డిఎస్పీగా పరుగుల రాణి...

By Rishi K Feb. 26, 2021, 09:21 pm IST
డిఎస్పీగా పరుగుల రాణి...

భారత స్టార్ స్ప్రింటర్ హిమదాస్‌ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్(డీఎస్పీ)గా పదవీ బాధ్యతలు స్వీకరించారు. అస్సాం రాష్ట్ర ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్ సమక్షంలో డీఎస్పీగా ప్రమాణ హిమ దాస్ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో అసోం రాష్ట్ర డిఐజితో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు..

ఈ నెల 10 తేదీన సీఎం సర్బానంద సోనోవాల్‌ అధ్యక్షతన మంత్రివర్గ సమావేశంలో ఒలింపిక్స్, ఆసియా క్రీడలు, కామన్వెల్త్ క్రీడల్లో పతకాలు సాధించిన వారికి క్లాస్ -1 ఆఫీసర్లుగా, ప్రపంచ ఛాంపియన్‌షిప్ సీనియర్ పతక విజేతలు క్లాస్ 2 ఆఫీసర్లుగా నియమించాలని సమగ్ర క్రీడా పాలసీకి సవరణను ఆమోదించింది. దాంతో హిమదాస్‌ను డిఎస్పీగా ఖరారు చేస్తూ అసోం ప్రభుత్వం నిర్ణయించింది.

కాగా నేడు అసోం ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్‌ హిమదాస్‌కు డిఎస్పీగా నియామక ఉత్తర్వులు అందజేశారు. ఈ సందర్భంగా హిమాదాస్ మాట్లాడుతూ తన చిన్ననాటి కల నెరవేరిందని క్రీడల వల్ల తనకు పేరు ప్రతిష్టలతో పాటు గౌరవ మర్యాదలు వచ్చాయని, రాష్ట్రంలో క్రీడల మెరుగుదల కోసం కృషి చేస్తానని వెల్లడించింది. డిఎస్పీగా పనిచేస్తూనే క్రీడల్లో రాణించేందుకు కృషిచేస్తానని హిమాదాస్ స్పష్టం చేసింది. అసోం రాష్ట్రాన్ని అత్యుత్తమ పనితీరు కనబరిచే రాష్ట్రాలలో ఒకటిగా మార్చడానికి ప్రయత్నం చేస్తానని హిమాదాస్ పేర్కొంది. తనను పోలీస్ గా చూడాలని తన తల్లి కల అని తానిప్పుడు డిఎస్పీ ఉద్యోగం సాధించి తల్లి కలను నిజం చేశానని ఆనందం వ్యక్తం చేసింది హిమాదాస్.

కాగా 2018 లో ఫిన్లాండ్‌లో జరిగిన అండర్‌–20 ప్రపంచ చాంపియన్‌షిప్‌ 400మీ.ఈవెంట్‌లో స్వర్ణం గెలిచిన హిమ దాస్ దేశం మొత్తాన్ని ఆకర్షించింది. స్వర్ణ పథకం సాధించిన తొలి భారతీయ వ్యక్తిగా రికార్డు సృష్టించిన హిమాదాస్ ఇదే చాంపియన్‌షిప్‌లో 4*400 రిలేలో మరో స్వర్ణం, మిక్స్‌డ్‌ రిలేలో రజతాన్ని సాధించింది. టోక్యో ఒలింపిక్స్ లో భారత్ తరపున స్వర్ణ పథకం సాధించడమే తన లక్ష్యమని హిమాదాస్ స్పష్టం చేసింది.

హిమదాస్‌ను అసోం ప్రభుత్వం డిఎస్పీగా నియమించడాన్ని పలువురు ప్రశంసిస్తున్నారు. హిమాదాస్ ప్రతిభకు తగిన పదవి దక్కిందని సోషల్ మీడియాలో పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రతిభకు పేదరికం అడ్డురాదని నిరూపించిన హిమాదాస్ అంతర్జాతీయ క్రీడా పోటీల్లో భవిష్యత్తులో దేశానికి మరింత పేరు తీసుకువస్తుందని పలువురు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp