అంబేద్కర్‌ ఇంటిపై దాడి: కఠిన చర్యలకు ఉద్ధవ్‌ థాక్రే ఆదేశం

By Jagadish J Rao Jul. 09, 2020, 07:04 am IST
అంబేద్కర్‌ ఇంటిపై దాడి: కఠిన చర్యలకు ఉద్ధవ్‌ థాక్రే ఆదేశం

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ నివాసం లక్ష్యంగా సంఘ్ పరివార్‌కు చెందిన దుండగులు దాడికి పాల్పడ్డారు. సెంట్రల్‌ ముంబయిలోని హిందూ కాలనీలో ఉన్న ''రాజ్‌ గృహ''గా పిలువబడుతున్న అంబేద్కర్‌ ఇంటిపై.. మంగళవారం ఈ నెల 7 అర్థరాత్రి కొందరు దుండగులు రాళ్ళ దాడికి ఒడిగట్టారు. రాత్రిపూట ఇంట్లోకి ప్రవేశించిన ఆ దుండగులు.. ఇంటి ఆవరణలో ఉన్న సిసిటివి కెమెరాలను ధ్వంసం చేశారు. ఇంటి ముందు ఉన్న పూల కుండీలన్నింటినీ చెల్లా చెదురుగా పడేశారు. పై అంతస్థులో ఉన్న కిటికీలపై రాళ్లు విసిరి, వరండాలో నానా బీభత్సం సృష్టించారు.
అయితే ఈ దాడి ఘటనపై మాతుంగ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇద్దరు దుండగులు రాళ్లు విసురుతున్న దృశ్యాలు సిసి కెమెరాల్లో రికార్డు అయినట్లు పేర్కొన్నారు. మరో దుండగుడు పారిపోతూ కొన్ని పూల కుండీలను ధ్వంసం చేస్తున్న దృశ్యాలు కూడా గుర్తించినట్లు తెలిపారు.

సెంట్రల్‌ ముంబయిలో దాదార్‌లోని హిందూ కాలనీలో ఉన్న ఈ రెండు అంతస్థుల భవనంలో అంబేద్కర్‌ పుస్తకాలు, చితాభస్మంతో పాటు అనేక స్మారక వస్తువులు ఉంచిన మ్యూజియం ఉంది. ఇందులో గ్రంథాలయంలో దాదాపు 50 వేలకు పైగా పుస్తకాలున్నాయి. అంబేద్కర్‌ సమాధి ''చైతన్యభూమి''లాగే ఈ భవనాన్ని కూడా ప్రజలు అత్యంత ప్రాముఖ్యంగా భావిస్తారు. ప్రస్తుతం అంబేద్కర్‌ కోడలు, అతని మనవళ్లు వంచిత్‌ బహుజన్‌ అగాది (విబిఎ) నాయకుడు ప్రకాష్‌ అంబేద్కర్‌, ఆనంద్‌రావ్‌, బీమ్‌రావ్‌ ఉంటున్నారు. దాడి జరిగినప్పుడు ప్రకాష్‌ అంబేద్కర్‌ ఇంట్లో లేరు. ఆయన అకోలాలో ఉన్నారు.

ఈ దాడి ఘటనను అన్ని రాజకీయ పార్టీలు తీవ్రంగా ఖండించాయి. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ థాక్రే, మాజీ సిఎం దేవేంద్ర ఫడ్నవీస్‌, భీం ఆర్మీ చీఫ్‌ చంద్రశేఖర్‌ ఆజాద్‌ లు ఘటనపై విచారం వ్యక్తం చేశారు. థాక్రే స్పందిస్తూ.. ''ఆ ప్రాంగణం ఒక్క అంబేద్కర్‌ వాదులకే కాదు.. మొత్తం సమాజానికే ఆథ్యాత్మిక స్థలం. అంబేద్కర్‌ తన రచనలన్నింటిని ఇక్కడ భద్రపరిచారు. ఇది మహారాష్ట్ర సమాజానికి తీర్థయాత్ర వంటి ప్రదేశం. ఈ ఘటనకు పాల్పడ్డవారిపై కఠిన చర్యల్ని తీసుకోవాలని నేను పోలీసులను ఆదేశించాను'' అని అన్నారు. రాజగృహ అంబేద్కర్‌ అనుచరులకే కాకుండా కులమతాలకతీతంగా ప్రజలందరికీ గౌరవ ప్రదమైన స్థలమని ముఖ్యమంత్రి అన్నారు.

అత్యంత ప్రాముఖ్యమైన ఈ భవనంపై దాడికి ఒడిగట్టిన దుండగులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని, కఠినంగా శిక్షిస్తామని ఆయన చెప్పారు.
దోషులు ఎంతటివారైనా వారికి కఠిన శిక్ష విధించాలని మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత దేవేంద్ర ఫడ్నవీస్‌ డిమాండ్‌ చేశారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించామనీ, దుండగులను త్వరలోనే గుర్తిస్తామని రాష్ట్ర హోం శాఖ మంత్రి అనిల్‌ దేశ్‌ ముఖ్‌ అన్నారు. ఇక ఈ దాడి రాజ్‌ గృహ మీద జరిగినట్టు కాదనీ, అంబేద్కర్‌ వాదుల మీద చేసిందని చంద్రశేఖర్‌ ఆజాద్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాజ్‌గృహ మీద జరిగిన దాడి దురదృష్టకరమని, ఈ ప్రదేశం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అంబేద్కర్‌ వాదులకు స్ఫూర్తివంతకమైనదని అంబేద్కర్ మనమడు ప్రకాష్ అంబేద్కర్ పేర్కొన్నారు. ప్రజలంతా సహనం పాటించాలని, ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపడుతున్నారని తెలిపారు. ఎవరూ రాజ్‌ గృహ వైపు రావొద్దని, ఇది సంఘటితంగా ఉండాల్సిన సమయమని సూచించారు. నమ్మకం కోల్పోవొద్దని, ధైర్యంగా ఉండాలని పిలుపు ఇచ్చారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp