సుప్రీంకోర్టు కమిటీ నుండి తప్పుకున్న భూపీందర్‌సింగ్‌ మాన్

By Rishi K Jan. 15, 2021, 07:12 am IST
సుప్రీంకోర్టు కమిటీ నుండి తప్పుకున్న  భూపీందర్‌సింగ్‌ మాన్

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా గడ్డ కట్టే చలిలోను వెరువక ఢిల్లీ శివారులో కొన్ని నెలలుగా రైతులు ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలపై స్టే ఇచ్చింది. అంతేకాకుండా రైతుల సమస్య పరిష్కారానికై నలుగురు సభ్యులతో కూడిన నిపుణుల కమిటీని కూడా సుప్రీంకోర్టు నియమిస్తూ రైతు ప్రతినిధులు, ప్రభుత్వంతో ఈ కమిటీ చర్చలు జరుపుతుందని సుప్రీంకోర్టు వెల్లడించింది. సుప్రీంకోర్టు నియమించిన కమిటీలో సభ్యులుగా హర్‌సిమ్రత్‌ మాన్, ప్రమోద్ జోషి, అశోక్ గులాటి, అనిల్ ధన్వంత్, భూపేంద్ర సింగ్ మాన్ ఉన్నారు.

కాగా సుప్రీంకోర్టు నియమించిన కమిటీ సభ్యులు నూతన వ్యవసాయ చట్టాలను బహిరంగంగా సమర్ధించిన వారే అని విమర్శలు వెల్లువెత్తాయి. దాంతోపాటు రైతులను శాంత పరిచేందుకు,వారి పోరాటాన్ని నీరు గార్చేందుకు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో సుప్రీంకోర్టు ఈ కమిటీ డ్రామాకు తెరతీసిందని రైతు సంఘాల నాయకులు,రైతులు తీవ్రంగా ఆక్షేపించారు. దీంతో సుప్రీంకోర్టు నియమించిన కమిటీ నుంచి భారతీయ కిసాన్‌ సంఘం (బీకేయూ) అధ్యక్షుడు భూపీందర్‌సింగ్‌ మాన్ స్వచ్ఛందంగా తప్పుకున్నారు.

సుప్రీం కోర్ట్ నియమించిన కమిటీ నుండి భూపీందర్‌సింగ్‌ మాన్ తప్పుకోవడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేసింది. కమిటీ నుండి తప్పుకున్న అనంతరం భూపీందర్‌సింగ్‌ మాన్ మాట్లాడుతూ తనను కమిటీలో సభ్యునిగా ఎంపిక చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. రైతుల శ్రేయస్సు కోసం రైతు ప్రయోజనాల కోసం ఏ విషయంలోనూ రాజీ పడనని ఆయన స్పష్టం చేశారు.రైతుల సంక్షేమం కోసం ఎలాంటి త్యాగం అయినా చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు భూపీందర్‌సింగ్‌ మాన్ చెప్పుకొచ్చారు. కాగా ఉన్నట్లుండి ఆయన సుప్రీంకోర్టు నియమించిన కమిటీ నుండి తప్పుకోవడం చర్చకు దారి తీస్తుంది. భూపీందర్‌సింగ్‌ మాన్ తప్పుకోవడంతో ఆయన స్థానంలో మరొకరిని సుప్రీంకోర్టు ఎంపిక చేస్తుందా లేదా ముగ్గురితోనే కమిటీని కొనసాగిస్తుందా అన్న విషయంలో సందిగ్దత నెలకొంది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp