మహిళలకు మరింత మేలు చేసే బడ్జెట్ దిశలో జగన్...

By Raju VS Jan. 17, 2021, 09:10 am IST
మహిళలకు మరింత మేలు చేసే బడ్జెట్ దిశలో జగన్...

అనేక ఆటంకాలు, అవస్థలతో సాగిన ఆర్థిక సంవత్సరం ముగింపు దశకు వచ్చింది. దేశ జీడీపీలోనే ఎన్నడూ లేనంత క్షీణ దశను ఈ కాలంలో చూడాల్సి వచ్చింది. కరోనా మూలంగా అమలు చేసిన లాక్ డౌన్ ఫలితం ప్రపంచాన్నే కుదేపిసింది. అయినప్పటికీ ఏపీలో ప్రభుత్వం చొరవతో వ్యవహరించి సమస్య నుంచి గట్టెక్కే యత్నం చేసింది. ప్రజల కొనుగోలు శక్తి పడిపోకుండా ప్రయత్నాలు చేసింది. అనేక మంది ఆర్థిక వేత్తలు అభిప్రాయపడినట్టుగా ప్రభుత్వ వ్యయంలో రాజీలేకుండా వ్యవహరించింది. దాని ఫలితంగా ఏపీలో అభివృద్ధి, సంక్షేమం లోటు లేకుండా సాగాయి.

అయితే రాబోయే ఆర్థిక సంవత్సరం ఆశాజనకంగా ఉంటుందనే అంచనాలు వినిపిస్తున్నాయి. ఇప్పుడిప్పుడే మళ్లీ గాడిన పడుతున్న ఆర్థిక పరిస్థితులతో రాబోయే ఏడాది కాలంలో ప్రభుత్వానికి రాబడి పెరుగుతుందని భావిస్తున్నారు. ఈ ఏడాది కేంద్రం నుంచి రావాల్సిన జీఎస్టీ బకాయిలు కూడా సకాలంలో రాలేదు. పైగా రాష్ట్ర ప్రభుత్వ ఆదాయానికి గండి పడింది. అయినప్పటికీ ఏపీలో ప్రభుత్వం చొరవ చూపడంతో అనేక సమస్యలను ఎదుర్కొంటూనే ముందుకు సాగాల్సి వచ్చింది. ఇక రాబోయే బడ్జెట్ లో మహిళలకు పెద్ద పీట వేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దానికి అనుగుణంగా అన్ని శాఖల అధికారులకు మార్గదర్శకాలు జారీ చేశారు. సాధారణంగా ప్రతి బడ్జెట్‌లోనూ మహిళలకు, పిల్లల సంక్షేమానికి కొద్ది మేరకు నిధులు కేటాయించడం ఆనవాయితీ. ఈసారి దానికి భిన్నంగా ప్రత్యేకంగా కేటాయింపులు చేస్తూ వారి అభివృద్దికి ప్రభుత్వం పూర్తి అండదండలు అందించే సంకల్పంతో ఉంది.

ప్రతి పథకంలోనూ మహిళలు, పిల్లల లబ్దిదారులకు ప్రాధాన్యతనిచ్చేలా ప్రయత్నం చేస్తున్నారు. వారికి అనుకూలంగా ప్రతీ పథకంలోనూ మూడో వంతు కేటాయింపులు చేయబోతున్నారు. దానికి తగ్గట్టుగా ఛైల్డ్‌ బడ్జెట్‌ పేరుతో నిధులు కేటాయించాలని నిర్ణయించారు. ఛైల్డ్‌ బడ్జెట్‌ స్టేట్‌మెంట్‌ (సిబిఎస్‌)ను కూడా సిద్ధం చేస్తున్నరు. తొలిసారిగా ఇలాంటి ప్రయత్నం జరుగుతున్న తరుణంలో 18 ఏళ్ల లోపు పిల్లలకు నిధులు పెద్ద మొత్తంలో కేటాయించే అవకాశం ఉంది. అదే సమయంలో మహిళలకు అదనపు ప్రయోజనం దక్కబోతోంది. దానికి తగ్గట్టుగా అవసరమైన నిధుల విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించాలని వివిధ శాఖలను ఆర్థిక మంత్రిత్వ శాఖ కోరింది.

కోవిడ్ మూలంగా పడిపోయిన ఆర్థిక వనరుల నేపథ్యంలో ఈసారి పెద్ద మొత్తంలో అప్పులు చేయాల్సి వచ్చింది. వచ్చే సంవత్సరం ఆర్థిక రాబడులు పెరిగితే ప్రభుత్వానికి ఉపశమనం దక్కుతుంది. కనీసం కేంద్రం కనికరించినా మేలు జరుగుతుంది. ఇటు కేంద్రం ఏపీకి రావాల్సిన నిధుల చెల్లింపులో జాప్యం చేస్తూ, అటు రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం పడిపోతున్న దశలో వచ్చే బడ్జెట్ ని దానికి అనుగుణంగా రూపొందించబోతున్నారు. ముఖ్యంగా వాస్తవంగా ఏపీలో ఆర్థిక వ్యవహారాలు మళ్లీ పంజుకునే దశలో ఉన్నాయి. దాంతో వనరుల సమీకరణకు కొంత సానుకూలత ఏర్పడుతుందనే భావన మొదలయ్యింది. మరి ఆర్థిక మంత్రి బడ్జెట్ కసరత్తుల్లో వాటి ప్రభావం ఏమేరకు ఉంటుందన్నది ఆసక్తికరమే.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp