Ap government - ఆర్బీకేల పటిష్టతపై ఏపీ సర్కారు దృష్టి

By Aditya Nov. 25, 2021, 10:31 am IST
Ap government - ఆర్బీకేల పటిష్టతపై ఏపీ  సర్కారు దృష్టి

ఆంధ్రప్రదేశ్ లో అన్నదాతలను అన్ని రకాలుగా ఆదుకునేందుకు ప్రారంభించిన రైతు భరోసా కేంద్రాలను (ఆర్బీకే) మరింత పటిష్ట పరిచేందుకు ప్రభుత్వం దృష్టి సారించింది. వ్యవసాయ రంగంలో మౌలిక వసతుల కల్పనకు చర్యలు చేపడుతోంది. ఇందుకోసం ప్రతి ఆర్బీకే పరిధిలో గొడౌన్ల నిర్మాణానికి కార్యాచరణ రూపొందించింది. ఇందుకోసం రూ.16 వేల కోట్లు ఖర్చు అవుతాయని అంచనా వేశారు. ఇప్పటికే టెండర్లను కూడా పిలిచారు. వచ్చే ఏడాదికి ఈ గొడౌన్లను అందుబాటులోకి తీసుకురావాలని కసరత్తు చేస్తున్నారు. ఈ గొడౌన్లలో రైతులు తమ పంట దిగుబడులను నిల్వ చేసుకోవచ్చు. రైతులకు త్వరలోనే ట్రాక్టర్లు అందించడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ ఏడాది వ్యవసాయ యాంత్రీకరణకు రూ.850 కోట్లను వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఖర్చు చేసింది.

రైతులకు వెన్నుదన్నుగా..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆర్బీకేలు అన్నదాతలకు వెన్నుదన్నుగా నిలుస్తున్నాయి. పాలనను ప్రజల ముంగిటకు తీసుకువెళ్లాలన్న ఉద్దేశంతో ప్రతి రెండువేల జనాభాకు ఒక సచివాలయం ఏర్పాటు చేసిన ప్రభుత్వం వాటికి అనుబంధంగా ఆర్బీకేల వ్యవస్థను తీసుకొచ్చింది.

రైతులకు నాణ్యమైన సేవలు..

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఆలోచన నుంచి పుట్టిన ఈ ఆర్బీకే వ్యవస్థ ద్వారా రైతులకు నాణ్యమైన సేవలు అందుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 10,778 ఆర్బీకేలను ఏర్పాటు చేశారు. వాటిలో కియోస్క్, స్మార్ట్ టీవీ, డిజిటల్ లైబ్రెరీ, భూసార, విత్తన పరీక్షలు చేసే మినీ టెస్టింగ్ కిట్లు, ఇంటర్నెట్ వంటి సదుపాయాలు కల్పించారు. వ్యవసాయ, దాని అనుబంధ శాఖల సిబ్బంది దాదాపు 15 వేల మంది ఆర్బీకేల్లో సేవలు అందిస్తున్నారు. వ్యవసాయ సీజనుకు ముందుగానే ధృవీకరించిన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులను వీటిలో అందుబాటులో ఉంచుతున్నారు. కియోస్క్ లో బుక్ చేసుకున్న గంటల వ్యవధిలో వాటిని రైతులకు అందజేస్తున్నారు.

పంట కొనుగోలు కేంద్రాలుగా కూడా..

ప్రభుత్వం ఆర్బీకేలను పంట కొనుగోలు కేంద్రాలుగా కూడా అభివృధ్ధి చేసింది. వీటికి అనుబంధంగా వైఎస్సార్ యంత్ర సేవా కేంద్రాలు (కమ్యూనిటీ హైరింగ్ సెంటర్లు), గోదాములతో కూడిన మల్టీపర్పస్ ఫెసిలిటీ సెంటర్లు ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. రైతులకు క్షేత్రస్థాయిలో వివిధ అంశాలపై వ్యవసాయ శాఖ అధికారులు, సిబ్బంది ఎప్పటికప్పుడు శిక్షణ ఇస్తున్నారు. పంట వివరాలను నమోదు చేసి ప్రభుత్వ సంక్షేమ పథకాలు రైతులకు సకాలంలో అందేలా సిబ్బంది చర్యలు తీసుకుంటున్నారు.

అంతర్జాతీయంగా ప్రశంసలు..

ఆర్బీకేల పనితీరుకు అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు లభిస్తున్నాయి. ఈ ఆలోచన వినూత్నంగా ఉందని పలువురు వ్యవసాయ రంగ నిపుణులు మెచ్చుకుంటున్నారు. వీటి పనితీరును అధ్యయనం చేసేందుకు ఐక్యరాజ్యసమితికి అనుబంధంగా పనిచేస్తున్న ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఏఓ)తో పాటు నీతి ఆయోగ్ కూడా ఆసక్తి కనబరిచింది. ఆర్బీకేల ఆలోచన అద్భుతం అని, వీటిని జాతీయ స్థాయిలో అమలు చేసేందుకు లోతైన చర్చ, అధ్యయనం అవసరం అని నీతి అయోగ్ మెచ్చుకొంది. విత్తు నుంచి విపణి వరకు రైతులకు సాగు సాయం అందించేలా ఈ విధానాన్ని రూపొందించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అభినందనలు తెలిపింది.

ఆర్బీకేలపై నీతి ఆయోగ్ ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఇవి దేశానికే ఆదర్శమని జాతీయ ఆహార భద్రతా మిషన్ కూడా ప్రశంసించింది. ఆర్బీకేలకు ఇప్పటికే స్కోచ్ అవార్డు వచ్చింది. ఐఎస్ఓ సర్టిఫికేషన్ కోసం కృషి చేస్తోంది.

Also Read : Ap Govt ,Online Tickets - ఏపీ ప్రజలకు ప్రభుత్వం శుభవార్త.. అందరికీ అందుబాటులో సినిమాలు

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp