నష్టంలోనే కాదు.. కష్టం లోనూ తోడుగా..

By Kotireddy Palukuri Oct. 18, 2020, 03:00 pm IST
నష్టంలోనే కాదు.. కష్టం లోనూ తోడుగా..

రైతే రాజు అనే నానుడిని నిజం చేసేందుకు ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి సర్కార్‌ పని చేస్తోంది. వైఎస్సార్‌ రైతు భరోసా కేంద్రాల ద్వారా అన్నదాతకు విత్తనం నుంచి పంట అమ్ముకునే వరకు అండగా ఉంటోంది. ప్రతి పంటకు భీమా చేయిస్తోంది. ఫలితంగా వరదలు, ఇతర విపత్తుల సమయంలో పంట నష్టపోయిన రైతన్నలకు పరిహారం లభించే పరిస్థితులు నెలకొన్నాయి. అల్పపీడనాలు, వాయుగుండాలు తరచూ ఏర్పడడంతో ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. వరదల కారణంగా పలు పంటలు దెబ్బతిన్నాయి. నష్టం అంచనాకు ప్రభుత్వం ఇప్పటికే ఉపక్రమించింది. త్వరలో పరిహారం కూడా అందించనుంది.

మరో వైపు వరదలు, నీరు నిల్వ ఉండడం వల్ల పలు ఉద్యానవన పంటలు దెబ్బతినే అవకాశం ఉంది. దీంతో నీరు తగ్గిన తర్వాత ఆయా ఉద్యాన వన పంటలను ఎలా రక్షించుకోవాలన్నది ప్రభుత్వం అన్నదాతలకు సూచనలు ఇస్తోంది. రైతు భరోసా కేంద్రాల వల్ల ప్రభుత్వం ఏదైనా సమాచారం సేకరించాలన్నా.. రైతులకు సమాచారం చేరవేయాలన్న వేగంగా, సులువుగా జరుగుతోంది. సోషల్‌ మీడియాను కూడా ఉపయోగించుకుంటుండడంతో అన్నదాతలకు మెరుగైన సేవలను జగన్‌ సర్కార్‌ అందిస్తోంది. ఉద్యానవన పంటలను ఎలా కాపాడుకోవాలో రైతు భరోసా కేంద్రాల ద్వారా అన్నదాలకు సమాచారం చేరవేస్తోంది.

మిరప:

- అధిక తేమ వలన పడిపోయిన మొక్కల మొదళ్ళకు మ*ట్టిని ఎగదోసి నిలబెట్టాలి.

- కొద్దిగా పొలం ఆరిన తర్వాత ఎకరాకు 30 కిలోల యూరియా మరియు 15 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఎరువులను మొక్కకు 4-5 అంగుళాల దూరంలో వేయాలి.

- లీటరు నీటికి 10 గ్రా. పొటాషియం నైట్రేట్ ను కలుపుకొని 5 నుంచి 7 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారి చేయాలి.

- మొక్కల మొదళ్ళ వద్ద నీరు నిలబడడం వలన వేరుకుళ్ళు రోగం వచ్చే అవకాశం ఉన్నందున లీటరు నీటికి 3 గ్రా కాపర్ ఆక్సీక్లోరైడ్ లేదా 2 గ్రా కార్బండజిమ్ మందును కలుపుకొని మొక్కల మొదళ్ళ దగ్గర వేరు భాగం బాగా తడిచేటట్లు నేలను తడపాలి.

- అధికంగా కురిసిన వర్షాల వలన మిరపలో కొమ్మ ఎండు మరియు కాయకుళ్ళు రోగం వచ్చే అవకాశం ఉంది. కావున లీటరు నీటికి 2.5 గ్రా మాంకోజబ్ (లేదా) 2.0 మి.లీ. హెక్సాకోనజోల్ మందు కలిపిన ద్రావణాన్ని మొక్కలపై పిచికారి చేయాలి.

- మిరప మొక్కలపై పై ముడత మరియు క్రింది ముడత ఆశించినట్లైతే లీటరు నీటికి 0.25 మి.లీ. స్పైనోసాడ్ లేదా 2.0 మి.లీ. క్లోర్ ఫినాపైర్ మందును కలుపుకొని మొక్కలు బాగా తడిచేటట్లు పిచికారి చేయడం ద్వారా పై ముడత మరియు క్రింది ముడత చీడలను సమర్ధవంతంగా అరికట్టవచ్చును.

పసుపు :

- పొలం నుంచి నిలువ నీటిని మురుగు కాలువల ద్వారా తోడి వేయాలి.

- అధికంగా నీరు నిలువ ఉన్న ప్రాంతాలలో దుంపకుళ్ళు రోగం ప్రభలే అవకాశం కలదు. దుంపకుళ్ళు రోగాన్ని నివారించడానికి గాను లీటరు నీటికి 3 గ్రా కాపర్ ఆక్సీక్లోరైడ్ మందు కలిపిన ద్రావణాన్ని దుంపకుళ్ళు వ్యాధి సోకిన మొక్క మొదలు భాగం బాగా తడిచేటట్లు నేలను తడపాలి. అలాగే ఎకరా పొలానికి 200 కిలోల వేప చెక్కను పొలంలో వేయడం ద్వారా దుంప కుళ్ళు వ్యాధి ఉధృతుని అరికట్టవచ్చును.

- ముంపుకు గురైన ప్రాంతాలలో నత్రజని మరియు ఇనుప ధాతులోపం ఎక్కువగా కనిపిస్తుంది. వీటి నివారణ కొరకు ఎకరానికి 30 కిలోల యూరియా మరియు 15 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ను అదనంగా వేయాలి. ఇనుపధాతు లోప నివారణ కొరకు లీటరు నీటికి 5 గ్రా అన్నభేది మరియు 1 గ్రా నిమ్మ ఉప్పు కలిపి మొక్కoతా బాగా తడిచేలా పిచికారి చేయాలి.

- పసుపు మొక్కలపై ఆకు మచ్చ తెగులు ఆశించినట్లైతే లీటరు నీటికి 1 మి.లీ. ప్రొపికోనజోల్ లేదా 1 గ్రా ట్రైఫ్లాక్సీస్ట్రోబిన్ + టెబ్యుకోనజోల్ మందులను మార్చి మార్చి 15 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారి చేయాలి.

కూరగాయలు :

- పొలంలో నిల్వ నీటిని మురుగు కాలువల ద్వారా తోడివేయాలి. అనంతరం ఎకరానికి 20 కిలోల యూరియా మరియు 10 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఎరువులను వేయాలి.

- లీటరు నీటికి 10 గ్రా పొటాషియం నైట్రేట్ (13-0-45) ను వారం రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారి చేయాలి.

- వేరు కుళ్ళు వ్యాధి సోకకుండా లీటరు నీటికి 3 గ్రా చొప్పున కాపర్ ఆక్సీక్లోరైడ్ ను మొక్క మొదలు చుట్టూ పోయాలి.

- అధిక వర్షాల వలన భూమిలోనున్న అధిక తేమ వలన నేలను తాకిన కాయలు ముఖ్యంగా టమాటా పంటలో కుళ్ళి పోతాయి. కావున మొక్కలకు ఊతం ఏర్పాటు చేయాలి.

- ఆకులు, కాయలపై శిలీంధ్రపు మచ్చ తెగుళ్ళు ఆశించినప్పుడు లీటరు నీటికి 2 గ్రా కాప్టాన్ లేదా 2.5 గ్రా మాంకోజబ్ మందులను వారం రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారి చేయాలి.

అరటి :

- పొలంలో నిలిచిన నీటిని మురుగు నీటి పారుదల వ్యవస్థ ద్వారా తొలగించాలి.

- పై పాటుగా ఒక్కో మొక్కకు 100 గ్రా యూరియా మరియు 80 గ్రా మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఎరువులను అదనంగా అందించాలి.
- అధిక వర్షాల వలన అరటిలో సిగటోక ఆకుమచ్చ తెగులు ఆశించే అవకాశం కలదు. కావున లీటరు నీటికి 1 మి.లీ. ప్రోపికోనజోల్ లేదా 1 మి.లీ. ట్రైడిమార్ఫ్ మందులను 21 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారి చేయాలి.

- పూర్తిగా పక్వానికి రాని గెలలు ఉన్నప్పుడు మొక్కలపై పైపాటుగా లీటరు నీటికి 10 గ్రా పొటాషియం నైట్రేట్ కలుపుకొని 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారి చేయాలి.

- పూర్తిగా విరిగి పడిపోయిన అరటి చెట్లను గుర్తించి వాటిని కత్తిరించి 2 ఆరోగ్యవంతమైన పిలకలను వదిలి వేయాలి. ఈ పిలకలకు పైపాటుగా ఒక్కో మొక్కకు 100 గ్రా యూరియా మరియు 80 గ్రా మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఎరువులను ప్రతి నెల రోజులకొకసారి చొప్పున నాలుగు నెలల పాటు పిలకలకు అందించాలి.

కొబ్బరి :

- అధిక వర్షాల వలన మొవ్వకుళ్ళు ఆశించినట్లైతే మొవ్వ భాగాన్ని పూర్తిగా శుభ్ర పరిచి చుట్టూ ఉన్న పీచు భాగాన్ని తొలగించి లీటరు నీటికి 3 గ్రా చొప్పున కాపర్ ఆక్సీక్లోరైడ్ మందు ద్రావణాన్ని మొవ్వలోనికి ఇంకునట్లు పోయాలి. అవసరాన్ని బట్టి 10 రోజుల వ్యవధిలో మరొకసారి మొవ్వను మందు ద్రావణంతో శుభ్రం చేయాలి.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp