ఉపాధ్యాయ ఎన్నికల్లో ఆసక్తికర పోరు, కృష్ణా-గుంటూరు స్థానంపై కన్నేసిన పీడీఎఫ్

By Raju VS Mar. 06, 2021, 03:30 pm IST
ఉపాధ్యాయ  ఎన్నికల్లో ఆసక్తికర పోరు, కృష్ణా-గుంటూరు స్థానంపై కన్నేసిన పీడీఎఫ్

ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఎమ్మెల్యే కోటాలో సీట్లు ఆరుకి ఆరు వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. ప్రతిపక్షం పోటీ చేయలేని పరిస్థితిలో ఉండడంతో ఏకగ్రీవంగా దక్కించుకుంది. దాంతో ఇప్పుడు అందరి దృష్టి ఉపాధ్యాయ స్థానాలపై పడింది. రెండు ఉపాధ్యాయ నియోజకవర్గాలకు ఈసారి ఎన్నికలు జరుగుతున్నాయి. అందులో గోదావరి జిల్లాల సీటు ఒకటైతే, కృష్ణా-గుంటూరు జిల్లాల నియోజకవర్గం మరొటి. ప్రస్తుతం ఇక్కడ సిట్టింగ్ స్థానంలో టీడీపీ శిబిరంలో పనిచేసిన ఏఎస్ రామకృష్ణ మరోసారి బరిలో దిగారు. ఆయనకు టీడీపీ వర్గాలు మద్ధతునిస్తున్నాయి. తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం క్రియాశీలకంగా లేకపోయినా కొందరు నేతలు మాత్రం రామకృష్ణను బలపరుస్తున్నారు.

ఆయనకు పోటీగా పెద్ద సంఖ్యలో అభ్యర్థులున్నప్పటికీ పీడీఎఫ్ బలపరుస్తున్న అభ్యర్థి గట్టి పోటీనిస్తున్నారు. గతంలో పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీగా ప్రాతినిధ్యం వహించిన బొడ్డు నాగేశ్వర రావు ఈసారి బరిలో దిగారు. ఆయనకు ప్రస్తుతం పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఉన్న కే ఎస్ లక్ష్మణరావు అండగా ఉన్నారు. యూటీఎఫ్ బలం తోడవుతోంది. అదే సమయంలో ఉపాధ్యాయుల్లో గుర్తింపు ఉన్న నాయకుడిగా బొడ్డు పేరు వినిపిస్తోంది. దాంతో పాటుగా సిట్టింగ్ ఎమ్మెల్సీ పట్ల కొంత అసంతృప్తి ఉందని ప్రచారం సాగుతోంది. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో శ్రద్ధ పెట్టకపోవడం, రాజకీయంగా చంద్రబాబుతో కలిసి సాగిన నేపథ్యంలో ఉపాధ్యాయ ఓటర్లు రెండోసారి అవకశం ఇచ్చేందుకు సిద్ధంగా లేరని చెబుతున్నారు. దాంతో ఇది ప్రత్యర్థి పీడీఎఫ్ అభ్యర్థికి ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.

టీడీపీకి ఎదురుగాలి వీస్తున్న తరుణంలో నేరుగా టీడీపీ అభ్యర్థినని చెప్పుకోవడానికి కూడా ఏఎస్ రామకృష్ణ కూడా సిద్ధం కాలేకపోవడం గమనార్హం. అదే సమయంలో అధికార పార్టీ మద్ధతు కోసం పలువురు ప్రయత్నాలు చేశారు. జగన్ ఆశీస్సులుంటే మండలిలో జెండా ఎగరేయవచ్చని అశించారు. కానీ జగన్ మాత్రం ససేమీరా అనడంతో ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి వైఎస్సార్సీపీ మరోసారి పోటీగా దూరంగా ఉంది. మొదటి నుంచి ఆపార్టీ ఇదే పద్ధతిలో సాగుతుండగా, ఈసారి కూడా అదే బాటన నడవడం విశేషం. దాంతో ప్రతిపక్ష టీడీపీ మీద వ్యతిరేకత, అధికార పార్టీ బరిలో లేకపోవడం కూడా పీడీఎఫ్ కి సానుకూలంగా మారుతుందనే సంకేతాలు వస్తున్నాయి. దానికి తోడు విస్తృతంగా క్యాడర్ బలం ఉండడంతో ప్రచారం జోరుగా చేస్తున్నారు. ఇవన్నీ కలిసి బొడ్డు నాగేశ్వరరావుకి బలంగా మారే అవకాశం ఉందనే అంచనాలు వస్తున్నాయి.

ఈనెల 14న జరగబోతున్న పోలింగ్ లో ఉపాధ్యాయులు తమ ప్రతినిధిని ఎన్నుకునే అవకాశం ఉంది. అయితే మండలిలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీల ప్రభావం పెద్దగా ఉండడం లేదనే నిరాకసక్తత ఓటర్లలో వినిపిస్తోంది. ఇక గోదావరి జిల్లాల ఉపాధ్యాయ సీటు పీడీఎఫ్ సిట్టింగ్ అభ్యర్థి రాము సూర్యారావు పోటీకి దూరంగా ఉన్నారు. ఆయన మద్ధతుతో యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు షేక్ సాబ్జీ పోటీ చేస్తున్నారు. ఆయనకు పోటీగా పలువురు రంగంలో ఉండడంతో ఇక్కడ పోటీ ఆసక్తిగా కనిపిస్తోంది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp