యూపీ అసెంబ్లీ ఎన్నికలు బెంగాల్ అనుభవం పునరావృతమవుతోందా, బీజేపీ ఏం ఆశిస్తోంది

By Raju VS Jan. 14, 2022, 08:30 pm IST
యూపీ అసెంబ్లీ ఎన్నికలు  బెంగాల్ అనుభవం పునరావృతమవుతోందా, బీజేపీ ఏం ఆశిస్తోంది

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల వేడి రాజుకుంది, ఏడు దశలుగా జరిగే ఎన్నికలకు ఇప్పటికే పలు పార్టీలు అభ్యర్థులను ఖరారు చేస్తున్నాయి. తొలి జాబితా విడుదల చేస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా యోగీ ఆదిత్యనాథ్ క్యాబినెట్ మంత్రులు, పలువురు బీజేపీ ఎమ్మెల్యేలు సమాజ్ వాదీ పార్టీ వైపు క్యూ కట్టడం చర్చనీయాంశం అవుతోంది. యూపీ ఎన్నికల్లో ఇది ప్రభావితం చేసే అంశంగా కనిపిస్తోంది. వరుసగా బీజేపీని వీడుతున్న వారంతా ఎస్పీ వైపు మళ్లడం, అఖిలేష్ కి జై కొట్టడం కీలక పరిణామంగా భావించాల్సి ఉంటుంది. వాస్తవానికి కొత్తగా వచ్చి చేరుతున్న నేతలందరినీ సంతృప్తి పరచగల అవకాశం ఎస్పీలో కూడా లేదు. ఇప్పటికే కొంతకాలంగా ఎస్పీలో క్రియాశీలకంగా ఉన్న నేతలకు దాదాపు టికెట్లు ఖరారయిన దశలో చివరి నిమిషంలో వస్తున్న వారిలో ఎస్పీ నేతలకు, అఖిలేష్ కి కూడా తలనొప్పులు తప్పవు.

అయినప్పటికీ యూపీ పరిణామాలు మాత్రం బీజేపీకి బెంగ పుట్టిస్తున్నాయి. ముఖ్యంగా బెంగాల్ పరిణామాలను గుర్తు చేస్తున్నాయి. బెంగాల్ లో కూడా ఓ దశలో వేగంగా ముందుకొచ్చిన బీజేపీ చివరకు పరాభవం పాలయ్యింది. దాదాపు అధికారపీఠం దక్కుతుందనే వాతావరణం నుంచి ప్రతిపక్షంలో కూడా కొన్ని స్థానాలకే పరిమితం కావాల్సిన స్థితికి బీజేపీ చేరింది. దానికి ప్రధాన కారణం రాజకీయ సమీకరణాలు. బీజేపీ వర్సెస్ అదర్స్ అనే వాతావరణం నుంచి బీజేపీ వర్సెస్ మమతా అన్నట్టుగా మారింది. బీజేపీ వ్యతిరేక ఓట్లు మమతా, లెఫ్ట్, కాంగ్రెస్ పార్టీల మధ్య చీలుతాయని అంతా ఆశించారు. ముఖ్యంగా మైనార్టీ ఓట్లు ప్రబలంగా ఉన్న రాష్ట్రంలో అలాంటి చీలిక వస్తే అది తమకు మేలు చేస్తుందని బీజేపీ ఆశించింది. కానీ తీరా చూస్తే బీజేపీని ఓడించగల సత్తా ఉన్న నేతగా అందరూ మమతా బెనర్జీనే చూశారు. బీజేపీ వర్సెస్ బెంగాల్ అన్నట్టుగా మమతా మార్చేయడంతో బెంగాలీలు దీదీకి జై కొట్టేశారు. చివరకు బీజేపీ ఆశలు గల్లంతయ్యాయి.

ఇప్పుడు యూపీలో కూడా బీజేపీ వర్సెస్ అదర్స్ అన్నట్టుగా ఉంటే పరిణామాలు తమకు ఆశాభావంగా ఉంటాయనే అంచనా కమలనాధుల్లో కూడా ఉంది.ముఖ్యంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలితే అది అంతిమంగా పాలక బీజేపీ నెత్తిన పాలుపోసినట్టవుతుంది. అందులోనూ ఒకనాటి అధికార పక్షాలు ఎస్పీ, బీఎస్సీ కూడా ఎదురెదురుగా తలపడితే అది బీజేపీకి మేలు చేస్తుంది. కానీ తీరా తాజా పరిస్థితులు దానికి విరుద్ధంగా ఉన్నాయి. యూపీలో బీజేపీని ఓడించే సత్తా కేవలం అఖిలేష్ కే ఉందనే అభిప్రాయం బలపడుతోంది. బీజేపీని వీడుతున్న నేతలంతా ఎస్పీ వైపు మళ్లుతున్నారు. చివరకు బీఎస్పీలో కూడా అసంతృప్తులు సమాజ్ వాదీ పార్టీ వైపు చేరుతున్నారు. ఇప్పటికే ఎంబీసీ నేతలు కూడా ఎస్పీని ఆశ్రయించారు. ఇలా వివిధ వర్గాల నేతలంతా ఇప్పుడు ప్రత్యామ్నాయంగా ఎస్పీ ని చూస్తుండడం బీజేపీ నేతలకు కంటిమీద కునుకులేకుండా చేసే వాతావరణం తీసుకువస్తోంది.

బీఎస్పీ బలహీనపడడం బీజేపీకి చేటు చేసే అంశంగా మారుతోంది. ఇప్పటికే బీజేపీలో అంతర్గత పరిస్థితులు అంత సవ్యంగా లేవు. అదే సమయంలో విపక్షాల మధ్య ఓట్ల చీలిక ఉపయోగపడుతుందని ఆశిస్తే అందుకు విరుద్దంగా ఎస్పీ నాయకుడు అఖిలేష్ యాదవ్ కి ఆదరణ పెరుగుతోంది. ఇది యూపీలో ముఖ్య పరిణామంగా భావించాలి. చాలాకాలంగా యూపీలో బహుముఖ పోటీలు జరుగుతున్నాయి. కానీ ఈసారి అది ద్విముఖ పోటీగా మారుతుందా అనే అభిప్రాయం ఉంది. కాంగ్రెస్ బరిలో ఉన్నప్పటికీ కేవలం అమేథీ, రాయ్ బరేలీ ప్రాంతాలకే ఆ పార్టీ పరిమితం కాబోతోంది. ఇక మిగిలిన ప్రాంతాల్లో మిత్రపక్షాలతో కలిసి సమాజ్ వాదీ జోరుగా ముందుకు సాగుతోంది. దాంతో బీజేపీ వర్సెస్ సమాజ్ వాదీ పార్టీ అన్నట్టుగా సీన్ పరిణమిస్తోంది. ఇది అధికార పార్టీకి నష్టం చేస్తుందనడంలో సందేహం లేదు. యోగీ వైఫల్యాలను ఎండగట్టడంలో అఖిలేష్ విజయవంతమవుతున్నట్టు ఆయన సభలకు వస్తున్న జనసంఖ్య చెబుతోంది. ఈ పరిస్థితుల్లో ముఖాముఖీ పోటీగా మారితే యూపీలో పరిణామాలు ఆసక్తికరంగా ఉంటాయనడంలో సందేహం లేదు.

యూపీలో ఎస్సీలు బీఎస్పీ వైపు, మైనార్టీ-యాదవ్ కాంబినేషన్ లో ఎస్పీ, బ్రాహ్మాణ- ఠాకూర్ల సారథ్యంలో బీజేపీ పోటీ పడుతూ ఉంటాయి. బ్రాహ్మణ ఓటర్లతో పాటుగా మైనార్టీల నుంచి ఉన్న కొద్దిపాటి మద్ధతుతో కాంగ్రెస్ ఉనికి చాటుకుంటోంది. నాన్ యాదవ్ బీసీలు కూడా బీజేపీకి అండగా ఉండడంతో వరుసగా 2014,17,19 ఎన్నికల్లో బీజేపీ తిరుగులేని విజయాలు దక్కించుకుంది. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో 284 అసెంబ్లీ స్థానాల్లో ఆధిక్యాన్ని నిలబెట్టుకుంది. ఏకంగా 51 శాతం ఓట్లు దక్కించుకుంది. దాంతో బీజేపీ తన బలమేంటో చాటిచెప్పింది. అయితే ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఈ బలం ఏమేరకు నిలుపుకుంటుందన్నది ప్రశ్నార్థకం అవుతోంది. విపక్షాల మధ్య ఓట్ల చీలిక నివారించి, ప్రత్యామ్నాయ నేతగా ఎదగడంలో అఖిలేష్ విజయవంతం కావడం మూలంగా యూపీ పరిణామాలు ఎటు మరలుతాయన్నది కీలక అంశంగా ఉంటుంది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp