తదుపరి చర్యలు నిలిపివేయండి.. దమ్మాలపాటి వ్యవహారంలో ఏపీ హైకోర్టు

By Kotireddy Palukuri Sep. 15, 2020, 10:55 pm IST
తదుపరి చర్యలు నిలిపివేయండి.. దమ్మాలపాటి వ్యవహారంలో ఏపీ హైకోర్టు

చంద్రబాబు ప్రభుత్వ హయాంలో అడ్వకేట్‌ జనరల్‌గా పని చేసిన దమ్మాలపాటి శ్రీనివాస్‌కు అమరావతి భూ కుంభకోణంలో ఏపీ హైకోర్టు ఊరటనిచ్చే ఆదేశాలు జారీ చేసింది. అమరావతిలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ ద్వారా దమ్మాలపాటి భూములు కొనుగోలు చేశారని ఈ రోజు ఏసీబీ కేసు నమోదు చేసింది. ఈ వ్యవహారంపై హైకోర్టులో లంచ్‌మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేసిన దమ్మాలపాటి శ్రీనివాస్‌.. తదుపరి చర్యలు నిలిపివేయాలని, ఏసీబీ కేసులో తన పేరు మీడియాలో ప్రచురణ, ప్రసారం కాకుండా చూడాలని కోరారు.

ఈ పిటిషన్‌ను విచారించిన రాష్ట్ర అత్యున్నత ధర్మాసనం.. దమ్మాలపాటికి అనుకూలంగా ఆదేశాలు జారీ చేసింది. ఏసీబీ నమోదు చేసిన కేసుల్లో తదుపరి చర్యలను నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. దమ్మాలపాటి తరఫున వాదనలు వినిపించిన ముఖుల్‌ రోహత్గీ.. ఉద్దేశపూర్వకంగానే దమ్మాలపాటి శ్రీనివాస్‌ను అమరావతి భూ కుంభకోణంలో ఇరికించేందుకే కేసులు నమోదు చేశారని చెప్పుకొచ్చారు.

కాగా, ఈ వ్యవహారంలో ఏసీబీ ఇంకా ప్రాథమిక దశలోనే ఉంది. అయితే ఈ సమయంలోనే విచారణపై హైకోర్టు స్టే ఇవ్వడంతో రాష్ట్ర ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తుందన్నది తెలియాల్సి ఉంది. హైకోర్టు తీర్పుపై సుప్రిం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేయనుందా..? అనేది త్వరలో తేలనుంది. రమేష్‌ ఆస్పత్రి విషయంలోనూ హైకోర్టు విచారణ ఆపాలని స్టే ఇస్తే.. రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్‌ మేరకు ఆ స్టేను ఎత్తివేస్తూ విచారణ జరపాలని సుప్రిం కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp