రాజ‌ధాని విశాఖ‌.. సిద్ధ‌మైన పోలీసు శాఖ..!

By Kalyan.S Aug. 07, 2020, 12:45 pm IST
రాజ‌ధాని విశాఖ‌.. సిద్ధ‌మైన పోలీసు శాఖ..!

పాల‌నా రాజ‌ధానిగా విశాఖ‌కు ఆమోద‌ముద్ర ప‌డిన‌ప్ప‌టి నుంచీ రాజ‌కీయ వ‌ర్గాల్లోనే కాదు.. అధికార వ‌ర్గాల్లోనూ తీవ్ర చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. ముందుగా ఏ యంత్రాంగం క‌ద‌లాలి..? ఎలా వెళ్లాలి..? అక్క‌డ ఏర్పాట్లు, అవ‌కాశాలు ఏంటి..? అనే ప్ర‌శ్న‌లు త‌లెత్తుతున్నాయి. ఎవ‌రికి ఏ అవ‌స‌రం వ‌చ్చినా ముందు వ‌రుస‌లో నిల‌బ‌డేది పోలీస్. అందుకే అన్ని శాఖ‌ల కంటే ముందుగానే పోలీసు శాఖ త‌ర‌లేందుకు ప్ర‌భుత్వం ఆదేశాలు ఇచ్చిన‌ట్లు తెలుస్తోంది. విశాఖ‌ప‌ట్ట‌ణానికి ముఖ్య‌మంత్రి కార్యాల‌యం మొద‌లుకుని ఏ శాఖ రావాల‌న్నా, మంత్రులు, ప్ర‌జాప్ర‌తినిధుల‌కు అవ‌స‌ర‌మైన ఏర్పాట్లు, ర‌క్ష‌ణ‌, ట్రాఫిక్ ఇలా.. దేనికి సంబంధించి చ‌ర్య‌లు చేప‌ట్టాల‌న్నా పోలీసు శాఖ ఉండాల్సిందే. దానిక‌నుగుణంగా ఆ శాఖ సిద్ధ‌మవుతోంది.

సీనియ‌ర్ ఐపీఎస్ ల‌తో క‌మిటీ..

రాజ‌ధాని విశాఖ‌ప‌ట్ట‌ణంలో భ‌ద్ర‌త‌పై డీజీపీ గౌత‌మ్ స‌వాంగ్ సీనియ‌ర్ ఐపీఎస్‌ల‌తో ఓ క‌మిటీ ఏర్పాటు చేశారు. విశాఖ పోలీస్ క‌మిష‌న‌ర్ రాజీవ్ కుమార్ మీనా చైర్మ‌న్ గా న‌లుగురు ఐజీలు, ఇద్ద‌రు డీజీపీల‌తో కూడిన క‌మిటీకి ప్లానింగ్ విభాగం ఓఎస్డీ క‌న్వీన‌ర్ గా వ్య‌వ‌హ‌రిస్తారు. విశాఖ‌లో పోలీసు ప్ర‌ధాన కార్యాల‌యం ఏర్పాటు, అనుకూల‌త‌ల‌పై నివేదిక ఇవ్వాల‌ని ఆ క‌మిటీకి డీజీపీకి బాధ్య‌త‌లు అప్ప‌గించారు. న‌గ‌రంలోని ట్రాఫిక్ ప‌రిస్థితులు, వీఐపీల ర‌క్ష‌ణ‌, అందుక‌నుగుణంగా పోలీసు సిబ్బంది పెంపు త‌దిత‌ర అంశాల‌పై ఆ క‌మిటీ ఇప్ప‌టికే ఆధ్య‌యనం చేస్తోంది. ఈ నెల 14లోపు నివేదిక ఇవ్వ‌నుంది. విశాఖ‌ప‌ట్ట‌ణంలో ప్ర‌స్తుతం ఉన్న ఐపీఎస్ ల‌తో పాటు, గ‌తంలో అక్క‌డ ప‌ని చేసిన సీనియ‌ర్ ఐపీఎస్ ల‌తో ఏర్పాట‌యిన క‌మిటీ స‌భ్యుల‌కు అక్క‌డి ప‌రిస్థితుల‌పై పూర్తి అవ‌గాహ‌న ఉన్న మేర‌కు డీజీపీ వారిని నియ‌మించారు.

మ‌ధుర‌వాడ‌లో డీజీపీ ఆఫీస్‌...

విశాఖ‌లోని మ‌ధుర‌వాడ ఐటీ హిల్స్ లో డీజీపీ కార్యాల‌యాన్ని తాత్కాలికంగా ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు తెలుస్తోంది. అక్క‌డున్న ప్ర‌భుత్వ భ‌వ‌నాల్లో అనువైన వాటిని క‌మిటీ ఎంపిక చేయ‌బోతున్న‌ట్లు స‌మాచారం. ఒకే భ‌వ‌నంలో సీఐడీ విభాగం, టెక్నిక‌ల్ స‌ర్వీసెస్ కూడా ఏర్పాటు చేసే ఆలోచ‌న‌లో పోలీసు శాఖ ఉంది. ఏసీబీ, విజిలెన్స్ , ఇంటెలిజెన్స్, ఫోరెన్సిక్ సైన్స్ త‌దిత‌ర విభాగాల‌కు కూడా అనుకూల‌మైన భ‌వ‌నాలు ఏర్పాటు చేసి శాశ్వ‌తంగా ఎక్క‌డ నిర్మిస్తే బాగుంటుంద‌నే అంశాల‌ను కూడా ప‌రిశీలిస్తున్నారు. నిర్మాణాల‌కు స్థ‌లాల అన్వేష‌ణ‌లో కూడా ఉన్న‌ట్లు స‌మాచారం. మొత్త‌మ్మీద ముందుగా పోలీసు శాఖ విశాఖ‌లో పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉంటే త‌ర్వాత ఒక్కొక్క‌టి త‌ర‌లే అవ‌కాశాలు ఉన్నాయి. ఈ మేర‌కు రాజ‌ధాని ప్ర‌క‌ట‌న వెలువ‌డినే వెంట‌నే పోలీసు శాఖ కూడా స‌మావేశం ఏర్పాటు చేసుకుని చ‌ర్చించిన‌ట్లు తెలిసింది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp