నేపాల్‌ ప్రధాని కేపీ శర్మ ఓలికి ఎదురు దెబ్బ...కొత్త మ్యాప్‌కు బ్రేక్ వేసిన పార్లమెంట్‌

By Srinivas Racharla May. 27, 2020, 08:16 pm IST
నేపాల్‌ ప్రధాని కేపీ శర్మ ఓలికి ఎదురు దెబ్బ...కొత్త మ్యాప్‌కు బ్రేక్ వేసిన పార్లమెంట్‌

భారత్‌కు చెందిన లిపులేఖ్, కాలాపాని, లింపియాధురా మూడు పట్టణాలను తమ భూభాగాలుగా చూపుతూ నేపాల్ రూపొందించిన కొత్త మ్యాప్‌కు ఆ దేశ పార్లమెంట్ బ్రేక్‌ వేసింది. ఈనెల మే 18వ తేదీన భారత భూభాగాలను తమవిగా చూపుతున్న కొత్త మ్యాప్‌ను నేపాల్ కేబినెట్ ఆమోదించింది. కానీ కొత్త మ్యాప్ ఆమోదానికి నేపాల్ పార్లమెంట్‌లో రాజ్యాంగ సవరణ తప్పనిసరి. అయితే రాజ్యాంగ సవరణ ఆమోదం పొందడానికి అవసరమైన పార్లమెంట్‌ సభ్యుల ఆమోదం పొందడంలో ప్రధాని కేపీ శర్మ ఓలీ విఫలమయ్యారు.

గోర్ఖా జాతీయ వాదాన్ని తెరపైకి తెచ్చి లబ్ధి పొందాలని ప్రధాని భావిస్తున్నారని, ఇందులో ఆయన వ్యక్తిగత ప్రయోజనాలు దాగి ఉన్నాయని ప్రత్యర్ధులు ఆరోపిస్తున్నారు. అలాగే ప్రతిపక్ష నేపాల్ కాంగ్రెస్ తమ పార్టీ కేంద్ర వర్కింగ్‌ కమిటీలో చర్చించాకే తన వైఖరిని తెలియజేస్తామని ప్రకటించింది. దీంతో పార్లమెంట్‌లో రాజ్యాంగ సవరణ బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించుకోవాలని ఆశపడ్డ నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ ప్రయత్నాలు విఫలమయ్యాయి.

దీంతో రాజ్యాంగ సవరణ ప్రక్రియ వాయిదా పడడంతో పార్లమెంట్‌లో ప్రధాని కేపీ శర్మ ఓలికి ఎదురు దెబ్బ తగిలింది. కానీ ప్రధాని ఓలి ప్రతిపక్షం తమ నిర్ణయంతో విభేదించడంతో బిల్లును తాత్కాలికంగా వాయిదా వేశామని పేర్కొన్నాడు. ఇంకా కొత్త మ్యాప్ ప్రచురణకు ఇదే బిల్లును తిరిగి మరో పది రోజులలో చట్టసభలో ప్రవేశపెడతామని వ్యాఖ్యానించడం గమనార్హం. కాగా నేపాల్‌ రూపొందించిన కొత్త మ్యాప్‌కు చారిత్రక ఆధారాలు లేవని, కృత్రిమంగా చేపట్టిన సరిహద్దు మార్పులు చెల్లవని భారత విదేశాంగ శాఖ ఇప్పటికే స్పష్టం చేసింది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp