వ్యాక్సిన్ పంపిణీకి ఏర్పాట్లు పూర్తి...

జనవరి 16 నుండి దేశంలో కరోనా వ్యాక్సిన్ పంపిణీకి కేంద్రం రంగం సిద్ధం చేసింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు కోవిడ్ వ్యాక్సిన్ రవాణా జరుగుతుంది.దేశాన్ని వణికిస్తున్న కరోనాను ఎదుర్కోవడానికి కేంద్ర ప్రభుత్వం ఆక్స్‌ఫర్ట్-ఆస్ట్రాజెనెకా సౌజన్యంతో సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా తయారు చేసిన కొవిషీల్డ్ మరియు భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ టీకాల అత్యవసర వినియోగానికి అనుమతినిచ్చిన విషయం తెలిసిందే. వ్యాక్సిన్ల పంపిణీలో భాగంగా తొలిదశలో కోవిడ్ ఫ్రంట్ లైన్ వారియర్స్ కి ఇవ్వనున్నారు.
దేశవ్యాప్తంగా 2934 కేంద్రాల ద్వారా టీకాలను అందించడానికి కేంద్రం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ కేంద్రాల ద్వారా వందమందికి టీకాలు ఇచ్చేవిధంగా అధికారులు ఏర్పాటు చేశారు. తొలిరోజు దాదాపు 3లక్షల మంది ఆరోగ్య సంరక్షణ సిబ్బందికి టీకా ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. కాగా వ్యాక్సిన్ తీసుకునేవాళ్ళు తమకి నచ్చిన వ్యాక్సిన్ తీసుకునే ఆప్షన్ లేదని కేంద్రం స్పష్టం చేసింది. వ్యాక్సిన్ పంపిణీలో భాగంగా 1.65కోట్ల డోసులను ప్రభుత్వం సేకరించగా, వీటిలో 1.1కోట్ల డోసులు కొవిషీల్డ్‌వి కాగా, మరో 55లక్షల డోసులను భారత్ బయోటెక్(కొవాగ్జిన్) నుంచి తీసుకుంది.
తొలి విడత డోసులను మొత్తం 8 ప్రత్యేక వాణిజ్య మరియు 2 కార్గో విమానాల ద్వారా పుణె నుంచి ఢిల్లీ, అహ్మదాబాద్, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, కర్నాల్, హైదరాబాద్, విజయవాడ, గువాహటి, లఖ్‌నవూ, చండీగఢ్, భువనేశ్వర్,గన్నవరానికి కేంద్రం తరలించింది. కాగా కరోనా వ్యాక్సిన్ 28రోజుల వ్యవధిలో రెండు డోసులను ఇస్తారు. వ్యాక్సిన్ తీసుకున్న 14రోజుల తర్వాతే టీకాల ప్రభావం ప్రారంభమవుతుందని కాబట్టి టీకా తీసుకున్న 14 రోజులపాటు ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.


Click Here and join us to get our latest updates through WhatsApp