స్పీకర్‌ కుటుంబంలో వారసత్వ పోరు

By Thati Ramesh Sep. 27, 2021, 05:30 pm IST
స్పీకర్‌ కుటుంబంలో వారసత్వ పోరు

జాతీయ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు రాజకీయ, సినిమా రంగాల్లో వారసత్వం కొనసాగుతోంది. రాజకీయాల్లో ఈ ట్రెండ్ ఇంకా ఎక్కువగా ఉంది. . కొన్నిపార్టీల్లో వ్యక్తి ఆధారిత రాజకీయాలు ఉంటే.. మరికొన్ని పార్టీల్లో కుటుంబ, వారసత్వ రాజకీయాలు కొనసాగుతున్నాయి. ఓటర్లు కూడా వారసులకు పట్టం కట్టేందుకే ఇష్టపడుతున్నారు. ఇటీవల జరుగుతున్న పలు పరిణామాలు పరిశీలిస్తే ఈ విషయం అర్థమవుతుంది. వారసత్వం కారణంగా రాజకీయాల్లోకి వచ్చినా ప్రజల అభిమానాన్ని చూరగొని రాణించిన వారు తక్కువ సంఖ్యలోనే ఉన్నారు. తమ పెద్దల రాజకీయ వారసత్వం కోసం పోటీపడి తగదా పడి కుటుంబ బంధాలను తెంపేసుకున్నవారు కూడా తెలుగు రాజకీయాల్లో ఎక్కువగానే ఉన్నారు.

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి రాజకీయ వారసత్వం కోసం ఆయన కుమారులు పోటీ పడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. పోచారం శ్రీనివాసరెడ్డికి ముగ్గురు కుమారులు. వీరిలో పెద్దకుమారుడు డాక్టర్. ఆయన రాజకీయాలకు దూరంగానే ఉన్నారు. అయితే తండ్రి రాజకీయ వారసత్వం కోసం, రెండో కుమారుడైన సురేందర్ రెడ్డి, చిన్న కుమారుడైన భాస్కర్ రెడ్డి పోటీ పడుతున్నారనే వార్తలు నిజామాబాద్ జిల్లా రాజకీయాల్లో ఎక్కువగా వినిపిస్తున్నాయి.

Also Read : నారాయణ గ్యాప్ తీసుకుంటున్నారా ? గ్యాప్ ఇచ్చారా ?

పోటీలో ఎవరు..?

స్పీకర్ గా పోచారం ప్రకటించే సమయంలో ఆయనతో కేసీఆర్ పలుదఫాలు చర్చలు జరిపి ఒప్పించినట్లు ప్రచారం జరిగింది. వయస్సు, ఆరోగ్య పరమైన ఇబ్బందులు ఉన్నాయని పోచారం చెప్పగా..అన్నీ తాను చూసుకుంటానని కేసీఆర్ భరోసా ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో పోచారం పోటీ చేయలేని పరిస్థితిలో ప్రత్యామ్నాయంగా ఆయన కుమారుడికి టికెట్ లభించేలా హామీ ఇచ్చినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో పోచారం వారసులే బాన్సువాడ నుంచి పోటీలో ఉంటారనేది స్థానికంగా ఉన్న చర్చ. అయితే పోటీలో సురేందర్ రెడ్డి ఉంటారా..? భాస్కర్ రెడ్డి ఉంటారా అనే విషయంపై క్లారిటీ లేదు. ఈ విషయంలో ఇద్దరి మధ్య మనస్పర్థలు కూడా ఉన్నట్లు మీడియాలో ప్రచారం జరిగింది. కానీ ప్రస్తుతం ఇద్దరూ కలిసిమెలిసే రాజకీయాలు చేస్తున్నారు.

భాస్కర్ రెడ్డి క్లారిటీ..!

ఇటీవల బాన్సువాడలో జరిగిన టీఆర్ఎస్ సమావేశంలో పాల్గొన్న భాస్కర్ రెడ్డి ఈ విషయంపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ‘వచ్చే ఎన్నికల్లో బాన్సువాడ నుంచి తన తండ్రి పోచారం శ్రీనివాసరెడ్డి మాత్రమే పోటీ చేస్తారని’ చెప్పారు. అన్నదమ్ముల మధ్య పోటీ ఉండదని పరోక్షంగా చెప్పే ప్రయత్నం చేశారు. తన ప్రకటన ద్వారా అన్న ప్రయత్నాలకు చెక్ పెట్టారా..? అనే ప్రశ్నలు కూడా తలెత్తున్నాయి.

Also Read : ఆ కామ్రేడ్ పలుకే బంగారమాయె..!

రాజకీయాల్లో చురుకుగా...

వచ్చే ఎన్నికల్లో పోచారానికి వయస్సు సహకరించని నేపథ్యంలో ఆయన కుమారుడికి ఎమ్మెల్యే టికెట్ ఇస్తానని స్పీకర్ ఎన్నిక సమయంలో కేసీఆర్ మాట ఇచ్చినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. ప్రస్తుతం పోచారం శ్రీనివాసరెడ్డి కుమారులైన సురేందర్ రెడ్డి, భాస్కర్ రెడ్డి జిల్లా రాజకీయాల్లో చురుకుగానే ఉన్నారు. సురేందర్ రెడ్డి బాన్సువాడ నియోజకవర్గ టీఆర్ఎస్ ఇంఛార్జ్ గా ఉండగా.. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డీసీసీబీ చైర్మన్ గా భాస్కర్ రెడ్డి ఉన్నారు.

ఊరి పేరే ఇంటి పేరుగా పిలుపు...

కేసీఆర్, పోచారం శ్రీనివాస రెడ్డిని పెద్దన్న అని సంబోధిస్తారు. అలాగే లక్ష్మీపుత్రుడని కూడా కొన్నిసభలలో చెప్పారు. ఇంజినీరింగ్ చదివిన పోచారం, రాజకీయాల్లో కిందిస్థాయి నేత నుంచి అంచెలంచెలుగా ఎదిగి ఉన్నత పదవులు చేపట్టారు. బాన్సువాడ మండలం పోచారం ఆయన స్వస్థలం. ఆయన ఇంటి పేరు పరిగె అయినప్పటికీ.. ఊరి పేరే ఇంటి పేరుగా స్థిరపడింది.

Also Read : తమ్మినేని వీరభద్రం ఏం చేస్తున్నారు..?

సాధారణ కార్యకర్తగా ప్రయాణం ప్రారంభం...

తెలంగాణ మొదటి వ్యవసాయ శాఖమంత్రిగా రికార్డు కెక్కిన పోచారం శ్రీనివాసరెడ్డి ఆరుసార్లు శాసనసభకు ఎన్నికయ్యారు. 1976లో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఏడాది తర్వాత దేశాయపేట్ సొసైటీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 1984లో టీడీపీలో చేరిన పోచారం శ్రీనివాసరెడ్డి ఆ పార్టీలో పలు కీలక పదవులు చేపట్టారు. 1987లో నిజామాబాద్ సహకార బ్యాంకు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఆయన చిన్న కుమారుడు భాస్కర్ రెడ్డి కూడా అదే పదవిలో ఉన్నారు. 1989లో టీడీపీ తరఫున నిజమాబాద్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందారు.

ఆరుసార్లు శాసన సభ్యుడిగా ఎన్నిక...

1994లో బాన్సువాడ నుంచి పోటీ చేసి అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. గృహ నిర్మాణ శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. 1999లో కూడా ఎమ్మెల్యేగా గెలిచి పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2009లో టీడీపీ తరఫున బాన్సు వాడ నుంచి మళ్లీ గెలిచినప్పటికీ 2011లో రాజీనామా చేశారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం బలంగా ఉన్న సమయంలో ఆయన టీడీపీకి రాజీనామా చేసి టీఆర్ఎస్ లో చేరారు. ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫున పోటీ చేసి విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో గెలిచి వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేశారు. 2018లో కూడా అదే స్థానం నుంచి గెలిచి ఆరోసారి విజయ కేతనం ఎగురవేశారు.

Also Read : జలగం వెంగళరావు కుటుంబం రాజకీయంగా ఏమి చేస్తుంది ? 

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp