పరిషత్‌ ఎన్నికలపై కొనసాగుతున్న ఉత్కంఠ.. హైకోర్టులో ట్విస్ట్

By Karthik P Apr. 07, 2021, 11:53 am IST
పరిషత్‌ ఎన్నికలపై కొనసాగుతున్న ఉత్కంఠ.. హైకోర్టులో ట్విస్ట్

ఏపీలో మండల, జిల్లా పరిషత్‌ ఎన్నికలు జరుగుతాయా..? లేదా..? అనే ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. 28 రోజులపాటు ఎన్నికల కోడ్‌ విధించలేదనే కారణంతో ఏపీ హైకోర్టు సింగిల్‌ జడ్జి పరిషత్‌ ఎన్నికలను వాయిదా వేయాలని మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. టీడీపీ నేత వర్ల రామయ్య దాఖలు చేసిన రిట్‌ పిటిషన్‌ను విచారించిన సింగిల్‌ జడ్జి ఈ ఉత్తర్వులు ఇచ్చారు. వీటిని సవాల్‌ చేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) డివిజనల్‌ బెంచ్‌లో అత్యవసర పిటిషన్‌ను దాఖలు చేసింది.

ఎస్‌ఈసీ పిటిషన్‌ ఈ రోజు ఉదయం విచారణకు వచ్చింది. ఎస్‌ఈసీ తరఫున సీనియర్‌ న్యాయవాది సీవీ మోహన్‌ రెడ్డి వాదనలు వినిపించారు. 28 రోజుల ఎన్నికల కోడ్‌ ప్రస్తుతం జరుగుతున్న పరిషత్‌ ఎన్నికలకు వర్తించదని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. ఇది కొత్త నోటిపికేషన్‌ కాదని గుర్తు చేశారు. ఎన్నికల్లో పోటీ చేయని వర్ల రామయ్యకు రిటి పిటిషన్‌ వేసే హక్కు లేదని వాదించారు. పిల్‌ వేసేందుకు మాత్రమే అవకాశం ఉందన్నారు.

Also Read : పరిషత్‌ ఎన్నికలకు హైకోర్టులో బ్రేక్‌

ఈ విషయాలను సింగిల్‌ జడ్జి దృష్టికి తీసుకెళ్లారా..? అని డివిజనల్‌ బెంచ్‌ ప్రశ్నించగా.. వాదనకు తగిన సమయం లేకపోవడంతో తీసుకెళ్లలేదని ఎస్‌ఈసీ న్యాయవాది పేర్కొన్నారు. ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేశామని, ఈ నెల 8వ తేదీన పోలింగ్‌ జరగాల్సి ఉన్న నేపథ్యంలో సింగిల్‌ జడ్జి ఉత్తర్వులను రద్దు చేస్తూ ఎన్నికలు జరిగేలా ఆదేశాలు జారీ చేయాలని ధర్మాసనానికి విన్నవించారు. ఎస్‌ఈసీ వాదనలను తర్వాత.. విచారణను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేస్తున్నట్లు ధర్మాసనం ప్రకటించింది.

ఈ నెల 1వ తేదీన మధ్యలో ఆగిన పరిషత్‌ ఎన్నికలు పూర్తి చేసేందుకు ఎస్‌ఈసీ నోటిపికేషన్‌ జారీ చేశారు. నిన్నటితో ప్రచారం కూడా పూర్తయింది. పోలింగ్‌ సిబ్బంది ఎన్నికల సామాగ్రితో పోలింగ్‌ కేంద్రాలకు చేరుకున్నారు. రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్‌ జరగబోతోంది. బ్యాలెట్‌ పద్ధతిలో పార్టీ గుర్తులతో పరిషత్‌ ఎన్నికలు జరగబోతున్నాయి. అయితే కోర్టు వివాదాల నేపథ్యంలో ప్రస్తుతం సందిగ్థత నెలకొంది. ఈ రోజు మధ్యాహ్నం తర్వాత పరిషత్‌ ఎన్నికలు జరుగుతాయా..? లేదా..? అనే అంశంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Also Read : ప్రభుత్వానికి అడ్డంకులు సృష్టించడమే టీడీపీ లక్ష్యమా..?

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp