అయోధ్య‌.. ఆహ్వానించ‌ద‌గిన ఆహ్వానం..!

By Kalyan.S Aug. 03, 2020, 10:24 pm IST
అయోధ్య‌.. ఆహ్వానించ‌ద‌గిన ఆహ్వానం..!

ఉత్తరప్రదేశ్ లోని అయోధ్య నగరంలో భవ్య రామ మందిర నిర్మాణానికి సంబంధించిన భూమి పూజ కార్యక్రమాలు ఆరంభమయ్యాయి. 11 మంది పూజారులు సోమవారం గౌరీ గణేశ పూజతో క్రతువు ప్రారంభించారు. మూడు రోజులపాటు నిర్వహించే భూమి పూజలో బుధవారం(5న) ప్రధాన ఘట్టంగా శంకుస్థాపన వేడుక జరుగనుంది. భూమి పూజ సందర్భంగా అయోధ్యను సర్వాంగ సుందరంగా ముస్తాబుచేశారు. శ్రీరాముడు జన్మించిన అభిజిత్ ముహూర్తంలోనే బుధవారం మధ్యాహ్నం 12.30 గంటలకు శంకుస్థాపన జరుగనుంది. మందిరం-మసీదు వివాదంపై అల్ల‌ర్లు, సుదీర్ఘ కాలంగా వివాదాలు జ‌రిగిన విష‌యం తెలిసిందే. అయోధ్యలో మాత్రం రెండు వర్గాలూ ఇప్పటికీ సోదరభావంతోనే మెలుగుతున్నాయి. ఇదే నేప‌థ్యంలో అయోధ్య రామమందిర నిర్మాణం కోసం జరిగే భూమిపూజ సందర్భంగా హిందూ, ముస్లింల మధ్య సోదరభావాన్ని పెంపొందించే అరుదైన సన్నివేశం చోటుచేసుకుంది. రామాల‌య నిర్మాణానికి ముస్లింకు మొద‌టి ఆహ్వానం అంద‌డం దేశ వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఇది ఆహ్వానించ‌ద‌గిన ప‌రిణామ‌మ‌ని అధిక మంది అభిప్రాయం వ్య‌క్తం చేస్తున్నారు.

ఆహ్వానం ఎవ‌రికంటే...

అయోధ్య రామమందిర నిర్మాణం కోసం జరిగే భూమిపూజకు రావాల్సిందిగా బాబ్రీ మసీదు కోసం న్యాయపోరాటం చేసిన ఇక్బాల్ అన్సారీకి తొలి ఆహ్వానం అందింది. అయోధ్య రామజన్మభూమి వివాదంపై ముస్లింల తరపున బలంగా గళం వినిపించిన వారిలో అన్సారీ ఒకరు. కాగా భూమిపూజ కోసం తనను ఆహ్వానించడం పట్ల అన్సారీ హర్షం వ్యక్తం చేశారు. ‘‘నాకు తొలి ఆహ్వానం అందాలన్నది సాక్షాత్తూ శ్రీరాముడి ఆకాంక్ష అని భావిస్తున్నాను. అందుకే దీన్ని మనస్పూర్తిగా స్వీకరిస్తున్నాను..’’ అని అన్సారీ వ్యాఖ్యానించారు. ఈ నెల 5న ఉత్తర ప్రదేశ్‌లోని అయోధ్యలో రామమందిరం నిర్మాణానికి శంకుస్థాపన జరగనున్న విషయం తెలిసిందే. దేశ వ్యాప్తంగా ఆసక్తితో ఎదురుచూస్తున్న ఈ కార్యక్రమం కోసం ప్రధాని సహా పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు. కాషాయం రంగులో ముద్రించిన ఆహ్వాన పత్రంలో ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, యూపీ గవర్నర్ ఆనందీబెన్ పటేల్‌ తదితర అతిథుల పేర్లు ఉన్నాయి. కరోనా వైరస్ కారణంగా కేవలం 180 మందికి మాత్రమే భూమి పూజ కార్యక్రమంలో పాల్గొనేందుకు అవకాశం కల్పించారు. అతిథుల జాబితాలో తొలుత 200 మందికిపైగా చోటు కల్పించినప్పటికీ.. మళ్లీ దీన్ని తగ్గించి కేవలం 170 నుంచి 180 మందిని మాత్రమే ఆహ్వానిస్తున్నట్టు సమాచారం.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp