బీజేపీ ఆ లోటును భ‌ర్తీ చేసింది..!

By Kalyan.S Aug. 03, 2020, 08:09 am IST
బీజేపీ ఆ లోటును భ‌ర్తీ చేసింది..!

భార‌తీయ జ‌న‌తా పార్టీ నూత‌నంగా ప్ర‌క‌టించిన క‌మిటీని ప‌రిశీలిస్తే... వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌రించిన‌ట్లు క‌నిపిస్తోంది. ప్ర‌ధానంగా రాష్ట్రానికి గుండెకాయ వంటి గ్రేట‌ర్ హైద‌రాబాద్ విష‌యంలో మ‌రింత ప్ర‌ణాళికా బ‌ద్ధంగా వ్య‌వ‌హ‌రించిన‌ట్లు తెలుస్తోంది. రాబోయే గ్రేట‌ర్ ఎన్నిక‌ల‌ను దృష్టిలో పెట్టుకుని ఈ క‌మిటీలో ఎక్కువ మందికి ఆ ప్రాంత నేత‌ల‌కే స్థానం క‌ల్పించిన‌ట్లు తెలుస్తోంది. దీంతో పాటు.. రాష్ట్ర క‌మిటీ అధ్య‌క్షులుగా ఇప్ప‌టి వ‌ర‌కూ కొన‌సాగిన వారిలో ఎక్కువ మంది గ్రేట‌ర్ కు చెందిన నేత‌లే ఉన్నారు. కానీ.. ఈ సారి మాత్రం క‌రీంన‌గ‌ర్ ఎంపీ బండి సంజ‌య్ ను అధ్య‌క్షుడిగా నియ‌మించింది. నాటి నుంచి అంద‌రి దృష్టీ రాష్ట్ర క‌మిటీపైనే ప‌డింది. 23 మందితో కూడిన రాష్ట్ర క‌మిటీలో 13 ప‌ద‌వుల‌ను గ్రేట‌ర్ హైద‌రాబాద్ కు చెందిన నేత‌ల‌కే కేటాయించి గ్రేట‌ర్‌లో అధ్య‌క్షుడు లేని లోటును బీజేపీ భ‌ర్తీ చేసేసింది. 8 మంది ఉపాధ్యక్షులు, నలుగురు ప్రధాన కార్యదర్శులు, 8 మంది అధికార ప్రతినిధులు, ఇద్దరు ట్రెజరర్స్, కార్యక్రమ కార్యదర్శితో కూడిన క‌మిటీలో ఆరుగురు మహిళలకు చోటు కల్పించారు.

గ్రేట‌ర్ నేత‌ల‌కు కీల‌క బాధ్య‌త‌లు

రాష్ట్ర క‌మిటీలో అత్య‌ధిక మందికి స్థానం క‌ల్పించ‌డంతో పాటు కీల‌క బాధ్య‌త‌ల‌ను బీజేపీ అప్ప‌గించింది. యువ మోర్చా, మ‌హిళా మోర్చా, ఓసీబీ మోర్చా అధ్య‌క్షుల‌ను ఇక్క‌డి నుంచే ఎంపిక చేసింది. ఖైర‌తాబాద్ మాజీ ఎమ్మెల్యే చింత‌ల రామ‌చంద్రారెడ్డికి మ‌రోసారి రాష్ట్ర క‌మిటీలో ప్రాధాన్యం క‌ల్పించారు. రాష్ట్ర శాఖ ఉపాధ్య‌క్షుడిగా ఆయ‌న‌ను నియ‌మించారు. ఉప్ప‌ల్ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్‌ఎస్‌ ప్రభాకర్ కు కూడా ఉపాధ్య‌క్ష ప‌ద‌వి కేటాయించారు. ప్ర‌ధాన కార్య‌ద‌ర్శులుగా బండారు శృతి, మంత్రి శ్రీనివాసులను నియ‌మించారు.

మ‌‌హిళా మోర్చా అధ్య‌క్షురాలి ప‌ద‌వి సైతం అంబ‌ర్ పేట‌కు చెందిన నేత‌కే ద‌క్కింది. గీతామూర్తిని నియ‌మించారు. యువ మోర్చా అధ్య‌క్షుడిగా మేడ్చ‌ల్ అర్బ‌న్ కు చెందిన భానుప్ర‌కాష్ ను, ఓబీసీ మోర్చా అధ్య‌క్షుడిగా గోల్కొండ‌కు చెందిన ఆలె భాస్క‌ర్ కు అప్ప‌గించారు. ఈ క‌మిటీలో గ్రేట‌ర్ నాయ‌కుల‌కు కేటాయించిన ప్రాధాన్య‌త‌ను ప‌రిశీలిస్తే వ్యూహాత్మ‌క ఎత్తుగ‌డ క‌నిపిస్తోంది. సామాజిక వర్గాల పరంగా కూడా సమ న్యాయం చేసినట్లు కనిపిస్తోంది. అలాగే ఎక్కువ మందికి ప‌దవులు కేటాయించి రానున్న జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల్లో బీజేపీ స‌త్తా చాటాలని తహ తహ లాడుతోంది. త్వ‌ర‌లో ఏర్పాటు చేయ‌నున్న గ్రేట‌ర్ క‌మిటీల్లో పార్టీ ఎటువంటి నిర్ణ‌యాలు తీసుకుంటుందో చూడాలి. ఇప్ప‌టికే గ్రేట‌ర్ ను నాలుగు భాగాలుగా విడ‌దీసి నాలుగు క‌మిటీలు వేయాల‌ని అధినాయ‌క‌త్వం నిర్ణ‌యించింది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp