అమరావతిలో విఠలాచార్య బొమ్మలు !

By Voleti Divakar Nov. 21, 2020, 08:45 pm IST
అమరావతిలో విఠలాచార్య బొమ్మలు !

వికేంద్రీకరించే రాజధానిలో విఠలాచార్య బొమ్మలు ఏమిటని ఆశ్చర్యపోవద్దు. అక్కడి నిర్మాణాలను బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు విఠలాచార్య చిత్రాలతో పోల్చారు. ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి సహకారాన్ని తీసుకుని గ్రాఫిక్స్ లో రాజధానిగా అమరావతని అద్భుతంగా చూపించారు మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబునాయుడు. అయితే బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మాత్రం అమరావ తీని విఠలాచార్య బొమ్మలతో పోల్చారు.

సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి లేని రోజుల్లోనే విఠలాచార్య తన సినిమాల్లో అద్భుతాలు చూపించిన సంగతి తెలిసిందే. రూ. 1800కోట్లతో కేంద్ర ప్రభుత్వ నిధులతో ఎయిమ్స్ భవనాలను పక్కాగా నిర్మించామని, చంద్రబాబునాయుడు మాత్రం రూ. 7వేల 200కోట్లు ఖర్చు చేసి తాత్కాలిక భవనాలను నిర్మించారని ఎద్దేవా చేశారు. అమరావతి భ్రమరావతి, పోలవరం, ప్రత్యేక హోదా, పంచాయితీ ఎన్నికలు ఇలా చంద్రబాబు గ్యాంగ్ మీడియా ఏదో వివాదాన్ని సృష్టించి, దాని పై రాజకీయాలు చేస్తుందని సోము వీర్రాజు ధ్వజమెత్తారు. ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు పలు రకాలుగా మాట్లాడారని ఆయన గుర్తు చేశారు.

పంచాయితీ ఎన్నికలు జరగకపోతే కొంపలు మునిగిపోతాయా.... ఎన్నికలు జరగకపోతే ఏదో జరిగిపోతుందన్నట్లు రాద్దాంతం చేస్తున్నారని సోము వ్యాఖ్యానించారు. టిడిపి, వైసిపి హయాంలో కేంద్ర నిధులతో జరుగుతున్న అభివృద్ధిని పక్కదారి పట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని సోము ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర నిధుల వినియోగంలో అవినీతి జరిగిందని ఆయన ఆరోపించారు. తిరుపతి ఉప ఎన్నికల్లో బిజెపి-జన సేన కలిసి పోటీ చేస్తాయని చెప్పారు. మరో దుబ్బాక ఫలితం పునరావృతమవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp