ఏపిలో గిరిపుత్రులకు ‘పట్టా’భిషేకం

By Jagadish J Rao Jul. 13, 2020, 11:09 am IST
ఏపిలో గిరిపుత్రులకు ‘పట్టా’భిషేకం

ఆంధ్రప్రదేశ్‌లో అక్కరకురాని వారిగా ఉన్న గిరిపుత్రులకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పట్టాభిషేకం జరుగుతుంది. గిరిజన ప్రాంతాల అభివృద్ధిపై సిఎం జగన్ ప్రత్యేక దృష్టి పెట్టారు. ఆయా ప్రాంతాల్లోని ప్రజలు సమస్యల లోగిళ్లులో ఉన్నారు. వారి సమస్యలను, అవసరాలను తీర్చే లక్ష్యంతో ప్రత్యేక ప్రణాళికలను రచించారు. గిరిజనలకు భూమి హక్కును కల్పించేందుకు సిఎం వైఎస్ జగన్ తీవ్రంగా కృషి చేస్తున్నారు.

ఎన్నో ఏళ్లుగా అటవీసాగు హక్కు పత్రాల కోసం ఎదురుచూస్తున్న గిరిజనానికి మరికొద్ది రోజుల్లో మేలు జరగనుంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్ రెడ్డి గిరిజనులకు అటవీ సాగు హక్కు కల్పించాలనే సంకల్పంతో ఉన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో 12 ఏళ్ల క్రితం పంపిణీ జరిగింది.
అనంతరం మళ్లీ ఆయన తనయుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ (రిజర్వ్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ రైట్స్‌) పట్టాల పంపిణీకి చర్యలు తీసుకుంటున్నారు. దీనిలో భాగంగా ఐటిడిఎ పరిధిలో సబ్‌ప్లాన్‌ మండలాల్లో 3,336 ఎకరాల్లో 2 వేల 97మందికి అటవీసాగు హక్కు పత్రాలు అందనున్నాయి. ఈ దిశగా అటవీశాఖ, ఐటీడీఏ కసరత్తు చేస్తోంది. టిడిపి హయాంలో నిర్లక్ష్యానికి గురైన అటవీచట్టానికి ప్రస్తుత ప్రభుత్వం జీవం పోస్తోంది.

అటవీప్రాంతంలో సాగు చేసే గిరిజన రైతులకు సాగు హక్కు పత్రాలు ఇచ్చి వారికి అన్ని రకాల హక్కులు కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం 2006లో అటవీ హక్కుల చట్టాన్ని ప్రవేశపెట్టింది. 2005కు ముందు సాగు హక్కులో ఉన్న వారందరికీ పట్టాలు ఇవ్వాల్సి ఉంది. దీని ప్రకారం గతంలో రెండుసార్లు పట్టాలు ఇచ్చినప్పటికీ పూర్తిస్థాయిలో అందరికీ న్యాయం జరగలేదనే ఆరోపణలున్నాయి. టిడిపి ప్రభుత్వం అటవీ హక్కుల చట్టాన్ని నీరు గార్చిందనే ఆరోపణలున్నాయి.

ఒక్క శ్రీకాకుళంలోనే ఐటిడిఎ పరిధిలో 20 సబ్‌ప్లాన్‌ మండలాలున్నాయి. వీటి పరిధిలో 301 గ్రామ పంచాయతీలుండగా, 1406 గ్రామాలున్నాయి. సుమారు 40 వేలకు పైగా కుటుంబాలు నివసిస్తున్నాయి. కొండపోడు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న కుటుంబాలు దాదాపు 10 వేలు ఉంటాయి. కొంత మందికి సాగు చేసుకోవడానికి పట్టాలు వంటివి లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు.

పూర్తిగా సాగుపై హక్కులు లేకపోవడం, సకాలంలో రుణాలు పొందలేని స్థితిలో ఉన్నారు. అటువంటి వారికి పట్టాలు ఇచ్చి వారిని ఆదుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్ రెడ్డి నిర్ణయించారు. రాష్ట్రవ్యాప్తంగా ఆగస్టు 9న ప్రపంచ ఆదివాసీ దినోత్సవం రోజున సాగుహక్కు పత్రాలు ఇవ్వనున్నారు. పట్టాల తయారీ వంటివాటిపై ఇప్పటికే ఐటిడిఎలో కసరత్తు జరుగుతోంది.

ఈ పట్టాల ద్వారా గిరిజనులు బ్యాంకుల్లో రుణాలు సైతం పొందవచ్చు. తద్వారా పంటలు పండించుకోడానికి అవకాశమేర్పడుతుంది. పోడు వ్యవసాయం వల్ల అడవులు దెబ్బతింటున్నాయని అటవీ శాఖ ఎప్పుడు పడితే అప్పుడు అడ్డుకుంటోంది. అడవిని నమ్ముకుని బతికే గిరిజన రైతులకు ఆర్‌వోఎఫ్‌ఆర్‌ చట్టం కింద పట్టాలు ఇవ్వడంతో పోడు వ్యవసాయానికి ఇక అడ్డంకులు ఉండవు. హక్కు పత్రాలు ఉంటే అటవీ అధికారుల నుంచి ఇబ్బందులు కూడా ఉండవు.

గతంలో ఏనుగులు వంటివి పంటలను నష్టపరిస్తే పరిహారం వచ్చేది కాదు. పట్టా చేతికి వస్తే పరిహారం కూడా వస్తుంది. మండలాల వారీగా అటవీసాగు హక్కు పత్రాలు ఇవ్వడానికి ఇప్పటికే జాబితా సిద్ధమైంది. కొత్తగా ఎవరైనా దరఖాస్తులు ఇస్తే వాటిని కూడా స్వీకరిస్తున్నారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp