నవంబర్ 2 నుంచే ప్రభుత్వ బడులు తెరిచేందుకు ఏపీ సర్కారు అడుగులు

By Raju VS Oct. 17, 2020, 06:44 am IST
నవంబర్ 2 నుంచే ప్రభుత్వ బడులు తెరిచేందుకు ఏపీ సర్కారు అడుగులు

కరోనా అన్ని రంగాల కన్నా విద్యారంగం మీద ఎక్కుగ ప్రభావం చూపింది. నేటికీ పిల్లలకు పాఠశాలలు తెరుచుకోకపోవడంతో తీవ్ర సమస్యగా మారబోతోంది. భవిష్యత్ తరాలకు ఈ విద్యాసంవత్సరం పెద్ద ఆటంకంగా మారే ప్రమాదం దాపురించింది. ఈ నేపథ్యంలో ఏపీలో ప్రస్తుతం సానుకూల పరిస్థితులు ఏర్పడుతున్న సమయంలో పాఠశాలలు తెరిచేందుకు అడుగులు వేస్తోంది.

లాక్ డౌన్ నిబంధనలతో మూతపడిన పాఠశాలలను వచ్చే నెల 2వ తేదీ నుంచి తెరవాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. స్కూల్స్ ప్రారంభానికి సన్నాహాలు చేస్తున్నామని ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు. ఇప్పటికే నాలుగైదు నెలలుగా స్కూల్స్ ప్రారంభించలేకపోయామని చెప్పారు. ఇప్పటికే ఇంటర్‌లో 30 శాతం సిలబస్ తగ్గించినట్టు గుర్తు చేసిన మంత్రి, అదే పద్ధతిలో హైస్కూల్ విద్యార్థులకు కూడా సిలబస్ తగ్గుదల ఉంటుందని తెలిపారు. స్కూల్స్ ప్రారంభమయ్యేలోపు విద్యా క్యాలెండర్ విడుదల చేస్తామని మంత్రి సురేష్ స్పష్టం చేశారు.

ఈ విద్యాసంవత్సరం ప్రారంభానికి ముందే ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ ప్రారంభించింది. ఏకోపాధ్యాయ పాఠశాలల స్థానంలో ఉపాధ్యాయులు అందుబాటులో ఉండేందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటోంది. ఈనెలాఖరు నాటికి అది పూర్తవుతుంది. అందుకు తోడుగా ఏపీలో ప్రస్తుతం ఏపీలో కరోనా తాకిడి తగ్గుముఖం పట్టింది. రాష్ట్రవ్యాప్తంగా కేసుల సంఖ్య భారీగా తగ్గింది. ప్రస్తుతం 4వేలు సుమారుగా కేసులు నమోదవుతున్నాయి. నెల్లూరు, అనంతపురం జిల్లాల్లో గడిచిన 24 గంటల్లో ఒక్క మరణం కూడా నమోదుకాకపోవడంతో యంత్రాంగం ఊపిరిపీల్చుకుంటోంది. గత ఏప్రిల్ తర్వాత ఇలాంటి పరిస్థితి ఇదే తొలిసారి కావడం విశేషం.

ఈ నేపథ్యంలో ప్రభుత్వ బడులు కూడా తెరిచి పాఠశాలలను కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా నడపాలనే నిర్ణయానికి వచ్చింది. భౌతికదూరం పాటిస్తూ, తరగతి గదుల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా తగు ఏర్పాట్లు తీసుకోవాలని ఇప్పటికే విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే విద్యాకానుక పథకంలో భాగంగా మళ్లీ విద్యార్థులు చాలాకాలం తర్వాత పాఠశాలల గడప దొక్కారు. ఇక వచ్చే నెల నుంచి మళ్లీ తరగతులు ప్రారంభమయితే పాఠశాలల్లో సందడి కనిపిస్తుంది

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp