నిమ్మగడ్డకు మరో ఎదురుదెబ్బ

By Karthik P Mar. 03, 2021, 12:22 pm IST
నిమ్మగడ్డకు మరో ఎదురుదెబ్బ

ఎన్నికల నిర్వహణలో ఏకపక్షంగా వ్యవహరిస్తున్న ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ (ఏపీ ఎస్‌ఈసీ) నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌కు మరోసారి ఏపీ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. మున్సిపల్‌ ఎన్నికల్లో రీ నామినేషన్లకు అవకాశం కల్పిస్తూ ఎస్‌ఈసీ జారీ చేసిన ఉత్తర్వులు చెల్లవని రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. గత నోటిఫికేషన్‌ ద్వారానే ఎన్నికలు నిర్వహించాలని స్పష్టం చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

మున్సిపల్‌ ఎన్నికల్లో బెదిరింపుల వల్ల నామినేషన్లు దాఖలు చేయలేకపోయారనే ఫిర్యాదులతో.. నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ చిత్తూరు జిల్లా తిరుపతి కార్పొరేషన్, పుంగనూరు మున్సిపాలిటీ, కడప జిల్లా రాయచోటి మున్సిపాలిటీ, ఎర్రగుంట్ల నగర పంచాయతీలలో 14 డివిజన్లు/వార్డులలో మళ్లీ నామినేషన్‌ వేసేందుకు అవకాశం కల్పించారు. ఎస్‌ఈసీ తీసుకున్న నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ మంగళవారం హైకోర్టులో నాలుగు లంచ్‌మోషన్‌ పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం ఈ రోజు తీర్పు వెల్లడించింది. నామినేషన్లు వేసే సమయంలో దాఖలు చేయని వారికి మళ్లీ ఎలా అవకాశం ఇస్తారని, ప్రస్తుతం నామినేషన్లు ఉపసంహరించుకుంటున్న సమయంలో రీ నామినేషన్లు వేయడం చట్ట విరుద్ధమని పిటిషన్‌దారులు వాదించారు. వారి వాదనతో ఏకీభవించిన హైకోర్టు.. నిమ్మగడ్డ జారీ చేసిన ఆదేశాలను కొట్టివేసింది.

కాగా, 14 చోట్ల రీ నామినేషన్‌ దాఖలుకు అవకాశం ఇవ్వగా అభ్యర్థుల నుంచి స్పందన కరువైంది. వారి ఫిర్యాదులను పరిశీలించి, రీ నామినేషన్లకు అవకాశం ఇస్తున్నట్లు ఎస్‌ఈసీ చెప్పగా.. రీ నామినేషన్లు దాఖలు కాకపోవడం విశేషం. తిరుపతి కార్పొరేషన్‌లో ఆరు డివిజన్లకు గాను 4 చోట్ల మాత్రమే నామినేషన్లు దాఖలయ్యాయి. పుంగనూరు మున్సిపాలిటీలో మూడు వార్డుల్లో ఒక్క రీ నామినేషన్‌ కూడా పడలేదు. రాజంపేటలో రెండు వార్డులకు రెండు, ఎర్రగుంట్లలో మూడు వార్డులకు గాను రెండు వార్డుల్లో మాత్రమే రీ నామినేషన్లు దాఖలయ్యాయి. ఈ పరిణామంతో నామినేషన్ల సమయంలో బెదిరించారని టీడీపీ నేతలు చేసిన విమర్శలు పూర్తిగా వాస్తవదూరమని తేలిపోయింది. రీ నామినేషన్‌ దాఖలుకు అవకాశం ఇచ్చిన నిమ్మగడ్డ నిర్ణయం కూడా సరికాదని తేలింది. మొత్తం మీద నిమ్మగడ్డ జారీ చేసిన ఉత్తర్వులను ఏపీ హైకోర్టు కొట్టివేయడంతో రీ నామినేషన్‌ వివాదానికి ఫుల్‌స్టాఫ్‌ పడినట్లైంది.

తాజా ఉత్తర్వులతో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో రీ నామినేష్లపై కూడా స్పష్టత వచ్చింది. మండల, జిల్లా పరిషత్‌ ఎన్నికల్లోనూ రీ నామినేషన్ల దాఖలుకు ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ అవకాశం ఇచ్చారు. నిమ్మగడ్డ నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ ఏకగ్రీవంగా ఎన్నికైన పలువురు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఇప్పటికే పలుమార్లు ఈ పిటిషన్లపై విచారణ జరిగింది. మున్సిపల్‌ ఎన్నికల్లో రీ నామినేషన్ల వ్యవహారంపై ఏపీ హైకోర్టులో వచ్చిన తీర్పే.. మండల, జిల్లా పరిషత్‌ ఎన్నికల్లో రీ నామినేషన్ల వ్యవహారంపై కూడా వచ్చే అవకాశం కనిపిస్తోంది. అతి త్వరలో హైకోర్టు మండల, జిల్లా పరిషత్‌ రీ నామినేషన్లపై నెలకొన్న వివాదానికి చెక్‌ పెట్టబోతోంది. ఆ తర్వాత ఎన్నికలు ఆగిన చోట నుంచి ప్రారంభమవుతాయి.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp