అటవీశాఖలో అంతే..!

By Voleti Divakar Sep. 19, 2020, 06:30 pm IST
అటవీశాఖలో అంతే..!

ప్రభుత్వశాఖల్లో పెన్షన్ల మంజూరు, కొత్త ఉద్యోగాల నియామకం ఆషా మాషీ వ్యవహారం కాదు. చేతులు తడపాలి, ఉన్నత స్థాయి సిఫార్సులు ఉండాలి. అప్పుడే ప్రభుత్వశాఖలో పనులు త్వరగా జరుగుతాయి. అయితే ఆటవీశాఖలో ఇందుకు విరుద్ధంగా జరగడం విశేషం. అదీ ఒక మృతి చెందిన దళిత ఉద్యోగి కుటుంబానికి సత్వర న్యాయం జరగడం ఆదర్శనీయం.

విజయవాడలోని అటవీశాఖ కార్యాలయంలో టెక్నికల్ ఆఫీసర్ గా పనిచేసే అతాబత్తుల శ్రీనివాసరావు అనారోగ్యంతో ఇటీవలే మరణించారు. ఆయన భార్య యు దుర్గాదేవి కారుణ్య నియామకం కోరుతూ దరఖాస్తు చేసుకున్నారు. ఈ విషయమై వెంటనే మానవత్వంతో స్పందించిన రాష్ట్ర అటవీశాఖ ముఖ్య సంరక్షణాధికారి ఎన్ ప్రతీప్ కుమార్ నెలరోజుల్లోనే ఆమెకు కారుణ్య నియామక పత్రాన్ని అందించి, మిగిలిన ప్రభుత్వశాఖలకు అటవీశాఖను ఆదర్శంగా నిలిపారు.

విజయవాడలో దుర్గాదేవికి తగిన పోస్టు లేకపోవడంతో రాజమహేంద్రవరం సర్కిల్ లో ఆమెకు జూనియర్ అసిస్టెంట్ గా నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఆమె నియామకం విషయంలో రాజమహేంద్రవరం అటవీశాఖ సంరక్షణాధికారి ఎన్ నాగేశ్వరరావు వేగంగా స్పందించి, వారంరోజుల్లోనే పరిశీలన, ఇతర తంతులను పూర్తి చేయడం విశేషం.

అటవీశాఖలో ఉద్యోగులకు సత్వర న్యాయం చేసేందుకు కృషిచేస్తామని ప్రతీప్ కుమార్ హామీ ఇచ్చారు. ప్రభుత్వ లక్ష్యాలు, ప్రజల కోసం శ్రమించే ఉద్యోగుల సంక్షేమమే తమ ధ్యేయమన్నారు. ఇలాంటి అధికారుల కారణంగానే ప్రభుత్వ ప్రతిష్ట ఇనుమడిస్తుంది.

గత జూలైలో పదవీ విరమణ చేసిన రోజునే పెన్షన్ మంజూరు పత్రాలు జారీ చేసిన ఆటవీశాఖ తాజాగా నెలరోజుల్లోనే కారుణ్య నియామకాన్ని పూర్తి చేసి అన్ని
ప్రభుత్వశాఖలకు ఆదర్శంగా నిలుస్తోంది. దళితులపై దాడులు జరుగుతున్నాయంటూ నిరంతరం ప్రభుత్వంపై రాద్ధాంతం చేసే తెలుగుదేశం, ఇతర ప్రతిపక్షాల నాయకులు ఇలాంటి సానుకూల విషయాలను కూడా గుర్తిస్తే మంచిదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp