అచ్చెం నాయుడు తరువాత ఎవరు..?! ఎమ్మెల్సీ సోము వీర్రాజు జోస్యం నిజమవుతుందా..?

By Voleti Divakar Jun. 12, 2020, 10:47 pm IST
అచ్చెం నాయుడు తరువాత ఎవరు..?! ఎమ్మెల్సీ సోము వీర్రాజు జోస్యం నిజమవుతుందా..?

తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో భారీ అవినీతి జరిగిందని ఆది నుంచి మొత్తుకుంటున్నబిజెపిలోని ఒక వర్గం మాజీ కార్మికశాఖ మంత్రి కె అచ్చెంనాయుడు అరెస్టును సమర్థిస్తోంది. త్వరలోనే మరో మాజీ మంత్రి కూడా అరెస్టు అయ్యే అవకాశాలు ఉన్నాయని కూడా వారు జోస్యం చెబుతున్నారు. ఆయన ఎవరన్నది ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

2014లో బిజెపిలోని ఒక వర్గం తెలుగుదేశం ప్రభుత్వానికి అతి సన్నిహితంగా మెలగా మరో వర్గం అంటీ ముట్టనట్టు వ్యవహరిస్తూ, టిడిపి ప్రభుత్వ అవినీతి విధానాలను ఎండగట్టేది. ఈ విషయంలో బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యుడు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు ముందుండే వారు. అచ్చెంనాయుడు అరెస్టును సమర్థించారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో భారీ కుంభకోణాలు జరిగాయని సోము చెప్పారు. అవినీతిలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బాహుబలి అని సోము అభివర్ణించారు. రక్తంలో షుగరును గుర్తించే గ్లూకోమీటరు పరికరాన్ని రూ. లక్ష 75వేలకు కొనుగోలు చేశారని సోము వెల్లడించారు. అలాగే రూ. 10 విలువైన మాత్రలను ఎన్నో రెట్ల ఎక్కువ ధరకు కొనుగోలు చేశారని సోము వెల్లడించారు.

రూ. 17వేల విలువైన ఒక వైద్య పరికరాన్ని రూ. 70వేలకు ఈ వ్యవహారంలో మంత్రిత్వశాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి ప్రమేయం లేకుండానే టెండర్లు కొనుగోళ్లు జరిపారని కూడా సోము చెబుతున్నారు. అచ్చెంనాయుడు తరువాత గతంలో ఇసుకను భారీగా దోచేసిన మరో మంత్రి కూడా అరెస్టు కావడం ఖాయమని సోము వీర్రాజు పేర్కొన్నారు. ఆ అరెస్టు అయ్యే మాజీ మంత్రి ఎవరన్నది సోము వెల్లడించలేదు. అయితే దీనిపై రకరకాల ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. వైసిపి నుంచి టిడిపిలో చేరిన అప్పటి బొబ్బిలి ఎమ్మెల్యే సుజయ కృష్ణ రంగారావుకు అప్పగించే వరకు గనులశాఖ చంద్రబాబునాయుడు వద్దే ఉండేదని వైసిపి నాయకులు గుర్తుచేస్తున్నారు. అవినీతి కేసులో మాజీ మంత్రిని అరెస్టు చేస్తే టిడిపి అధినేత చంద్రబాబునాయుడు ఇబ్బందిపడటం విడ్డూరంగా ఉందని సోము వీర్రాజు ఎద్దేవా చేశారు. పార్టీ శ్రేణులన్నీ రోడ్డు పైకి రావాలని ఆయన పిలుపునివ్వడం శోచనీయమన్నారు.

కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభంను 2,500 మంది పోలీ సులతో అరెస్టు చేయించారని సోము వీర్రాజు గుర్తుచేస్తున్నారు. ముద్రగడ సొంత గ్రామం కిర్లంపూడి జనాభా కన్నా ఎక్కువ మంది పోలీసు బలగాలతో రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారని సోము వీర్రాజు గుర్తుచేశారు.

తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రూ. 2లక్షల కోట్ల మేర అవినీతి జరిగిందని వైసిపి ప్రభుత్వం ఒక పుస్తకాన్ని ప్రచురించిందని, దాని ప్రకారం ఒక్కొక్కర్నీ అరెస్టు చేయాలని సోము వీర్రాజు డిమాండ్ చేశారు. సోము వీర్రాజు డిమాండ్ బాగానే ఉన్నా పోలవరం ప్రాజెక్టును ఎటిఎంగా మార్చుకుని నిధులు దుర్వినియోగం చేశారని సాక్షాత్తూ ప్రధాని నరేంద్రమోడీయే ఎన్నికల సభలో చంద్రబాబునాయుడుపై ధ్వజమెత్తారు. ప్రస్తుతం కేంద్రంలో బిజెపి ప్రభుత్వమే అధికారంలో ఉన్న నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టు నిధుల వినియోగంపై కూడా సిబిఐ విచారణ జరిపిస్తే ప్రధాని స్థాయి వ్యక్తి ఆరోపణలకు తగిన బలం చేకూరుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp