కరోనాపై పోరు.. రోజుకు ఏపీ ప్రభుత్వం పెడుతున్న ఖర్చు ఎంతో తెలుసా..?

By Kotireddy Palukuri Jul. 24, 2020, 07:44 pm IST
కరోనాపై పోరు.. రోజుకు ఏపీ ప్రభుత్వం పెడుతున్న ఖర్చు ఎంతో తెలుసా..?

కరోనా వైరస్‌ కట్టడిపై ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం అవలంభిస్తున్న విధానాలు, తీసుకుంటున్న చర్యలపై దేశ వ్యాప్తంగా ప్రశంసలు వస్తున్నాయి. ఈ విషయంలో ప్రతిపక్ష పార్టీల నేతలు కూడా రాష్ట్ర ప్రభుత్వ పనితీరును కొనియాడకుండా ఉండలేని పరిస్థితి. కరోనా వైరస్‌ కట్టడికి పరీక్షలు చేయడం, బాధితులకు మెరుగైన చికిత్స అందించడమే ఇక్కడ ఎంతో ముఖ్యం. ముఖ్యంగా ఐసోలేషన్‌లో ఉన్న సమయంలో పౌష్టికాహారం అందించడం ద్వారా బాధితులు వేగంగా కోలుకుంటున్నారు. కరోనా వల్ల రాష్ట్ర ప్రజలు ఎవరూ ఇబ్బంది పడకూదనే లక్ష్యంతో జగన్‌ సర్కార్‌ ఆది నుంచి కీలకంగా పని చేస్తోంది. ప్రభుత్వ ఆధీనంలోనే కరోనా పరీక్షలు చేసేందుకు అవసరమైన ల్యాబులను యుద్ధ ప్రాతిపదికన సిద్ధం చేసింది. ప్రతి జిల్లాలో పదుల సంఖ్యలో కోవిడ్‌ ఆస్పత్రులను ఏర్పాటు చేసింది. క్వారంటైన్‌ కేంద్రాలను రాష్ట్రం నలుమూలలా అందుబాటులోకి తెచ్చింది.

ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 134 క్రిటికల్‌ కేర్‌ ఆస్పత్రులు అందుబాటులో ఉన్నాయి. ప్రతి జిల్లాకు ఒక వైరాలజీ ల్యాబ్‌ ఉంది. ఇక మొబైల్‌ వాహనాల ద్వారా శాంపిళ్లను సేకరిస్తున్నారు. ఇప్పటి వరకూ ఏపీలో 14.93 లక్షల మందికి కరోనా నిర్థారణ పరీక్షలు చేశారు. 72,711 మందికి వైరస్ సోకింది. ఇందులో ఇప్పటికే 37,555 మంది కోలుకుని ఇళ్లకు వెళ్లారు. మహమ్మారికి 884 మంది బలయ్యారు. మిగతావారు చికిత్సలో ఉన్నారు. కరోనాకు సంబంధించిన పరీక్షలు, వైద్యం, క్వారంటైన్‌... అన్ని కూడా ప్రభుత్వమే ప్రజలకు ఉచితంగా అందిస్తోంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇందు కోసం రోజుకు ఎంత ఖర్చు పెడుతుందో తెలిస్తే.. ప్రజా సంక్షేమం పట్ల జగన్‌ సర్కార్‌ ఎంత చిత్తశుద్ధితో వ్యవహరిస్తుందో తెలుస్తోంది. పరీక్షలు, క్వారంటైన్‌ కేంద్రాల్లో బాధితులకు భోజనం, ఇతర సౌకర్యాలకు జగన్‌ సర్కార్‌ రోజుకు 6.50 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది. అంటే నెలకు దాదాపు 200 కోట్ల రూపాయలు పరీక్షలు, బాధితులకు చికిత్సకు వైసీపీ సర్కార్‌ వెచ్చిస్తోంది.

పక్క సరిహద్దు రాష్ట్రాల్లో మాకు పరీక్షలు చేయండి అంటే లక్షణాలు ఉన్నాయా..? అంటూ రకరకాల కొర్రీలు వేస్తూ పరీక్ష చేసేందుకు నిరాకరిస్తుండగా.. ఏపీలో మాత్రం అడిగిన ప్రతి ఒక్కరికీ ఉచితంగా పరీక్ష చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 54 సంజీవని బస్సుల ద్వారా కరోనా అధికంగా ఉన్న ప్రాంతాల్లో పరీక్షలకు శాంపిల్స్‌ సేకరిస్తున్నారు. ఫలితాల సమాచారం వారి మొబైల్‌ నంబర్లకే చేరవేస్తున్నారు. పాజిటివ్‌ వస్తే అంబులెన్స్‌లలో ఆస్పత్రులకు తరలిస్తున్నారు. ఐసోలేషన్‌లో ఉన్న రోజుల్లో ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి మంచి పౌష్టికాహారం, డ్రైప్రూట్స్, పండ్లు అందిస్తున్నారు.

ఇవి కాకుండా రాబోయే ఆరు నెలల్లో కరోనాను మరింత సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు జగన్‌ సర్కార్‌ ఇప్పటి నుంచే సిద్ధం అవుతోంది. దాదాపు 9 వేల పైచిలుకు డాక్టర్లు, ఆరోగ్య సిబ్బందిని నియమించాలని ఇప్పటికే నిర్ణయించింది. క్రిటికల్ కేర్ ఆస్పత్రుల్లో అదనంగా మరో 2,380 బెడ్లు సిద్ధం చేస్తున్నారు. మొత్తం మీద రాబోవు ఆరు నెలల్లో కరోనా కట్టడికి అవసరమైన మౌలిక సదుపాయాల కోసం వెయి కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నట్లు ఈ రోజు శుక్రవారం నిర్వహించిన సమీక్షలో సీఎం జగన్‌ వెల్లడించారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp