ఆర్‌ఎస్‌ఎస్‌ నుంచి రాష్ట్ర మంత్రి వరకు.. పైడికొండల మాణిక్యాలరావు

By Jaswanth.T Aug. 01, 2020, 08:29 pm IST
ఆర్‌ఎస్‌ఎస్‌ నుంచి రాష్ట్ర మంత్రి వరకు.. పైడికొండల మాణిక్యాలరావు

రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ నుంచి బీజేపీ నాయకుడిగా, ఉమ్మడి ఆంధ్రపదేశ్‌లో దేవాదాయశాఖ మంత్రిగా పైడికొండల మాణిక్యాలరావు పశ్చిమగోదావరి జిల్లా వాసులకు గుర్తిండిపోయే ప్రాతనే పోషించారు. నెల రోజుల క్రితం కరోనా సోకడంతో శనివారం మృతి చెందిన ఆయన సేవలను రాష్ట్ర వ్యాప్తంగా పలువురు గుర్తు చేసుకున్నారు.

1961లో మాణిక్యాలరావు జన్మించారు. ఆయనకు భార్య సూర్యకుమారి, కుమార్తె సింధు ఉన్నారు. కుమార్తెకు వివాహమైంది. ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రభావంతో ఆయోధ్య కరసేవలో కూడా ఆయన పాల్గొన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా, రాష్ట్ర కార్యదర్శిగా కూడా సేవలందించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి కూడా ఆయన పేరు పరిశీలించినట్లు చెబుతారు. ఆయన రాజకీయ జీవితం మొత్తం బీజేపీలోనే కొనసాగింది. ఆయన తొలుత తాడేపల్లిగూడెం పట్టణంలో 13వ వార్డు కౌన్సిలర్‌గా పోటీ చేసి ఓటమి చెందారు. అనంతరం బీజేపీ సంబంధిత కార్యక్రమాల్లో పాల్గొనేవారు. మిత్రబృందాన్ని కలుసుకోవడానికి ఒక వేదికగా ఉంటుందన్న ఉద్దేశంతో తాడేపల్లి గూడెంలో సింధూ స్టూడియోను నిర్వహించేవారు. ఆ స్టూడియేనే కార్యస్థలంగా పార్టీ కార్యకలాపాలు నిర్వహించేవారు.

అనంతరం పలు వ్యాపారాలు నిర్వహించిన ఆయన రియల్‌ రంగంలో కూడా కాలుమోపారు. 2014లో బీజేపీ–టీడీపీ–జనసేన పొత్తులో భాగంగా తాడేపల్లిగూడెం పట్టణం సీటును బీజేపీకి కేటాయించారు. దీంతో అక్కడ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు మాణిక్యాలరావుకు అవకాశం దక్కింది. తన సమీప ప్రత్యర్ధి తోట పూర్ణగోపాల సత్యనారాయణ మీద 14 వేల ఓట్లకుపైగా మెజార్టీతో విజయం సాధించారు. పొత్తులో భాగంగా చంద్రబాబు కేబినెట్‌లో దేవాదాయ శాఖ మంత్రి పదవి కూడా వరించింది. 2014–18 వరకు మంత్రిగా సేవలందించారు.

2019 ఎన్నికల్లో నరసాపురం నుంచి బీజేపీ అభ్యర్ధిగా పోటీచేసారు. ఎమ్మెల్యేగా అయ్యేంత వరకు బీజేపీ మాణిక్యాలరావుగానే ఉన్న ఆయన ఆ తరువాత మంత్రి మాణిక్యాలరావుగా పశ్చిమగోదావరిలో తనదైన శైలిలో రాజకీయాల్లో చురుకైన పాత్రపోషించారని సహచరులు గుర్తు చేసుకున్నారు. 1955 నుంచి 2014 వరకు జరిగిన 13 ఎన్నికల్లోనూ తాడేపల్లిగూడెం స్థానం నుంచి ఒక్కసారి కూడా బీజేపీ విజయం సాధించలేదు. పైడికొండల మాణిక్యాలరావు రూపంలో ఆ పార్టీ పశ్చిమగోదావరి జిల్లాలో జెండాను ఎగురవేయగలిగింది. రాష్ట్రంలో బీజేపీ వాయిస్‌ను స్పష్టంగా విన్పించేందుకు పలు వేదికలపై ఆయన గట్టిగానే తన ఉద్దేశాలను చాటిచెప్పేవారు. అప్పుడే మాణిక్యాలరావులోని నాయకత్వ లక్షణాలు వెల్లడయ్యాయి. పశ్చిమగోదావరి జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో స్పష్టమైన ముద్రను ఆయన వేసారు. నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ వంటి సంస్థలను రాష్ట్రానికి తీసుకురావడంలో కీలకంగా వ్యవహరించారు.

నెల రోజల క్రితమే ఆయనకు కరోనా సోకింది. వెంటనే అప్రమత్తమై వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. అయినప్పటికీ ఆయన కోలుకోలేకపోయారు. తాను బాగానే ఉన్నానంటూ వీడియో సందేశాన్ని కూడా ఆయన విడుదల చేసారు. తనకు ఏం కాదని, బాగానే ఉన్నాని ధీమాగానే చెప్పారు. అయితే ఇతర ఆరోగ్య సమస్యలుకూడా ఉండడంతో ఆయన కరోనా నుంచి కోలుకోలేకపోయారు. అతర్గత అవయవాలకు ఇన్ఫెక్షన్‌ సోకడంతో ఆయన పరిస్థితి విషమించింది. ప్రజా ప్రతినిధులు, నాయకులకు కరోనా సోకి, చికిత్స అనంతరం సురక్షితంగానే బైటపడుతున్నారు. అయితే మాణిక్యాలరావు మాత్రం బైటపడలేకపోయారు. ఆయనకు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరిపించాలని సీయం వైఎస్‌ జగన్‌ అధికారులకు ఆదేశాలు జారీ చేసారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp