నాగసాకి కొంప ముంచిన వాతావరణం

By Sannapareddy Krishna Reddy Aug. 11, 2020, 09:45 pm IST
నాగసాకి కొంప ముంచిన వాతావరణం

రెండవ ప్రపంచ యుద్ధంలో తమ ప్రధాన శత్రువులైన జర్మనీ, ఇటలీ లొంగిపోయినా జపాన్ లొంగకుండా మొండిగా యుద్ధం చేస్తూ తమకు అపార నష్టం కలుగజేస్తున్న జపాన్ మెడలు వంచి యుద్ధాన్ని త్వరితగతిన ముగించాలన్న లక్ష్యంతో హీరోషిమా మీద అణుబాంబు ప్రయోగించి రెండు రోజులైనా జపాన్ పాలకుల నుంచి లొంగుబాటును ప్రకటన రాకపోవడంతో తమ దగ్గర సిద్ధంగా ఉన్న రెండవ బాంబును కూడా ప్రయోగించడానికి అధ్యక్షుడు హ్యారీ ట్రూమన్ సైన్యానికి ఆఙ ఇచ్చాడు.

మొదటి టార్గెట్ కొకూరా

ఆగస్టు తొమ్మిదో తేదీ ఉదయాన్నే పసిఫిక్ సముద్రంలోని టినియన్ ద్వీపంలో ఉన్న తమ స్థావరం నుంచి ఫ్యాట్ మ్యాన్ అన్న పేరున్న ప్లుటోనియం బాంబును ఒక B-29 విమానంలో తీసుకుని ఛార్లెస్ స్వీనీ తనకు నిర్దేశించిన లక్ష్యం అయిన కొకూరా నగరం వైపు బయలు దేరాడు.

హీరోషిమా మీద ప్రయోగించిన యురేనియం బాంబు, "లిటిల్ బాయ్" బరువు తొమ్మిది వేల పౌండ్లు అయితే, ప్లుటోనియం బాంబు అయిన "ఫ్యాట్ మ్యాన్" బరువు పదివేల మూడు వందల పౌండ్లు. బాంబు బరువు, ఆకారం చూసి అమెరికా సైన్యం దీనికి ఫ్యాట్ మ్యాన్ అని పేరు పెట్టింది.

కొకూరా దగ్గరకు రాగానే ఆకాశం మేఘావృతమై ఉండడం, అంతకు ముందు రాత్రి పక్కన ఉన్న యహాటా నగరం మీద అమెరికా విమానాలు కురిపించిన బాంబుల తాలూకూ పొగ కొకూరా నగరం మీద కూడా వ్యాపించి ఉండడం వలన విమానం నుంచి కింద లక్ష్యం సరిగా కనిపించలేదు. రాడార్ ద్వారా కాకుండా కంటితో చూసి బాంబును వదలమని ఆర్డర్ ఉండడంతో కొకూరా మీద బాంబు ప్రయోగం కష్టమని తెలిసిపోయింది.

వెంటనే విమానాన్ని కొకూరాకు దక్షిణంగా 128 కిలోమీటర్ల దూరంలో ఉన్న రెండవ లక్ష్యం అయిన నాగసాకి నగరం వైపు తిప్పాడు పైలట్ చార్లెస్ స్వీనీ. నాగసాకి మీద వాతావరణం క్లియర్ గా ఉండడంతో సరిగ్గా ఉదయం పదకొండు గంటలకు నాగసాకి మీద ఫ్యాట్ మ్యాన్ బాంబును వదిలిపెట్టారు.

హిరోషిమా మీద ప్రయోగించిన బాంబు కన్నా ఇది ఎక్కువ శక్తివంతమైన బాంబు అయినా నాగసాకి నగరం రెండు పర్వతాల నడుమ ఉండడం వలన, హిరోషిమాలో ఉన్న చెక్కతో చేసిన గృహాలు కాకుండా ఇక్కడ కాంక్రీటు గృహాలు ఉండడం వలన ప్రాణనష్టం హిరోషిమా కన్నా నాగసాకిలో తక్కువగా జరిగింది. మొత్తం మరణాల సంఖ్య నలభై వేల నుంచి ఎనభై వేలు అని అంచనా.

నాగసాకి మీద దాడి జరిగిన తర్వాత కూడా వెంటనే జపాన్ ప్రభుత్వం నుంచి లొంగుబాటు ప్రకటన రాకపోవడంతో మరిన్ని అణు దాడులకు అమెరికా ఏర్పాట్లు చేసుకుంటుండగా ఆగస్టు 15న జపాన్ చక్రవర్తి హిరోహిటో లొంగిపోతున్నట్టు రేడియోలో ప్రకటించడంతో రెండవ ప్రపంచ యుద్ధం అధికారికంగా ముగిసింది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp