వ్యవసాయ చట్టాలపై ముందుకే, బీజేపీ అధిష్టానం నిర్ణయం, ఉద్యమం కొనసాగింపు కోసం రైతు సంఘాల ఏర్పాట్లు

By Raju VS Feb. 22, 2021, 01:30 pm IST
వ్యవసాయ చట్టాలపై ముందుకే, బీజేపీ అధిష్టానం నిర్ణయం, ఉద్యమం కొనసాగింపు కోసం రైతు సంఘాల ఏర్పాట్లు

దేశంలో గతంలో ఎన్నడూ లేని రీతిలో రైతు ఉద్యమం సాగుతోంది. సుమారు మూడు నెలలుగా రాజధాని సమీపంలో జాతీయ రహదారుల దిగ్బంధం నడుస్తోంది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను ఉపసంహరించాలనే డిమాండ్ తో రైతాంగం నిరసనలు సాగిస్తున్నారు. పశ్చిమ యూపీ, పంజాబ్, హర్యాన, రాజస్తాన్, ఉత్తరాఖండ్ వంటి రాష్ట్రాల్లో మహా పంచాయత్ లతో పోరు సాగుతోంది. దానికి ముందు రిపబ్లిక్ డే నాటి పరిణామాలు ప్రపంచమంతా చర్చనీయాంశమయ్యాయి. పలువురు సెలబ్రిటీల ట్వీట్లు, టూల్ కిట్ల అంశంతో పర్యావరణ ఉద్యమకారిణి దిశా రవిపై దేశద్రోహం కేసు వరకూ వెళ్లింది.

ఉద్యమం చల్లబడుతున్నట్టు ఓ సందర్భంలో కనిపించినప్పటికీ మళ్లీ ఉధృతం అయ్యింది. రాకేష్ తికాయత్ సారధ్యంలో మహా పంచాయత్ ల మూలంగా జాట్ సామాజికవర్గంలో బీజేపీ పట్టు చేజారిపోతుందనే ప్రచారం ఉంది. అదే సమయంలో పంజాబ్ మునిసిపల్ ఎన్నికల్లో బీజేపీ నాలుగో స్థానానికి పరిమితం కావడంతో హర్యానాలోనూ ఆ ప్రభావం ఉంటుందనే అభిప్రాయం వినిపిస్తోంది. అయినప్పటికీ బీజేపీ మాత్రం వెనకడుగు వేసేది లేదని తేల్చేసింది. తాజాగా జాతీయ కార్యవర్గ సమావేశంలో ఈ మేరకు తీర్మానం ఆమోదించింది. రైతుల సంక్షేమం కోసం కేంద్రం తెచ్చిన మూడు చట్టాలను సంపూర్ణంగా సమర్థించింది. చట్టాలను రూపకల్పన చేసిన మోడీని అభినందించింది. వ్యవసాయ చట్టాలపై దేశ వ్యాప్తంగా ప్రచారం నిర్వహించాలని తీర్మానించింది.

హస్తిన సమీపంలో రైతులు కూడా తమ ఆందోళన కొనసాగించేందుకు సన్నద్ధమవుతున్నారు. ఇప్పటికే వణికించే చలిలో పలువురు ప్రాణాలు కోల్పోయినా ఉద్యమం వైపు మొగ్గు చూపిన రైతులు ఇప్పుడు రాబోయే వేసవి కాలానికి సన్నద్ధమవుతున్నారు. దానికి అనుగుణంగా ఉద్యమ ప్రాంతాల్లో ఏర్పాట్లు చేసుకుంటున్నారు. సింఘీ, టిక్రీ, ఘాజీపూర్ సరిహద్దుల్లో వేసవి తీవ్రతను తట్టుకునేలా గడ్డితో తాత్కాలిక టెంట్లను సిద్ధం చేసుకుంటున్నారు. దాంతో మరికొన్ని నెలల పాటు ఉద్యమం కొనసాగుతుందనే అంచనాలో వారు ఉన్నట్టు కనిపిస్తోంది. ఏడాదికి సరిపడా సరుకులతో వచ్చామని, కేంద్రం వెనక్కి తగ్గే వరకూ ఉద్యమం కొనసాగుతుందని ప్రారంభంలోనే ప్రకటించిన రైతులు దానికి అనుగుణంగా ముందుకు సాగుతున్నారు.

అటు ప్రభుత్వం , ఇటు ఉద్యమకారులు వెనక్కి తగ్గే సూచనలు ఇప్పట్లో లేవని ఈ పరిణామాలు చాటుతున్నాయి. రాజకీయంగా రైతులను రెచ్చగొట్టి విపక్షాలు ఉద్యమాలు నిర్వహిస్తున్నాయని ఆరోపిస్తున్న బీజేపీ నేతలు దానికి ముందు ఖలీస్తాన్ సహా వివిధ ఆరోపణలు గుప్పించారు. అదే సమయంలో మోడీ ప్రభుత్వం మొండిగా సాగుతూ రైతుల అభిప్రాయాలను తోసిపుచ్చుతున్న తీరు ప్రజాస్వామ్య విరుద్ధమని విపక్షాలు మండిపడుతున్నాయి. రాజకీయంగా ఈ వ్యవహారం ఎక్కడ ముగింపు అన్నది అంతుబట్టని అంశంగా ఉంది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సంచలనంగా మారిన నేపథ్యంలో రైతు ఉద్యమం, సాగు చట్టాల పరిస్థితి ఏమిటన్నది చర్చనీయాంశం అవుతోంది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp