హైకోర్టు ఉత్తర్వులు ఏ విధంగా అర్థం చేసుకోవాలి..?

By Karthik P Oct. 17, 2020, 07:00 pm IST
హైకోర్టు ఉత్తర్వులు ఏ విధంగా అర్థం చేసుకోవాలి..?

ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో జరుగుతున్న పరిణామాలు ఇటీవల చర్చనీయాంశమవుతున్నాయి. హైకోర్టులో వస్తున్న తీర్పులు, గౌరవ న్యాయమూర్తులు చేస్తున్న వ్యాఖ్యలపై ప్రజల్లో భిన్నమైన అభిప్రాయాలు వస్తున్నాయి. హైకోర్టు తీర్పులపై, న్యాయమూర్తులపై చేసే వ్యాఖ్యలు కోర్టు ధిక్కారం కిందకు వస్తాయి కాబట్టి.. స్పందనలు అత్యధికం గుంభనంగానే సాగుతున్నాయి. అతి కొద్ది మంది ప్రత్యక్షంగానో, పరోక్షంగానో స్పందిస్తున్నారు. వారిపై కోర్టు ధిక్కారం కింది హైకోర్టు సుమోటోగా కేసులు కూడా నమోదు చేసింది.

ఇటీవల అమరావతి భూముల కుంభకోణంలో హైకోర్టు ఇచ్చిన గ్యాగ్‌ ఆర్డర్‌ దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అమరావతి భూముల కుంభకోణలో మాజీ అడ్వకేట్‌ జనరల్‌ దొమ్మాలపాటి శ్రీనివాస్, సుప్రిం న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణ కుమార్తెలు తదితర 13 మందిపై ఏసీబీ దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్‌లోని వివరాలు బయటకు వెల్లడించకూడదంటూ హైకోర్టు గ్యాగ్‌ ఆర్డర్‌ ఇచ్చింది. దీంతో ఏసీబీ ఆ వివరాలను వెల్లడించలేదు. మీడియా ప్రచారం చేయలేదు. ఆ ఎఫ్‌ఐఆర్‌లో ఏముందనేది ఇప్పటికీ బయట ప్రపంచానికి తెలియదు. గ్యాగ్‌ ఆర్డర్‌ రాజ్యాంగ విరుద్ధమంటూ, సమాచారం తెలుసుకునే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందని.. గ్యాగ్‌ ఆర్డర్‌ సవరించాలని న్యాయవాది మమతారాణి పిటిషన్‌ వేశారు. ఈ కేసులో తనను కూడా ప్రతివాదిగా చేర్చాలని కోరారు.

ఈ అంశంపై విచారణ చేసిన గౌరవ ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు.. తాజాగా తీర్పు వెలువరించింది. సుప్రిం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి సీఎం జగన్‌ రాసిన లేఖను సలహాదారు అజేయ కల్లం ప్రెస్‌మీట్‌లో వెల్లడించడంతోనే తాము ఇచ్చిన గ్యాగ్‌ ఆర్డర్‌ నిష్ఫలం అయ్యాయని హైకోర్టు ప్రదాన న్యాయమూర్తి జస్టిస్‌ జేకే మహేశ్వరి వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో గ్యాగ్‌ ఆర్డర్‌ సవరించాలన్న పిటిషన్‌పై ఎలాంటి ఉత్తర్వులు అవసరంలేదన్నారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.

తాజా పరిణామాల నేపథ్యంలో ఏసీబీ దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్‌ అంశంపై సమాచార, ప్రసార మాధ్యమాలు తమ పాత్రను ఎలా పోషించాలన్నది అర్థం కాకుండా ఉంది. హైకోర్టు ఇచ్చిన గ్యాగ్‌ ఆర్డర్‌ను పాటిస్తూ ఎఫ్‌ఐఆర్‌లోని అంశాలను ప్రసారం చేయకూడదా..? లేక తాజాగా ప్రధాన న్యాయమూర్తి ఇచ్చిన ఉత్తర్వులుతో ఎఫ్‌ఐఆర్‌లోని అంశాలను వెల్లడించొచ్చా..? స్పష్టత కరువైంది. ముఖ్యమంత్రి సలహాదారు అజేయ కల్లం ఈ వివరాలను వెల్లడించారు కాబట్టి గ్యాగ్‌ ఆర్డర్‌ నిష్ఫలమైందని ప్రధాన న్యాయమూర్తి చెప్పారు. అంటే గ్యాగ్‌ ఆర్డర్‌ అమలులో లేనట్టేనా..? అనే సందేహం పలువురిలో కలుగుతోంది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp