"సొంత కూతురు" కావాలి : కేసీఆర్ బాటలో మమతా మాట!బెంగాల్ ఎన్నికల నినాదం

By Mavuri S Feb. 22, 2021, 11:50 am IST
"సొంత కూతురు" కావాలి  : కేసీఆర్ బాటలో మమతా  మాట!బెంగాల్ ఎన్నికల నినాదం

తెలంగాణలో కేసీఆర్ ను నిలబెట్టిన ఆత్మ గౌరవ నినాదం, ప్రాంతీయ సెంటిమెంట్ ను బెంగాలీ ఎన్నికల్లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తెరపైకి తెస్తున్నారు. గట్టి పోటీ ఇస్తున్న భారతీయ జనతా పార్టీని అడ్డుకునేందుకు బెంగాల్ స్థానికుల నినాదం ఆమె ప్రధాన అస్త్రంగా బయటకు తీస్తున్నారు.

"బంగ్లా నిజర్ మెయొకై చాయే " ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ బెంగాల్ రాజకీయ సభలో వినిపిస్తున్న నినాదం ఇదే. బెంగాల్ కు కావాల్సింది బయటి వ్యక్తులు కాదు సొంత కూతురే అన్నది ఆ నినాదం అసలు అర్ధం. ఇప్పుడు ఈ నినాదమే కీలకం అయ్యేలా కనిపిస్తోంది. తొలి నుంచి భారతీయ జనతా పార్టీని బయట వ్యక్తులు పార్టీ గానే తృణముల్ కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేస్తూ వస్తోంది. ఢిల్లీ గుజరాత్ పార్టీకి ఎక్కడ ఏం పని అంటూ దీదీ మమతా బెనర్జీ ఎన్నికల సభల్లో అనేకమార్లు ప్రశ్నించారు. బిజెపి జాతీయ నాయకులు జేపీ నడ్డా, అమిత్ షా తో పాటు ప్రధాని మోదీ బెంగాల్ వచ్చినప్పుడు సైతం ఆమె ఇదే మార్గాన్ని ఎంచుకున్నారు. బిజెపి పార్టీ అంతా ఢిల్లీ నుంచి ఆపరేట్ అవుతుంది అనే కోణంలోనే ఎన్నికల ప్రచార సభల్లో ఆమె మాటలు ఉంటున్నాయి. ఇప్పుడు ఏకంగా ఎన్నికల ప్రచారం నినాదంగా సైతం బెంగాల్ కు కావలసింది సొంత కూతురు అన్న దానిని రుణములు విస్తృతంగా ప్రచారం చేస్తోంది.

బిజెపి ఎలా తిప్పి కొడుతుంది?
తృణమూల్ కాంగ్రెస్ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో స్థానికతను, బెంగాల్ ఆత్మగౌరవ నినాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని భావిస్తోంది. దీనిలో భాగంగా మమతా బెనర్జీ తనను పశ్చిమ బెంగాల్ వాసిగా పేర్కొంటూ, బీజేపీ మాత్రం బయట పార్టీగా ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. దీంతోపాటు కోల్కతా నగరమంతా దీదీ హోర్డింగ్లు ఇదే నినాదంగా వెలిశాయి.

బెంగాల్ ప్రజలందరూ సొంత మనిషిదీదీ గా పిలుచుకునే మమతా బెనర్జీ ఎప్పటినుంచో బెంగాల్ ప్రజలతోనే ఉన్నారు.. ఇప్పుడు బయట వ్యక్తులు వచ్చి బెంగాల్ను నిర్దేశించ లేరు అంటూ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి పార్థ చటర్జీ సైతం ప్రచారానికి ముందుండి నడిపిస్తున్నారు. ఇప్పుడు ఈ స్థానిక ప్రచారాన్ని భాజపా ఎలా ఎదుర్కొంటుంది? దీనికి దీటైన సమాధానం ఏవిధంగా ప్రజల్లోకి తీసుకు వెళ్లనుంది అనేది ఆసక్తిగా మారింది. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ మమత తీసుకున్న పలు నిర్ణయాలు, ఇస్తున్న కొన్ని నినాదాలు పార్టీ కు కొత్త బూస్ట్ తెస్తున్నాయి.

బీజేపీ లోకి వెళ్లిన వారు రాష్ట్ర ద్రోహులే
తృణమూల్ కాంగ్రెస్ మరో రకమైన అస్త్రాన్ని సైతం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఇది సరిగ్గా ఎన్నికలకు ముందు బయటకు తీసేందుకు మమతా బెనర్జీ రంగం సిద్ధం చేసినట్లు అర్థమవుతోంది. ఇటీవల బీజేపీ లోకి వెళ్ళిన తృణమూల్ కాంగ్రెస్ నేతలు రాష్ట్రానికి ద్రోహం చేసిన వారు గానే ప్రచారం చేసేందుకు, ఆ నినాదాన్ని ఆయా నేతలు ప్రభావం చూపే నియోజకవర్గాల్లో విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఏకమైన బృందాలను మమతా బెనర్జీ నియమించారు. క్షేత్రస్థాయిలో ప్రజలకు అర్థమయ్యేలా చెప్పడం తో పాటు ఇటు సాంకేతికంగా సోషల్ మీడియాలో సైతం ఇదే విషయాన్ని ఎన్నికలకు ముందు ప్రజలకు తెలియజెప్పే లా ఈ ప్రయత్నం సాగుతోంది. మరీ దీదీ ఎత్తును బీజేపీ ఎలా తట్టుకుంటుంది. ఎలాంటి పైఎత్తు వేస్తుంది అన్నది బెంగాల్లో రాజకీయాల్లో ఆసక్తిగా మారింది.

మరో బంగ్లా ఎత్తుగడ ..
'బంగ్లా' అనే నినాదాన్ని బలోపేతం చేసి బెంగాల్ ఓటర్లను తనవైపుకు తిప్పుకునేందుకు సైతం మమతా ప్రయత్నిస్తున్నారు. తాజాగా బెంగాల్ ప్రజలకు దీదీ ఓ సూచన చేసారు. ఇక నుంచి ఫోన్ మాట్లాడేటప్పుడు ‘హలో’ అని కాకుండా ‘జై బంగ్లా’ అని అనాలని రాష్ట్ర ప్రజలకు విజ్ణప్తి చేశారు. ఢిల్లీ నాయకులు బెంగాల్‌ వెన్నెముకను విరిచేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డ మమత.. బంగ్లా నినాదంతో బెంగాల్ వెన్నెముక బలాన్ని చూపాలని పిలుపునిచ్చారు.

కొందరు నేతలు (ఢిల్లీ నేతలు) బెంగాల్ వెన్నెముక విరచాలని ప్రయత్నిస్తున్నారు. మా కళ్ను మాయచేసి మా వెన్నెముకను విరిచేయడం అంత సులభం కాదు అంటూ స్థానికత మీదే ప్రధానంగా దృష్టి సారించినట్లు అర్థమవుతోంది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp