ఏపీలో స్థానిక ఎన్నికలపై టీఆర్ఎస్ తోనూ చర్చిస్తానంటున్న నిమ్మగడ్డ..!

By Raju VS Oct. 28, 2020, 09:13 am IST
ఏపీలో స్థానిక ఎన్నికలపై టీఆర్ఎస్ తోనూ చర్చిస్తానంటున్న నిమ్మగడ్డ..!

ఏడు నెలల క్రితమే ముగియాల్సిన స్థానిక ఎన్నికలను ఏకపక్షంగా వాయిదా వేసి నిమ్మగడ్డ రమేష్ సుప్రీంకోర్ట్ తో మొట్టికాయలు వేయించుకున్నారు. ఎన్నికల కోడ్ తొలగించాలని, మళ్లీ ఎన్నికలు నిర్వహించే పరిస్థితి ఏర్పడినప్పుడు ప్రభుత్వాన్ని సంప్రదించి ముందుకెళ్లాలని ఆదేశాలు కూడా అందుకున్నారు. అయినా ఇప్పుడు ఆయన కోర్టు ధిక్కారణకు పూనుకున్నట్టు కనిపిస్తోంది. సుప్రీంకోర్ట్ ఆదేశాలను కూడా ఖాతరు చేసేందుకు ససేమీరా అంటున్నారు. మరోసారి ఒంటెద్దుపోకడతో ముందుకు సాగుతున్నారు. స్థానిక ఎన్నికల ప్రక్రియను మళ్లీ ప్రారంభిస్తున్నారు. మరోసారి వివిధ రాజకీయ పక్షాలతో భేటీ జరుపుతున్నారు.

ఈ సందర్భంగా ఆయన ఆసక్తికర నిర్ణయం తీసుకున్నారు. సహజంగా రాజకీయ పక్షాలతో ఎన్నికల సంఘం సంయుక్త సమావేశాలు నిర్వహిస్తుంది. అన్ని పార్టీల అభిప్రాయాలను బహిరంగంగానే స్వీకరిస్తున్నారు. ఆయా పార్టీలు తమ విధానాలు, రాజకీయ అవసరాల ఆధారంగా తమ అభిప్రాయం చెప్పడం, మరిన్ని సూచనలు చేయడం చాలాకాలంగా వస్తున్న ఆనవాయితీ. కానీ నిమ్మగడ్డ మాత్రం దానికి భిన్నమైన దారిలో సాగుతున్నారు. ఈసారి రాజకీయ పక్షాల భేటీ ఏకాంతంగా నిర్వహిస్తున్నారు. ఒక్కో పార్టీని వరుసగా పిలుస్తామని ఇప్పటికే స్పష్టం చేశారు. జాతీయ, రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందిన పార్టీల ప్రతినిధులు ఒక్కొక్కరితో ఎస్ఈసీ సమావేశమవుతారు. వారి అభిప్రాయాలను తెలుసుకుంటారని వెల్లడించారు.

ఇలా విడివిడి భేటీల మర్మం ఏమిటో ఎవరికీ అంతుబట్టడం లేదు. ఏ ఉద్దేశంతో ఇలాంటి ప్రయత్నం జరుగుతుందన్నది అర్థంకావడం లేదు. అదే సమయంలో గుర్తింపు పొందిన పార్టీల పేరుతో ఈ సమావేశానికి టీఆర్ఎన్ ని కూడా ఆహ్వానించడం ఆశ్చర్యంగా కనిపిస్తోంది. జాతీయ పార్టీలలో తొలుత బీఎస్పీ, తర్వాత బీజేపీ, అనంతరం కమ్యూనిస్టు పార్టీల అభిప్రాయాలను సేకరించబోతున్న ఎస్ఈసీ ఆ తర్వాత రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందిన పార్టీలను ఆహ్వానించాయి. ఇప్పటికే బీజేపీ తరుపున ప్రతినిధి పేరుతో ప్రకటించారు. సీపీఐ, సీపీఎం కూడా తమ పార్టీ నేతల పేర్లను వెల్లడించాయి. కానీ అనూహ్యంగా టీఆర్ఎస్ ని కూడా ఆహ్వానించడమే చాలామంది విచిత్రంగా పరిగణిస్తున్నారు. ఏపీలో ఒక్క ఎన్నికల్లో కూడా ఆపార్టీ పోటీ చేసిన దాఖలాలు లేవు. కనీసం ఒక్క ఓటు కూడా ఆపార్టీ పొందని ఆనవాళ్లు లేవు. అలాంటి సమయంలో టీఆర్ఎస్ ని ఏపీ ఎన్నికల నిర్వహణలో భాగస్వామ్యం చేయాలనే ఆలోచన చర్చనీయాంశం అవుతోంది.

ఇప్పటికే ఈ ఎన్నికల సన్నాహాల పట్ల వైఎస్సార్సీపీ తమ అభ్యంతరం తెలిపింది. సమావేశానికి హాజరుకావడం లేదని వెల్లడించింది. ఎన్నికలను వాయిదా వేసిన సమయంలో ఎవరితో చర్చించి నిర్ణయం తీసుకున్నారనే ప్రశ్నను ఆపార్టీ వేస్తోంది. సొంత రాజకీయ ఎజెండాతో ఎన్నికల సంఘం వ్యవహారిస్తోందని ఆరోపిస్తోంది. ఇప్పటికే లాక్ డౌన్ నిబంధనలను మరో నెల పాటు పొడిగిస్తూ కేంద్రం ప్రకటన చేసింది. రాష్ట్రాల పరిస్థితులను బట్టి అక్కడి ప్రభుత్వాలు సడలింపులపై ఆలోచన చేస్తాయంటూ కొన్ని మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రమేయం లేకుండా నిమ్మగడ్డ రమేష్ సాగిస్తున్న ప్రహసనం మరోసారి రాజకీయ చర్చకు తెరలేపింది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp