టెన్నిస్ లో మహిళల స్థాయిని పెంచిన Battle of the Sexes

By Sannapareddy Krishna Reddy Sep. 20, 2020, 01:43 pm IST
టెన్నిస్ లో మహిళల స్థాయిని పెంచిన Battle of the Sexes

ఇప్పుడు టెన్నిస్ లో ప్రతిష్టాత్మకమైన నాలుగు గ్రాండ్ స్లామ్ పోటీలు, ఆస్ట్రేలియన్, ఫ్రెంచ్, వింబుల్డన్, యూఎస్ ఓపెన్ పోటీలలో పురుగులకు, మహిళలకు ప్రైజ్ మనీ, ప్రేక్షకుల ఆదరణ సమానంగా ఉంది కానీ ఒకప్పుడు అలా ఉండేది కాదు. పురుషుల కన్నా ప్రైజ్ మనీ తక్కువ ఉండేది. ఆట కూడా మెయిన్ కోర్టులలో కాకుండా పక్కన ఎక్కడో ఆడించారు. ఈ అసమానతలకు వ్యతిరేకంగా సమానత్వం కోసం క్రీడాకారిణులు ఒకవైపు పోరాడుతుంటే, వారికి వ్యతిరేకంగా పని చేసే వారు కూడా ఉండేవారు. ఈ అసమానత సమంజసమే అని వాదించిన వారిలో ముందు వరుసలో ఉండేవాడు బాబీ రిగ్స్.
పురుషుల పోటీలు బెస్ట్ ఆఫ్ ఫైవ్ తరహాలో మూడు నుంచి అయిదు సెట్లు ఉంటే, స్తీల పోటీలు రెండు లేక మూడు సెట్లలో ముగుస్తాయి. అలాగే స్త్రీల టెన్నిస్ పోటీల్లో పవర్ కూడా తక్కువ కాబట్టి వారికి ప్రైజ్ మనీ తక్కువ ఉండడం న్యాయమే అని వీరి వాదన.

ఓపెన్ ఛాలెంజ్

1940 దశకంలో చాలా పోటీల్లో గెలిచి ఒక దశలో నంబర్ వన్ ర్యాంకు కూడా దక్కించుకున్న, 1951లో టెన్నిస్ నుంచి రిటైర్ అయిన బాబీ రిగ్స్ 1973లో మహిళా క్రీడాకారిణులకు ఒక సవాల్ విసిరాడు. 55 ఏళ్ల వయసున్న తనను ఏ మహిళా క్రీడాకారిణి అయినా ఓడించగలిగితే టెన్నిస్ లో ఆడా మగా సమానమే అని ఒప్పుకుంటాను అని ఛాలెంజ్ చేశాడు రిగ్స్. సహజంగానే అతనితో పోటీపడవలసిన బాధ్యతను మహిళలకు సమానత్వం కోసం పోరాడుతున్న అప్పటి ప్రపంచ నంబర్ వన్ క్రీడాకారిణి మార్గరెట్ కోర్ట్ స్వీకరించింది.
ఆ సంవత్సరం మే నెల 13న కాలిఫోర్నియాలో బెస్టాఫ్ త్రీ పద్ధతిలో ఏకపక్షంగా జరిగిన మ్యాచ్ లో బాబీ రిగ్స్ విజయం సాధించాడు. ఈ ఫలితంతో మహిళా క్రీడాకారిణులకు సమాన హక్కుల కోసం చేస్తున్న పోరాటం కొంచెం కొంత వెనుకబడింది.

తమ పోరాటాన్ని తిరిగి గాడిలో పెట్టాలంటే బాబీ రిగ్స్ మీద ఒక క్రీడాకారిణి విజయం సాధించాలన్న అవసరం గుర్తించి, ఆ సంవత్సరం మహిళా క్రీడాకారిణుల్లో రెండవ స్థానంలో ఉన్న 29 సంవత్సరాల బిల్లీ జీన్ కింగ్ బాబీ రిగ్స్ మీద పోరాటానికి సిద్ధం అయింది. ఈసారి బెస్టాఫ్ ఫైవ్ పద్ధతిలో పోటీ అనగానే అందరిలో ఆసక్తి ఏర్పడింది. టెక్సాస్ లోని హూస్టన్ లో జరిగిన ఈ మ్యాచ్ ని ప్రత్యక్షంగా ముప్పై వేల మంది తిలకించారు. అమెరికాలోని ఏబీసీ ఛానల్ ఈ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం చేస్తే అమెరికాలో అయిదు కోట్లమంది ప్రపంచ వ్యాప్తంగా తొమ్మిది కోట్ల మంది చూశారు.

లక్ష డాలర్ల ప్రైజ్ మనీ

ఈ మ్యాచ్ పట్ల అభిమానుల్లో ఉన్న ఆసక్తి వల్ల స్పాన్సర్ షిప్ రూపంలో లక్ష డాలర్ల ప్రైజ్ మనీ పోగయింది. ఆ మొత్తం ఎవరు గెలిస్తే వారికి అని ముందుగా ఒప్పందం చేసుకున్నారు. సెప్టెంబర్ 20, 1973న హూస్టన్ నగరంలో ఇద్దరూ తలపడ్డారు. స్టేడియంలోకి బిల్లీ జీన్ కింగ్ క్లియోపాత్రా వేషంలో బానిసల వేషంలో ఉన్న పురుషులు మోసిన పల్లకీలో ప్రవేశిస్తే, బాబీ రిగ్స్ రిక్షాలో కూర్చుని దానిని అందమైన సుందరీమణులు లాగుతుండగా ప్రవశించాడు.
మ్యాచ్ మొదలు కాగానే బాబీ రిగ్స్ 3-2 స్కోరుతో ఆధిక్యం సాధించాడు. అయితే వెంటనే తేరుకున్న కింగ్ ఆ సెట్టుని 6-4 తో స్వాధీనం చేసుకుని, 6-3,6-3 స్కోరుతో మరో రెండు సెట్లు గెలిచి, వరుస సెట్లలో విజయం సాధించింది. ఈ విజయం తరువాత సమానత్వం కోసం టెన్నిస్ క్రీడాకారిణుల పోరాటం మరింత ఊపందుకుని కొన్ని సంవత్సరాల తరువాత లక్ష్యాన్ని సాధించింది.

కొసమెరుపు

ప్రైజ్ మనీలో ఒక్క డాలర్ దక్కకపోయినా షుగర్ డాడీ అనే చాక్లెట్ కంపెనీ లోగో తన జెర్సీ మీద ధరించి యాభైవేల డాలర్లు స్పాన్సర్ షిప్ రూపంలో పొందిన బాబీ రిగ్స్ ఈ మ్యాచ్ లో బిల్లీ జీన్ కింగ్ విజయం సాధిస్తుందని బెట్టింగ్ రూపంలో బాగా సంపాదించాడు. ఈ విషయం ఆ తరువాత ఎప్పుడో బయటపడ్డాక బాబీ రిగ్స్ కావాలని మ్యాచ్ ఓడిపోయాడేమో అని కొందరు అనుమానం వ్యక్తం చేశారు. అయితే ఈ అనుమానాన్ని బాబీ రిగ్స్ సన్నిహితులు కొట్టిపారేశారు. మరో మ్యాచ్ ఆడుదామని రిగ్స్ ఛాలెంజ్ చేశాడు కానీ బిల్లీ జీన్ కింగ్ అందుకు అంగీకరించలేదు.

ఈ మ్యాచ్ మీద ఏబీసీ నెట్ వర్క్ 2001లో వెన్ బిల్లీ బీట్ బాబీ అని ఒక సిరీస్ ప్రసారం చేయగా, 2017లో బాటిల్ ఆఫ్ ది సెక్సస్ అని ఒక హాలీవుడ్ సినిమా వచ్చింది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp