శ్రీనుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. నేటితో అఖిల ప్రియ కస్టడీ ముగియనున్న నేపథ్యంలో పోలీసులు మరిన్ని వివరాలు రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp