వాళ్ళు రాసిందే వార్త.. చెప్పిందే నిజం..

By Sanjeev Reddy Sep. 23, 2020, 10:25 am IST
వాళ్ళు రాసిందే వార్త.. చెప్పిందే నిజం..

ఇరుపక్షాల కలయిక , చర్చల్లోని అంశాల పై వార్తకి ఆ చర్చలో పాల్గొన్న రెండు పక్షాల్లోని ప్రతినిధులు చెప్పిన విషయాలు ప్రాతిపదిక అవుతాయి . కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మీడియా సంస్థలు నిర్వహించే స్టింగ్ ఆపరేషన్ ద్వారానో , ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం ద్వారానో సంచలన విషయాలు బయటికి రావొచ్చు .

ఆంధ్రజ్యోతిలో వచ్చే వార్తలు ప్రతిరోజూ సంచలనమే , కానీ వాటికి ప్రాతిపదిక ఏంటి అంటే సరైన సమాధానం దొరకదు . వార్తకి కారణమైన అంశంలో పాల్గొన్న వారిచ్చిన స్టేట్మెంట్ కానీ , తాము స్వయంగా పరిశోధించి కనుగొన్న అంశాల తాలూకూ సాక్ష్యాలు కానీ , స్టింగ్ ఆపరేషన్ తాలూకూ ఆడియో , వీడియోలు కానీ ఏమీ ఉండవు ..

అజ్ఞాత వ్యక్తుల సమాచారం , విశ్వసనీయ వర్గాల భోగట్టా , అంతరంగికుల సమాచారం , కార్యాలయ వర్గాల గుసగుస అనే పడికట్టు పదాలు మార్చి మార్చి చెప్పి మాది దమ్మున్న ఛానెల్ , ఇదే విశ్వసనీయత దీన్ని మీరు నమ్మితీరాలి అనే ధోరణి రోజురోజుకీ ఆంధ్రజ్యోతిలో ఎక్కువై పోతుంది .

అందులో భాగమే ఈ రోజు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ , కేంద్ర హోంమంత్రి అమిత్ షా భేటీలో అంశాల పై ABN రిపోర్ట్ . నిన్న సాయంత్రం కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయిన జగన్ షుమారు గంట సేపు చర్చలు జరిపారు . ఇందులో భాగంగా పోలవరం నిర్మాణం తాలూకూ రాష్ట్రానికి రావాల్సిన నిధులను కోరడంతో పాటు, రాష్ట్రంలో కోవిడ్ 19 కారణంగా రాబడి కోల్పోయి ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి , రాష్ట్రానికి రావాల్సిన GST బకాయిలు , ఇతర నిధులు త్వరగా విడుదల చేయాలని , అలాగే పోలవరం నిర్వాసితులకు పునరావాస సాయాన్ని త్వరితగతిన రిలీజ్ చేయటంతో పాటు , 2021 డిసెంబర్ నాటికి పూర్తి చేయాలన్న లక్ష్యాన్ని వివరించి అందుకు అనుగుణంగా ఎప్పటికప్పుడు నిధులు విడుదల చేయాలని జగన్ కోరారు .

ఇదే అంశం పై ఈ రోజు ఉదయం 9 గంటలకు కేంద్ర జల శక్తి శాఖ మినిస్టర్ షెకావత్ తో సమావేశంలో పాల్గొని తరువాత మరోసారి హోంమంత్రితో భేటీ కానున్నారు . ఇదీ భేటీ తర్వాత కేంద్ర , రాష్ట్ర కార్యాలయాలు ఇచ్చిన సమాచారం .

అయితే ఆంధ్రజ్యోతిలో మాత్రం ఈ అంశాలు నామ మాత్రపు ప్రస్తావనకు కూడా నోచుకోలేదు . ఇది కేంద్ర రాష్ట్ర మంత్రుల భేటీ ఏ మాత్రం కాదు అని తానే నిర్ధారిస్తూ కేవలం జగన్ కి క్లాస్ పీకడానికి , మందలించడానికి అమిత్ షానే ఢిల్లీ పిలిపించాడు అంటూ సాగిపోయిన కథనంలో తన కోరికలు ఊహాగానాలు మొత్తం దట్టించి వార్త వండి వార్చారు అని చెప్పొచ్చు .

ప్రభుత్వం న్యాయస్థానాలను టార్గెట్ చేయడం మంచిది కాదని , దూకుడు తగ్గించమని మందలించారని , ఏదైనా ఉంటే అప్పీల్ చేసుకోండి కానీ వ్యాఖ్యానించొద్దని , ఇందుకోసం పార్లమెంట్ ని వాడుకోవడం మంచి పద్ధతి కాదని సూచించారని రాసుకున్న కథనంలో చిక్కుల్లో ఉన్న టీడీపీకి , అభాసుపాలవుతున్న అంశాల్లో తన వారికి అండగా నిలబడే తాపత్రయమే తప్ప హేతుబద్ధత కనపడదు . అమరావతి భూముల అవినీతి అంశంలో కొందరు వ్యక్తుల పాత్ర పై వచ్చిన వార్తలు , నమోదైన కేసుల గురించి అమిత్ ప్రస్తావించి ఇలా వారి పేర్లు బహిరంగపరచడం మంచిది కాదని వాటి జోలి పోవద్దని సూచించినట్లు అన్యాపదేశంగా రాసుకొచ్చిన వార్తలో ఏబీఎన్ ఆందోళన సదరు వ్యక్తుల్ని ఆరోపణల నుండి కాపాడే ప్రయత్నం స్పష్టంగా కనపడుతోంది .

ఏదేని ఒక అంశం పై వార్త రాసినప్పుడు అందులోని నిజానిజాలేంటి అన్న ప్రశ్న ఉద్భవిస్తే సాక్ష్యాలు , కనీస ఆధారాలు తమ దగ్గర ఉండాలన్న సోయ ఆంధ్రజ్యోతికి లేకుండా పోయి చాలా కాలం అవుతుంది . ఈ రోజు రాసిన వార్త కూడా ఆ సోయ లేకుండా వండి వార్చిన కాల్పనిక కధనాల్లో మరొకటి తప్ప వేరేమీ కాదు . ఇలాంటి అసత్య కధనాలు ఇంకెన్నాళ్లు చదవాలో తెలుగు పాఠకులు .

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp