మహిళలే కేంద్ర బిందువుగా జగన్‌ పథకాలు

By iDream Post Mar. 08, 2020, 10:47 am IST
మహిళలే కేంద్ర బిందువుగా జగన్‌ పథకాలు
జనాభాలో సగం ఉన్నారు.. అయినా ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా, ఆఖరికి కుటుంబపరంగా కూడా మహిళలు కాస్త వెనుకే ఉంటున్నారు. మహిళలకు అవకాశాలు ఇస్తే ఎవరికీ తీసిపోరు అనే విషయం ఎన్నోసార్లు నిరూపితమైనా కూడా పరిస్థితిలో పెద్ద మార్పు ఉండడం లేదు. ప్రతి రాజకీయ నాయకుడు మహిళా సాధికారితకు పెద్ద పీట వేస్తాం అని వేదికలెక్కి చెప్పడమేగానీ ఆచరణలో మాత్రం పెట్టడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో మహిళల స్థితిగతుల్లో మార్పులు తేవడానికి ఓ ఆశా కిరణంలా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కనిపిస్తున్నారు. ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అవకాశాలు కల్పిస్తూ వారి ఉన్నతికి తోడ్పాటు అందిస్తున్నారు. మహిళలనే కేంద్ర బిందువుగా పథకాలను ప్రవేశపెడుతున్నారు.

ఒక మహిళకు ఆర్థిక స్వేచ్ఛనిస్తే పిల్లలను చక్కగా చదివించుకోగలదు. కుటుంబాన్ని నిలబెట్టగలదు. అందుకే జగనన్న అమ్మ ఒడి ద్వారా 15వేల రూపాయలు, వసతి దీవెన ద్వారా 10 వేల నుంచి 20 వేల రూపాయలను వారి అకౌంట్లోనే వేస్తున్నారు. డ్వాక్రా మహిళల అప్పులను నాలుగు దశల్లో జగనే తీర్చబోతున్నారు. 45 ఏళ్లు దాటిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు రూ. 75 వేలు సాయం అందించే పథకం త్వరలో ప్రారంభం కాబోతుంది. ఇవన్నీ మహిళల ఆర్థిక స్వావలంభనకు తోడ్పాటునిస్తాయి.

మహిళలు చదువులో రాణిస్తున్నా.. ఉద్యోగ అవకాశాలు మాత్రం కాస్త తక్కువగానే ఉంటున్నాయి. దీన్ని మార్చడానికి గ్రామ, వార్డు వలంటీర్లు, గ్రామ, వార్డు సచివాలయాల్లో ఏకంగా లక్షా 70 వేల ఉద్యోగాలను కల్పించారు. అంగన్‌వాడీలు, ఆశా వర్కర్లు, ఆయాలు లాంటి పోస్టుల్లో మహిళలే పనిచేస్తుంటారు. అయితే వారి జీతాలు మాత్రం ఎప్పుడూ కింది చూపే. వైఎస్‌ జగన్‌ అధికారంలోకి రాగానే వారి జీతాలను అమాంతం పెంచారు.

గతంలో రాజకీయంగా మహిళల పరిస్థితి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఈ పరిస్థితిని కూడా జగన్‌ మార్చేశారు. మొదటగా తన కేబినెట్‌లోనే ఒక డిప్యూటీ సీఎం పదవితోపాటు కీలకమైన హోం శాఖ, మహిళా సంక్షేమ శాఖలను వారికే కేటాయించారు. నామినేటెడ్‌ పదవులు, పనుల్లో ఏకంగా 50 శాతం మహిళలకే కేటాయించేలా అసెంబ్లీలో చట్టం కూడా చేశారు. బహుశా ఇది దేశంలోనే మొదటిసారేమో. ఆలయాల్లోని ట్రస్టు బోర్డుల్లో ఏకంగా 1900 పదవులు కేటాయించారు. 216 మార్కెట్‌ కమిటీల్లోనూ సగం పదవులు ఇచ్చారు. 45 వేల పాఠశాలల్లోని తల్లిదండ్రుల కమిటీల్లోనూ 50 శాతం అవకాశం కల్పించారు. స్థానిక ఎన్నికల్లోనూ మంచి అవకాశాలను కల్పించారు.

కుటుంబ ఆత్మగౌరవానికి ప్రతీక సొంత ఇళ్లు. కానీ సొంత ఇళ్లు లేని కుటుంబాలు మన రాష్ట్రంలో చాలా ఉన్నాయి. గతంలో ప్రభుత్వాలు పేదలకు ఇళ్లు కట్టించి ఇచ్చాయి. అయితే హక్కులు ఉండేవికావు. ఈ పరిస్థితిని మారుస్తూ  26లక్షల ఇళ్ల స్థలాలను మహిళల పేరిటే రిజిస్టర్‌ చేసే కార్యక్రమం ఉగాది నాడు ప్రారంభం కాబోతుంది. ఇది కూడా దేశంలోనే మొదటిసారి. తర్వాత ఆ స్థలంలో ఇంటిని కూడా కడతారు. ఆ ఇంటిపై పావలా వడ్డీకే రుణాలు ఇచ్చే ఏర్పాటు జరగబోతోంది. ఐదేళ్ల తర్వాత ఆ ఇంటిని అవసరమైతే అమ్ముకోవడానికి వీలుగా ఏర్పాట్లు చేశారు.

మహిళల రక్షణ కోసం దేశంలోనే మొదటిసారిగా దిశ చట్టాన్ని కూడా తీసుకొచ్చారు. తద్వారా మృగాళ్ల ఆట కట్టించారు. ఎంతటి సమస్యల్లో ఉన్నా 10 నిమిషాల్లోపే పోలీసులు స్పందించేలా ఒక యాప్‌ను రూపొందించారు. దీన్ని పకడ్బందీగా అమలు చేసేలా ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేశారు. మహిళా పోలీసు స్టేషన్లు, ప్రత్యేక కోర్టులు, నిందితులకు త్వరగా శిక్ష పడేందుకు ఉపకరించే ఫోరెన్సిక్‌ ల్యాబ్‌లు.. ఇలా ఎన్నో ఏర్పాటు చేస్తున్నారు.

పైన చెప్పిన విషయాలన్నీ మహిళల పట్ల జగన్‌కు ఉన్న గౌరవాన్ని తెలియజేస్తాయి. మహిళల అభివృద్ధి పట్ల ఆయనకున్న చిత్తశుద్దిని చూపిస్తాయి. మహిళల ఆత్మగౌరవంపై జగన్‌కు ఉన్న బాధ్యతను తెలుపుతాయి. ఇవే కార్యక్రమాలు రాబోయే కాలంలోనే కొనసాగిస్తే మహిళా సమాజంలో జగన్‌ ఖ్యాతి చిరస్థాయికి నిలిచిపోతుంది.
idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp