వ్యాపారవేత్తలుగా మహిళలు.. లక్ష్యం దిశగా జగన్‌ పథకం

By Jaswanth.T Sep. 22, 2020, 04:10 pm IST
వ్యాపారవేత్తలుగా మహిళలు.. లక్ష్యం దిశగా జగన్‌ పథకం

ఎన్ని విమర్శలు చేసినా తనదైన శైలిలో సంక్షేమ పాలన సాగిస్తున్న ఏపీ సీయం వైఎస్‌ జగన్‌ తన నవరత్నాల పథకాల ద్వారా అనుకున్న లక్ష్యాలను సాధించడంలో ముందడుగు వేస్తున్నారు. కోవిడ్‌ 19 మహ్మారి ప్రపంచ దేశాలను అతాకుతలం చేస్తూ, ఆర్ధిక విధ్వంసాన్ని కలిగిస్తోంది. అయితే వివిధ సంక్షేమ పథకాలతో నేరుగా నగదు బదిలీ పథకాన్ని ఏపీ సీయం జగన్‌ అమలు చేస్తున్నారు. తద్వారా తన పాలనలో ఉన్న రాష్ట్రంలోని పేదలకు ఆర్ధిక ఇబ్బందులు తలెత్తుకుండా చర్యలు చేపడుతున్నారు. ప్రతిపక్షాలు విమర్శలు చేసినప్పటికీ దేశ, విదేశాల్లోని పలువురి నుంచి ప్రసంసలు అందుకున్నారు. అందులో భాగంగానే మరో పథకం తన లక్ష్యాన్ని నెరవేర్చడంలో శరవేగంగా ముందుకు కదులుతోంది.

వైఎస్సార్‌ ఆసరా, వైఎస్సార్‌ చేయూత పథకాల ద్వారా మహిళలకు ఆర్ధిక తోడ్పాటును అందిస్తున్నారు. ఈ విధంగా పొందిన ఆర్దిక సాయాన్ని తమకు నచ్చిన వ్యాపారాలు నిర్వహించుకునే వెసులుబాటును కల్పించారు. ఇందుకోసం సెర్ఫ్, మెప్మా వంటి సంస్థలు వారికి సలహాలు, సూచనలు అందజేస్తారు. సాంకేతిక తోడ్పాటుకోసం పలు కార్పొరేట్‌ సంస్థలతో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు సిద్ధం చేసింది.

ఈ రెండు పథకాల ద్వారా ఆర్ధిక ఆసరా దక్కించుకున్న మహిళల చేత రాష్ట్రంలో లక్ష వరకు రిటైల్‌ షాపులను ఏర్పాటు చేయించడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. తద్వారా ఆయా కుటుంబాలకు ఆర్ధిక ఆసరా దక్కుతుందన్నది ప్రభుత్వం స్థిర అభిప్రాయంగా నిర్ణయించుకుంది. ఇప్పటికే ఈ తరహా కార్యాచరణలో భాగంగా ఈ రెండు పథకాల ద్వారా 19.61 లక్షల మంది ఆర్ధిక తోడ్పాటును పొందారు. వీరిలో పదిలక్షల మందికిపైగా తాము ఏం వ్యాపారం చేయాలనుకుంటున్నామో వివరాలను సదరు సంస్థలకు ముందుగానే తెలియజేసారు. సదరు మహిళలు కోరుకుంటున్న వ్యాపారాలను పెట్టించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై మంత్రివర్గం కూడా చర్చించనుంది.

ఇప్పటి వరకు 3,419 చోట్ల పలు రకాలైన రిటైల్‌ దుకాణాలను మహిళలు ప్రారంభించినట్లు రికార్డులు స్పష్టం చేస్తున్నారు. వీలైనంత వేగంగా మహిళలు కోరుకున్న సాంకేతిక, నిర్వహణా పరమైన సాయాన్ని అందించడం ద్వారా వారిని వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దేందుకు చురుగ్గానే చర్యలు తీసుకుంటున్నారు.

గతానికి పూర్తి భిన్నంగా ఈ విధానం సాగుతోంది. గతంలో అధికారులు అడిగేవారు, మహిళలు చెప్పడమూ జరిగేది. ఇదంతా కేవలం కాగితాలకు మాత్రమే పరిమితం అయ్యేంది. స్వయం సహాయ సంఘాల గ్రూపుల్లోని మహిళలకు ఏదైనా వ్యాపారం నిర్వహించుకుందామని ఉన్పప్పటికి, సాంకేతిక, నిర్వహణా పరమైన సహకారం తాము ఎక్కడ్నుంచి పొందాలో అర్ధమయ్యేది కాదు. దీంతో తమకు తాముగా కాళ్ళపై నిలబడగలిగే ఉద్దేశం ఉన్నప్పటికీ మౌనంగానే ఉండిపోయేవారు.

సీయం వైఎస్‌ జగన్‌ ప్రభుత్వంలో పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా ఉంటోందని మహిళలే చెబుతున్నారు. తాము ఏ వ్యాపారమైతే చేయాలనుకుంటున్నామో, దానికి సంబంధించిన పూర్తి వివరాలను సంబంధిత శాఖల అధికారులే వచ్చి తమకు వివరిస్తున్నారంటున్నారు. తద్వారా పెట్టుకున్న వ్యాపారాలు విజయవంతంగా నడిపించేందుకు అవకాశం దక్కుతోందన్నది ధీమా మహిళల నుంచి వ్యక్తమవుతోంది.

తాను ముందే చెప్పినట్లుగా వైఎస్‌ జగన్‌ ప్రవేశపెట్టి, అమలు చేస్తున్న పథకాల ఏపీ సమాజంలో సమగ్ర మార్పులకు తప్పకుండా కారణమవుతాయని పలువురు పరిశీలకులు నిశ్చితాభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp