రాజధాని వికేంద్రీకరణ బిల్ కు గవర్నర్ ఆమోదం- అందరి దృష్టి విశాఖ వైపే...

By Raju VS Jul. 31, 2020, 04:57 pm IST
రాజధాని వికేంద్రీకరణ బిల్ కు గవర్నర్ ఆమోదం- అందరి దృష్టి విశాఖ వైపే...

దేశ రాజకీయాల్లోనే కీలక మలుపులకు ఆంధ్రప్రదేశ్ కేంద్రంగా మారుతోంది. ప్రయోగాత్మకంగా పాలనా పద్ధతులకు ఇక్కడే శ్రీకారం పడుతోంది. ఇప్పటికే గ్రామీణ సచివాలయాలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఇప్పుడు రాష్ట్రస్థాయిలో కూడా పాలన వికేంద్రీకరణకు మరో అడుగు పడింది.

కీలకమైన బిల్లులకు ఆమోదం దక్కింది వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు బిల్లులకు గవర్నర్‌ ఆమోదం

ఆంధ్రప్రదేశ్ పాలనా వికేంద్రీకరణ బిల్లుతో పాటు , సీఆర్డీయే రద్దు బిల్లు కూడా ఆమోదం పొందింది. శాసన ప్రక్రియ పూర్తి చేసుకుని చట్టంగా మారింది. గవర్నర్ ఆమోద ముద్ర వేయడంతో ఇక విశాఖ కార్యనిర్వాహక రాజధానిగానూ, కర్నూలు న్యాయ రాజధానిగానూ మారబోతున్నాయి. అమరావతి యధావిదిగా శాసన రాజధానిగా ఉంటుంది. దాంతో ఇప్పుడు అందరి దృష్టి విశాఖ నగరం వైపు పడుతోంది. సాగర నగరం మరో దశకు చేరబోతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్ర స్థానం కాబోతోంది.

ఏపీలో పాలనా సంస్కరణలకు జగన్ చేస్తున్న ప్రయత్నాలు దేశమంతటినీ ఆకర్షిస్తున్నాయి. అనేక మంది అనుసరించేలా చేస్తున్నాయి. ఇప్పటికే ఉత్తరాఖండ్ కూడా రెండు రాజధానులను ఏర్పాటు చేసుకుంటోంది. జార్ఖండ్ అయితే ఏకంగా నాలుగు రాజధానుల ఆలోచనను ఆచరణలోకి తీసుకొస్తామని చెబుతోంది. అదే సమయంలో ఏపీలో మాత్రం రాజధానుల వికేంద్రీకరణకు కీలక దశ పూర్తికావడంతో ఇక వ్యవహారం ఏపీ ప్రభుత్వం చేతుల్లోకి వచ్చింది. జగన్ దానికి సంబంధించిన ముహూర్తం ఎప్పుడు పెడతారన్నదే ప్రశ్నగా ఉంది. అదే సమయంలో విపక్షం కూడా న్యాయపరమైన అడ్డంకులు కొనసాగించే అవకాశం ఉంది. కానీ కీలక దశలన్నీ దాటిన చట్టాన్ని సంపూర్ణంగా మార్చేసే అవకాశం స్వల్పమేనన్నది న్యాయ నిపుణుల అభిప్రాయం. దాంతో ఇక రాజధానుల వివాదంలో పెద్ద మలుపులు ఉండకపోవచ్చని భావిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ లో కూడా దక్షిణాఫ్రికా తరహాలో మూడు రాజధానుల అవసరం ఉందని డిసెంబర్ లో జరిగిన శీతాకాలం అసెంబ్లీ సమావేశాల సందర్భంగా జగన్ అసెంబ్లీ ప్రస్తావించారు. ఆ సమావేశాల ముగింపులో ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనం అయ్యాయి. ఆ వెంటనే జీఎన్ రావు కమిటీ రిపోర్ట్ రావడం, బోస్టన్ కమిటీ రిపోర్ట్ ఆధారంగా పాలనా వికేంద్రీకరణ బిల్లుతో పాటుగా సీఆర్డీయే రద్దు బిల్లు కూడా సిద్ధం అయ్యింది. జనవరిలో మూడు రోజుల పాటు ప్రత్యేక సమావేశాలు నిర్వహించి ఆ బిల్లుల ఆమోదానికి ప్రభుత్వం ప్రయత్నాలు చేసింది. అసెంబ్లీలో సునాయాసంగా బిల్లు ఆమోదించుకుని మండలిలో అడుగుపెట్టిన ప్రభుత్వానికి అనుకోని పరిణామం ఎదురయ్యింది. అప్పట్లో చంద్రబాబు స్వయంగా మండలి గ్యాలరీ నుంచి డైరెక్షన్ ఇవ్వడంతో విచక్షణాధికారం ఉపయోగించిన చైర్మన్ బిల్లు ఆమోదాన్ని అడ్డుకున్నారు. సెలక్ట్ కమిటీకి పంపిస్తున్నట్టు ప్రకటించారు. దాంతో పాలకపక్షం ఖంగుతినాల్సి వచ్చింది. ఆ వెంటనే మండలి రద్దుకి అసెంబ్లీలో తీర్మానం చేసి ఏకంగా కేంద్రానికి పంపించాలని నిర్ణయించి , అమలు చేసింది.

ఆ తర్వాత అమరావతి పరిరక్షణ పేరుతో చంద్రబాబు అనుచరులు కొందరు ఉద్యమించడం, బీజేపీలో నాటి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ సహా కొందరు మాజీ టీడీపీ నేతలు దానికి మద్ధతుగా నిలిచారు. వాటికితోడుగా న్యాయపరమైన ఆటంకాలతో రాజధాని వ్యవహారం ఊగిసలాటలో పడింది. పదే పదే కోర్టు కేసులతో ఏపీ ప్రభుత్వం చివరకు స్పష్టతనిస్తూ శాసన ప్రక్రియ పూర్తి చేసిన తర్వాతే రాజధాని విషయంలో తుది నిర్ణయం తీసుకుంటామని తేల్చేసింది. అయితే సెలక్ట్ కమిటీకి పంపిస్తున్నట్టు మండలి చైర్మన్ చేసిన ప్రకటనను కార్యదర్శి తోసిపుచ్చారు. సెలక్ట్ కమిటీకి బిల్లుని పంపించాలంటే దానికి ముందుగా జరగాల్సిన ప్రక్రియ ఏదీ జరగనందున అలాంటి అవకాశం లేదని తేల్చేశారు. అంతేగాకుండా వైఎస్సార్సీపీ మాత్రం తన సభ్యుల లిస్టును సెలక్ట్ కమిటీకి పంపించేందుకు సిద్ధం కాలేదు. దాంతో మండలి చైర్మన్ చేసిన ప్రయత్నం ఫలించలేదనే చెప్పవచ్చు. దాని మీద టీడీపీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి వంటి వారు కోర్టుని ఆశ్రయించారు. కానీ నిబంధనల ప్రకారం జరగకపోవడంతో కోర్టులో కూడా దానికి సంబంధించిన సానుకూల తీర్పు వెలువడే అవకాశం లేదనే వాదన బలంగా ఉంది.

చివరకు వాగ్యుద్దాలు, సవాళ్లు, ప్రతిసవాళ్ల అనంతరం గత బడ్జెట్ సమావేశాల సందర్బంగా మరోసారి ఈ రెండు బిల్లులు అసెంబ్లీలో రెండోసారి ఆమోదంతో మండలిలో చర్చకు సిద్దం అయ్యాయి. కానీ దానికి కూడా అవకాశం ఇవ్వకుండా టీడీపీ సభ్యులు అడ్డుపడడంతో కీలక బిల్లుల ఆమోదం లేకుండానే సభ నిరవధికంగా వాయిదా పడింది. అయితే నిబంధనల ప్రకారం రెండోసారి అసెంబ్లీ ఆమోదంతో మండలికి వచ్చిన బిల్లుని ఆమోదించకపోతే మనీ బిల్లు 14 రోజుల్లో, ద్రవ్యేతర బిల్లు 30 రోజుల్లో ఆమోదం పొందినట్టేనని రూల్ బుక్ చెబుతోంది. దానిని ఉపయోగించుకుని ద్రవ్యవినిమయ బిల్లుని కూడా ఆ రీతిలోనే ఆమోదం దక్కించుకున్న జగన్ ప్రభుత్వం ఈనెల 18వ తేదీన గవర్నర్ కి రెండు బిల్లులను పంపించారు. సుమారు 13 రోజుల పాటు వివిధ వర్గాల అభిప్రాయాలను తీసుకున్న గవర్నర్ చివరకు ఆమోదం తెలపడంతో చట్టంగా రూపాంతరం చెందాయి. రాజధానికి సంబంధించిన చట్టాన్ని కూడా సవాల్ చేయాలని విపక్షం భావిస్తోంది. కానీ దానికి ఎంతవరకూ సానుకూలత వస్తుందన్నది సందేహమే.

విశాఖ వైపు అందరి దృష్టి
సీఎం ప్రకటన చేసిన నాటి నుంచే విశాఖలో పలు మార్పులు జరుగుతున్నాయి. అభివృద్ధి పథకాలకు శ్రీకారం చుడుతున్నాయి. ఇప్పటికే రోడ్ల విస్తరణ సహా వివిధ కార్యక్రమాలు సాగుతున్నాయి. త్వరలో ఈ వ్యవహారం వేగవంతంగా చేపట్టే అవకాశం ఉంది. భోగాపురం ఎయిర్ పోర్ట్ ని కూడా మూడేళ్లలో పూర్తి చేయాలనే లక్ష్యంతో సాగుతున్నారు. ఇక సీఎంవో, సచివాలయం వంటి భవనాల ఎంపిక పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ వ్యవహారాలన్నీ రాబోయే కొద్ది నెలల్లోనే పూర్తి చేయాలని ప్రభుత్వం సంకల్పిస్తోంది. దానికి అనుగుణంగా అడుగులు వేస్తోంది. దేశంలోనే అభివృద్ధి చెందిన టాప్ 10 నగరాల్లో ఒకటిగా విశాఖకు అవకాశం మరింత మెరుగుపడుతుందని చెబుతున్నారు. కొత్తగా పలు పరిశ్రమలు, ఇతర పథకాలు తెరమీదకు వస్తే సాగరనగరం మరింత సుందరనగరంగా మారడం ఖాయం.

కర్నూలుకి సంబంధించిన హైకోర్ట్ తరలింపు విషయంలో రాష్ట్రపతి నుంచి అనుమతి తీసుకోవాలసి ఉంటుంది. రాష్ట్రపతి ఆమోదముద్ర రాగానే హైకోర్ట్ కర్నూలుకి తరలించడం ద్వారా అటు ఉత్తరాంధ్ర, ఇటు రాయలసీమ కు ప్రాధాన్యతనిచ్చినట్టవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. తద్వారా అన్ని ప్రాంతాలను సమానాభివృద్ధికి అవకాశం దక్కుతుందని చెబుతోంది. ఈ మార్పులతో ఏపీలో పాలన కొత్త పుంతలు తొక్కడం ఖాయం. పలుమార్పులకు కేంద్రంగా ఉన్న ఈరెండు బిల్లులు ఇప్పుడు చట్టాలుగా మారిన తరుణంలో ప్రభుత్వం తన లక్ష్యాలకు అనుగుణంగా ముందుకెళ్ళే ఆలోచనలో ఉన్నట్టు కనిపిస్తోంది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp