బెంగాల్ బీజేపీ కి మరో ఎదురుదెబ్బ, మమత గూటిలో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు

By Raju VS Jun. 11, 2021, 05:44 pm IST
బెంగాల్ బీజేపీ కి మరో ఎదురుదెబ్బ, మమత గూటిలో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు

బెంగాల్ లో ఎన్నికల తర్వాత కూడా రాజకీయ వేడి చల్లారడం లేదు. మమతా తన దూకుడు ప్రదర్శిస్తూనే ఉంది. తాజాగా బీజేపీ ఎమ్మెల్యేలను తన పార్టీలో చేర్చుకోవడానికి గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేసింది. ప్రస్తుతం బీజేపీ ఆలిండియా వైస్ ప్రెసిడెంట్ గా ఉన్న ముకుల్ రాయ్ ఆపార్టీకి గుడ్ బై చెప్పేసి మమతా గూటిలో చేరిపోయారు. టీఎంసీ కార్యాలయంలో మమతా బెనర్జీతో ఆయన భేటీ అయ్యారు. ఆ తర్వాత ముకుల్ రాయ్ తో పాటుగా ఆయన తనయుడు సుభ్రాంన్షు రాయ్ కూడా టీఎంసీ కండువా కప్పుకున్నారు.

ముకుల్ రాయ్ వర్గానికి చెందిన 20 మంది ఎమ్మెల్యేలు జెండా మార్చేందుకు సిద్ధమయినట్టు చెబుతున్నారు. భారీ సంఖ్యలో మాజీ ఎమ్మెల్యేలు, ఇతర నేతలు కూడా మళ్ళీ ముకుల్ వెంట సొంతగూటికి చేరేందుకు సన్నద్ధమయ్యారు. బీజేపీ లో ఎవరూ ఉండరని, బెంగాల్లో ఆపార్టీ తుడిచిపెట్టుకుపోతుదంటూ వ్యాఖ్యానించారు.

Also Read:ఢిల్లీలో యోగి.. యూపీలో ఏం జ‌ర‌గ‌బోతోంది?

శారదా చిట్ ఫండ్ స్కామ్ లో ముకుల్ రాయ్ మీద తొలుత సీబీఐ కేసు నమోదయ్యింది. ఆ తర్వాత ఆయన బీజేపీలో చేరారు. కేసులో ఆయనకు ఊరట దక్కింది. అయితే బెంగాల్ లో బీజేపీని బలోపేతం చేసేందుకు ఆయన తీవ్రంగా శ్రమించారు. మమతా నుంచి అనేక అవరోధాలు ఎదురయినా వాటిని ఎదుర్కొంటూ ముందుకు సాగారు. చివరి నిమిషంలో పార్టీలో చేరిన సువేందు అధికారి నందిగ్రామ్ లో మమతాని ఛాలెంజ్ చేసి ఓడించారు. దాంతో ఆయనకే పార్టీలో ప్రాధాన్యత పెరిగింది. ప్రతిపక్ష నేత హోదా కూడా సువేందుకు దక్కడంతో ముకుల్ రాయ్ తీవ్రంగా నిరాశ చెందారు. తన గ్రూపులో ఆయన ప్రతిపాదించిన నాయకుడిని అధిష్టానం కాదనడంతో అసంతృప్తికి గురయ్యారు.


అదే సమయంలో బెంగాల్ లో ఉన్న రాజకీయ పరిస్థితులతో మళ్లీ టీఎంసీ సొంత గూటికి చేరడమే శ్రేయస్కరమని నిర్ణయించుకున్న ఆయన మమతా బెనర్జీతో భేటీ అయ్యారు. ముఖ్యమంత్రి ఆశీస్సులు తీసుకున్నారు. మళ్లీ పార్టీలో చేరడానికి మార్గం సుగమం చేసుకున్నారు. ముకుల్ రాయ్ అనుచరులుగా ఉన్న ఎమ్మెల్యేలు, ఇతర నేతలు కూడా రేపు లేదా అతి త్వరలోనే పార్టీ మార్చేస్తారని చెబుతున్నారు.

Also Read:బీజేపీలోకి రాహుల్ సన్నిహితుడు.. కాంగ్రెసుకు కోలుకోలేని దెబ్బ

పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలు పార్టీని వీడబోతున్న తరుణంలో వారిని వారించేదుకు బీజేపీ చివరి వరకూ ప్రయత్నాలు చేసింది. బుజ్జగింపు చర్యలకు పూనుకుంది. స్వయంగా సువేందు హస్తిన వెళ్లి అమిత్ షా- మోడీ ఆదేశాల మేరకు ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా భేటీలు నిర్వహించారు. అయినప్పటికీ ఫలితం దక్కలేదని తాజా పరిణామాలు చాటుతున్నాయి. బీజేపీని వీడి వస్తున్న బృందం భవిష్యత్ ఏమిటన్నది ప్రస్తుతానికి ఆసక్తికరమే.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp