చదివింది బీ.కామ్.. పార్ట్ టైమ్ టీ స్టాల్..

By Rishi K Jan. 22, 2021, 08:45 am IST
చదివింది బీ.కామ్.. పార్ట్ టైమ్ టీ స్టాల్..

రాంచీ జిల్లాలోని కోకర్ పట్టణం అది రోడ్డు పక్కన ఉన్న చిన్న టీ స్టాల్.. ఆ టీ స్టాల్ లో ముఖానికి ముసుగు.. పైన కళ్ళ జోడు ధరించిన యువకుడు వ్యాపారం చేస్తున్నాడు. దేశవ్యాప్తంగా ఎందరో టీ స్టాల్ నిర్వహిస్తున్నారు. కానీ ప్రత్యేకించి ఈ యువకుడి టీ స్టాల్ గురించి చెప్పుకోవడానికి ఓ కారణం ఉంది. ఆ టీ స్టాల్ పేరు "బీ.కామ్" చాయ్ వాలా.. తల్లిదండ్రులపై ఆధారపడకుండా చదువుకుంటూనే తనకు ఇష్టమైన పనిని చేస్తున్న యువకుని గురించి సోషల్ మీడియాలో వైరల్ అయింది.

నిజానికి ఆ యువకుని తండ్రి బ్యాంక్ మేనేజర్. డబ్బుకు లోటు లేని కుటుంబం. కానీ పాకెట్ మనీ కోసం తండ్రిపై ఆధారపడకూడదని నిర్ణయించుకున్నాడు. అందుకే తనకు నచ్చిన టీ బిజినెస్ చేస్తూ తనకు అవసరమైన డబ్బు తాను సంపాదించుకుంటున్నాడు. కానీ తాను ఈ బిజినెస్ చేస్తున్నట్లు ఇంట్లో వారికి తెలియదు. అందుకే తన పేరు బయట పడకుండా ఆ యువకుడు జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.

బీ.కాం చాయ్ వాలా అని పేరెందుకు పెట్టావ్ అని ఎవరైనా అడిగితే నేను అంతవరకే చదువుకున్నాను కాబట్టి ఆ పేరు పెట్టాను అని నవ్వుతూ సమాధానం ఇస్తాడు. రాంచీలోని గోస్నగర్ కాలేజ్ లో బి.కామ్ పూర్తి చేశానని, ఎంబీఏ పూర్తి చేసి ఏదైనా పెద్ద వ్యాపారం చేయాలన్నది తన కల అని ఆ యువకుడు చెప్పుకొచ్చాడు. మరి టీ బిజినెస్ ఎందుకు ఎంచుకున్నావ్ అని ఎవరైనా అడిగితే తక్కువ పెట్టుబడితో ఈ వ్యాపారం చేయొచ్చని, చిన్నప్పటి నుండి టీ పెట్టడం చూస్తూ పెరిగానని, అంతేకాకుండా అప్పుడప్పుడు టీ పెట్టడం కూడా చేశానని, కాబట్టి టీ బిజినెస్ ఎంచుకున్నానని,ప్రస్తుతం ఈ వ్యాపారం మంచి లాభాల్లో నడుస్తుందని బీ.కామ్ చాయ్ వాలా తెలిపాడు. తనకు వంట చేయడం అంటే ఇష్టమని, సంగీతం వినడాన్ని ఆస్వాదిస్తానని చాయ్ వాలా వెల్లడించాడు.

ఈ వ్యాపారం మొదలుపెట్టిన మొదట్లో నేను అద్దెకు ఉంటున్న చుట్టుపక్కల వారు వింతగా చూసిన అనుభవం ఎదురైందని అప్పుడు కాస్త నామోషీగా అనిపించినా ఇప్పుడు అంతా అలవాటు అయిపోయిందని చాయ్ వాలా తెలిపాడు. లాక్ డౌన్ కారణంగా ఎందరో ఉద్యోగాలు కోల్పోయారని,ఉద్యోగం పోతే జీవితం పోయినట్లు కాదని,ప్రపంచం ఆగిపోయినట్లు కాదని, ఉద్యోగం పోయిందన్న బాధ పక్కన పెట్టి ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, పరిస్థితులు ఎలా ఉన్నా పోరాటం చేయాలని చాయ్ వాలా చెబుతుంటే చిన్న వయసులోనే జీవితంపై అతనికి ఉన్న అవగాహన చాలామందికి లేదనిపిస్తుంది.

ఏది ఏమైనా ప్రతీ చిన్న విషయానికి తల్లిదండ్రులపై ఆధారపడి బ్రతుకుతున్న కొందరికి కనువిప్పు కలిగేలా తన తల్లిదండ్రులకు తెలియకుండా ప్రజలు చులకనగా చూస్తారని తెలిసినా ముందడుగు వేసి తన పనిలో విజయం సాధించిన బీ.కామ్ చాయ్ వాలా ఎందరికో ఆదర్శంగా నిలుస్తాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp