ఆర్థిక ప్ర‌గ‌తిపై ఏపీ ఫోక‌స్‌..

By Kalyan.S Jul. 10, 2020, 06:29 pm IST
ఆర్థిక ప్ర‌గ‌తిపై ఏపీ ఫోక‌స్‌..

ఓ ప‌క్క‌.. అభివృద్ధి కార్య‌క్ర‌మాలకు నిధుల సమీకరణపై తన క్యాంపు కార్యాలయంలో ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష.. మ‌రో వైపు... రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్‌తో ఏపీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ భేటీ... సంక్షేమ ప‌థ‌కాల‌ను ముందుకు తీసుకెళ్లేందుకు ఆర్థిక వ‌న‌రుల స‌మీక‌ర‌ణ‌పై ఆంధ్ర‌ప్ర‌దేశ్ దృష్టి కేంద్రీక‌రించింద‌న్న విష‌యాన్ని తెలియ‌జేస్తున్నాయి. లాక్ డౌన్ కార‌ణంగా.. ఏప్రిల్, మే, జూన్ నెల‌లో రాష్ట్రానికి 40 శాతానికి పైగా ఆదాయం ప‌డిపోయింది. ఆ లోటును అతి త్వ‌ర‌లో పూడ్చుకునే దిశ‌గా ఏపీ అడుగులు వేస్తోంది.

పెండింగ్ నిధుల‌పై చ‌ర్చ‌..

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్‌తో భేటీ అయిన బుగ్గన రాజేంద్రనాథ్ రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులపై చర్చ జరిపారు. ఈ భేటీలో ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన పలు అంశాలను కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. అలాగే.. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డిని కూడా క‌లిశారు. ఈ చ‌ర్చ‌లో క‌రోనా క‌ట్ట‌డికి ఏపీ ప్ర‌భుత్వం తీసుకుంటున్న చ‌ర్య‌లు చ‌ర్చ‌కు వ‌చ్చిన‌ట్లు తెలిసింది. బుగ్గన వెంట ఏపీ ప్రభుత్వ ప్రధాన సలహాదారు అజేయ్‌ కల్లం, ఆర్థిక శాఖ కార్యదర్శి రావత్‌, నీటిపారుదల శాఖ కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌ ఉన్నారు.

నిధులు కోరాం...

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రితో భేటీ అనంతరం బుగ్గన రాజేంద్రనాథ్‌ మీడియాతో మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు, వెనుకబడిన ప్రాంతాలకు నిధులు, విభజన చట్టంలోని అభివృద్ధి పథకాలకు నిధులు, పీడీఎస్, జీఎస్టీ బకాయిల మంజూరు చేయాలని కేంద్రాన్ని కోరినట్లు తెలిపారు. రాష్ట్రానికి చేయూత ఇచ్చేందుకు అదనంగా నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశామని చెప్పారు. అభివృద్ధికి సంబంధించిన ప్రతి అంశం గురించీ ముఖ్యమంత్రి చెప్పిన విష‌యాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లిన‌ట్లు వివ‌రించారు. పోలవరం త్వరగా పూర్తి చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుగా 3,500 కోట్ల రూపాయలు ఖ‌ర్చు పెట్టి కేంద్రాన్ని రీయంబర్స్‌మెంట్ అడిగామ‌న్నారు. కేంద్రం ఆ నిధుల‌ను విడుద‌ల చేస్తే వాటిని కొత్త ప్రాజెక్టులకు ఉపయోగిస్తామ‌న్నారు. అలాగే జీఎస్టీ బకాయిలు 3500 కోట్లు రావాలని బుగ్గన తెలిపారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp