ఢిల్లీలో రైతుల పట్ల కనికరం లేకుండా ఏపీలో కర్షకుల కోసం కమలనాధుల ధర్నాలా

By Raju VS Jun. 10, 2021, 09:45 am IST
ఢిల్లీలో రైతుల పట్ల కనికరం లేకుండా ఏపీలో కర్షకుల కోసం కమలనాధుల ధర్నాలా

ఏపీలో రైతుల ధాన్యం కొనుగోళ్ల వ్యవహారంలో రికార్డు సృష్టించినట్టు వ్యవసాయ శాఖ ప్రకటించింది. ఏకంగా 24 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని మంత్రి కురసాల కన్నబాబు ప్రకటించారు. కానీ బీజేపీ నేతలు మాత్రం ధాన్యం కొనుగోళ్లు చేయడం లేదని, రైతులకు మద్ధతు ధర దక్కడం లేదంటూ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకు పూనుకున్నారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ , రాష్ట్ర అధ్యక్షుడు సహా అనేక మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఓవైపు హస్తినలో అన్నదాతలు అలుపెరగని ఉద్యమం చేస్తున్నారు. ప్రపంచం దృష్టిని ఆకర్షించేలా ఆందోళన సాగుతోంది. దేశ విదేశాల నుంచి వారికి సంఘీభావం వచ్చింది. అదే సమయంలో చలికి, ఎండకు, వానకు వెరువకుండా ఆరు నెలలుగా సాగిస్తున్న ఈ ఉద్యమంలో ఇప్పటికే 500 మంది రైతులు ప్రాణాలు కోల్పోయారు. ఢిల్లీ సరిహద్దుల్లో మొదలయిన ఈ ఉద్యమం అనేక రాష్ట్రాలను తాకింది. అయినా కేంద్రం మాత్రం కనికరించలేదు. మొదట్లో చర్చల పేరుతో కొంత ప్రయత్నం చేసినా ఆ తర్వాత పూర్తిగా విస్మరించింది.

రైతులు కోరుతున్నట్టు మూడు చట్టాలు రద్దు కాకపోయినా కనీసం గిట్టుబాటుధర అంశాన్ని చట్టంలో చేర్చాలని వారు ఆశించారు. కానీ ప్రభుత్వం మాత్రం కేవలం హామీ మాత్రమే ఇస్తాం తప్ప దానిని చట్టంలో చేర్చేది లేదంటూ మొండికేసింది. దాంతో అసహనం వ్యక్తం చేసిన రైతులు ఆందోళనను కొనసాగిస్తున్నారు. ఢిల్లీ సహా వివిధ రాష్ట్రాల్లో రైతులు ఉద్యమిస్తుంటే నోరుమెదకపకుండా, ఉద్యమాన్ని అణచివేసే ప్రయత్నాలకు దిగిన బీజేపీ ఏపీలో మాత్రం రైతుల సమస్యలపై ఆందోళన అంటూ నడిపిన ప్రహసనం పలువురిని విస్మయానికి గురిచేస్తోంది.

గిట్టుబాటు ధరలు కావాలంటూ రైతుల నిరసన తెలుపుతుంటే నిమ్మకునీరెత్తినట్టు వ్యవహరించి, ఏపీలో జగన్ ప్రభుత్వం మీద నిందలు వేసేందుకు పూనుకుంటున్న కమలదళం తీరు ఆశ్చర్యంగా మారుతోంది. ఢిల్లీలో ఓ మాట, గల్లీలో మరోమాట అన్నట్టుగా వారి తీరు ఉందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఏపీలో సన్నం రకాల ధాన్యం కొనుగోళ్లు సంపూర్ణంగా పూర్తయ్యాయి. రైతులకు చెల్లింపులు కూడా జరుగుతున్నాయి. అయినా మిల్లర్లదే రాజ్యం అంటూ బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలు విడ్డూరంగా కనిపిస్తున్నాయి. రైతుల మీద ప్రేమ ఉంటే తొలుత వ్యవసాయ చట్టాల రద్దు అంశం పరిశీలించాలని, అది చేయకుండా ఏపీలో ఇలాంటి ప్రయత్నాలు చేసినా ఆపార్టీకి ఎటువంటి ప్రయోజనం ఉండదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp