Balakrishna - చెరిపేస్తే 'వెన్నుపోటు' చరిత్ర చెరిగిపోతుందా?

By Gopal.T Dec. 07, 2021, 09:45 am IST
Balakrishna - చెరిపేస్తే 'వెన్నుపోటు' చరిత్ర చెరిగిపోతుందా?

టీడీపీ నేత చంద్రబాబు నాయుడు, నందమూరి కుటుంబంపై "వెన్నుపోటు" ఆరోపణపై ఇన్నేళ్ళకు నందమూరి బాలకృష్ణ స్పందించారు. ఆ పదం విన్నప్పుడల్లా తాను భావోద్వేగానికి గురవుతా అంటూ భావోద్వేగంతో చేసిన వ్యాఖ్య ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఒక టీవీ ప్రోగ్రాంలో భాగంగా బాలకృష్ణ ఈ వ్యాఖ్యలు చేసినట్టు ఆ ప్రోగ్రాంకు సంబంధించిన ఒక టీజర్ చూస్తే అర్ధం అవుతోంది. 

బాలకృష్ణ వ్యాఖ్యాతగా నిర్వహిస్తున్న ఆ షోలో కొన్ని రాజకీయ వ్యాఖ్యలు కూడా చేస్తున్నారు. ఇప్పటికి మూడు షోలు నిర్వహించిన బాలకృష్ణ మొదటి షోలోనే మోహన్ బాబుతో రాజకీయాలు చర్చ చేశారు. ఆ షో సందర్భంగానే తండ్రి ఎన్టీఆర్ పై తిరుగుబాటు చేసినప్పుడు టీడీపీ నాయకత్వం తాను తీసుకోకుండా బావ చంద్రబాబు నాయుడుకు అప్పగించడంపై ఒక వ్యాఖ్య చేశారు. తాను స్వతహాగా వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకం అని అందువల్లే టీడీపీ నాయకత్వం ను తాను తిరస్కరించి చంద్రబాబుకు ఇచ్చాను అని చెప్పుకున్నారు బాలకృష్ణ.

ఇక ఇప్పుడు తాజాగా రేపు ఆదివారం ఆహా లో విడుదలకానున్న ఈ ఎపిసోడ్ లో వెన్నుపోటుపై ఆయన సంచలన వ్యాఖ్య చేశారు. అయితే ఈ ఎపిసోడ్ లో రాజకీయ నాయకులు ఎవరూ అతిధులుగా రాలేదు. కేవలం సినిమా దర్శకుడు బోయపాటి శ్రీను, నటుడు శ్రీకాంత్ ఉన్నట్టు టీజర్ చూస్తే తెలుస్తోంది. పైగా వారిని ఆహ్వానించింది కూడా తన సినిమాపై మాట్లాడడం కోసమే. అయినా వెన్నుపోటు చరిత్రపై బాలకృష్ణ భావోద్వేగపూరిత వ్యాఖ్య చేయడం కొంత ఆశ్చర్యంగానే ఉంది. 

Also Read : Andhra Jyothi, Chandrababu - బాబు చేసిన నష్టానికి ఆంధ్రజ్యోతి ప్యాచ్‌వర్క్‌

1995 ఆగస్టులో చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఎన్టీఆర్ పై తిరుగుబాటు జరిగింది. ఈ తిరుగుబాటుకు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు అంతా మద్దతు పలికారు. తండ్రి పక్షం కాకుండా ఎన్టీఆర్ సంతానం అంతా చంద్రబాబు పక్కన నిలబడ్డారు. ఎన్టీఆర్ పెట్టిన తెలుగు దేశం పార్టీని లాక్కున్నారు. ఆయన అనుభవిస్తున్న ముఖ్యమంత్రి పదవిని లాక్కున్నారు. చివరికి ఆయన వైస్రాయ్ హోటల్ కు వస్తే చెప్పులు విసిరి అవమానించారు. తిరిగి అసెంబ్లీలో కూడా ఆయనను మాట్లాడనివ్వకుండా అడ్డుకుని కన్నీరు పెట్టించారు. ఈ తిరుగుబాటును "వెన్నుపోటు" అని అభివర్ణించింది మొదట ఎన్టీఆర్. ముఖ్యంగా చంద్రబాబు నాయుడుని ఎన్టీఆర్ వెన్నుపోటు దారుడు అని విశ్వాసఘాతకుడు అని ఇంకా చాలా రకాలుగా విమర్శించారు. 

"వెన్నుపోటు కుట్ర"ను వివరిస్తూ ఎన్టీఆర్ అప్పట్లో అనేక వీడియోలు విడుదల చేశారు. రాష్ట్రం అంతటా పర్యటించి చంద్రబాబు పై వెన్నుపోటుదారుడు అంటూ ముద్ర వేశారు. 1982లో పార్టీ పెట్టినప్పుడు ఖాకీ చొక్కా ఖాకీ ప్యాంటు వేసుకుని రాష్ట్రంలో తిరిగిన ఎన్టీఆర్, 1995లో చంద్రబాబు తనను పదివీచ్యుతుణ్ణి చేసినప్పుడు నల్ల చొక్కా, నల్ల ప్యాంటు వేసుకుని రాష్ట్రం అంతటా పర్యటించి తన అల్లుడు వెన్నుపోటు పొడిచాడని, తన పిల్లలు తనకు నమ్మకద్రోహం చేశారని ఎన్టీఆర్ చెప్పారు. చంద్రబాబును విశ్వాసఘాతకుడు అని కూడా సంబోధించారు.     

అల్లుడి వెన్నుపోటు, బిడ్డల నమ్మకద్రోహం, విశ్వాసఘాతుకం ఎన్టీఆర్ ను చాలా బాధించాయి. ఆ బాధతోనే, ఆ మనోవేదనతోనే ఎన్టీఆర్ మరణించారు. ఇదంతా ఒక చరిత్ర. ఈ చరిత్రకు సంబంధించిన వీడియోలు, వార్తలు ఉన్నాయి. అయితే బాలకృష్ణ మాత్రం "వెన్నుపోటు" అని ఆరోపించగానే భావోద్వేగానికి గురవుతా అంటూ కొత్త భాష్యం చెప్పబోయినట్టున్నారు. ఈ ఆదివారం ఆ ఎపిసోడ్ మొత్తం చూస్తే తప్ప అసలు బాలకృష్ణ అలా ఎందుకు అన్నాడో? ఆ సందర్భం ఎందుకు వచ్చిందో అనే వివరాలు తెలియవు. అయినా ఎన్టీఆర్, టీడీపీ చరిత్రతో ముడిపడిన "వెన్నుపోటు" పదం ఈ పాతికేళ్ళ తర్వాత బాలకృష్ణ చెరిపేద్దాం అని చూస్తే చెరిగిపోదు.

Also Read : Ganta -చంద్ర‌బాబు ఏడ్చినా ప‌ట్టించుకోని గంటా.. ఇక ఆశలు వదులుకోవడమేనా ?

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp