ఏపీ ఫ్యాక్ట్‌ చెక్‌.. ఫేక్‌న్యూస్‌కు చెక్‌..

By Karthik P Mar. 06, 2021, 08:45 am IST
ఏపీ ఫ్యాక్ట్‌ చెక్‌.. ఫేక్‌న్యూస్‌కు చెక్‌..

ఆంధ్రప్రదేశ్‌లో ప్రింట్, అండ్‌ ఎలక్ట్రానిక్‌ మీడియా సంస్థల్లో సింహభాగం ఏ పార్టీకి అనుకూలంగా పని చేస్తాయో, ఏ పార్టీకి వ్యతిరేకంగా కథనాలు వండి వారుస్తాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కోడిగుడ్డు మీద ఈకలు పీకే మీడియా సంస్థలకు ఏపీలో కొదవేలేదు. పైగా సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి, వైసీపీ ప్రభుత్వం విషయంలో బోడి గుండుకు మోకాలికి ముడి వేసి కథనాలు రాయడంలో ఆరితేరిన మీడియా సంస్థలు ఏపీలో పని చేస్తున్నాయి. తన పట్ల, తన ప్రభుత్వం పట్ల ఆయా మీడియా సంస్థలు ఎలా పని చేస్తాయో సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రోజునే వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి బహిరంగంగా చెప్పారు. దుష్ప్రచారం చేస్తే చర్యలు తప్పవని కూడా హెచ్చరించారు. అయినా ప్రభుత్వంపై, సీఎం వైఎస్‌ జగన్‌పై ఆయా మీడియా సంస్థలు అవకాశాలు సృష్టించుకుని మరీ విష ప్రచారం చేస్తున్నారు.


గడచిన 21 నెలల పాలనలో కియా సంస్థ వెళ్లిపోతోందని, దేవాలయాలపై దాడులు.. ఇలా అనేక దుష్ప్రచారాలను ఏపీ ప్రజలు చూశారు. కాలం గడిచే కొద్దీ వాటిలో నిజానిజాలు ఏమిటో ప్రజలకు అర్థమయింది. అయితే ఆయా మీడియా సంస్థలు అసత్య, అభూత కల్పనలతో వండి వార్చిన కథనాలు, ప్రసారం చేసిన విషయాలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టేలా.. అందులో నిజానిజాలు ఏమిటో ప్రజలకు తెలియజేసేందుకు ఏపీ ప్రభుత్వం నడుంబిగించింది. మీడియాతోపాటు సోషల్‌ మీడియాలో సీఎం వైఎస్‌ జగన్, వైసీపీ సర్కార్‌ పథకాలు, నిర్ణయాలపై జరిగే దుష్ప్రచారానికి చెక్‌ పెట్టేందుకు జగన్‌ సర్కార్‌ ‘ఏపీ ఫ్యాక్ట్‌ చెక్‌’ పేరుతో వెబ్‌సైట్‌ను, ట్విట్టర్‌ ఖాతాను ఏర్పాటు చేసింది. ఆంధ్రప్రదేశ్‌ డిజిటల్‌ కార్పొరేషన్‌ (ఏపీడీసీ) పర్యవేక్షించే ఈ వెబ్‌సైట్, ట్విట్టర్‌ ఖాతాను సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి శుక్రవారం ప్రారంభించారు.

Read Also : అమరావతి.. ఇంకా తేలలేదు

ఏపీ ఫ్యాక్ట్‌ చెక్‌ లక్ష్యం చెప్పిన సీఎం జగన్‌..

వెబ్‌సైట్‌ ప్రారంభ సమయంలో సీఎం వైఎస్‌ జగన్‌ ఏపీ ఫ్యాక్ట్‌ చెక్‌ లక్ష్యం ఏమిటో వివరించారు. మీడియాలో, సోషల్‌ మీడియాలో కొందరు దురుద్దేశపూర్వక ప్రచారం చేస్తున్నారు. ఈ తప్పుడు ప్రచారాన్ని ఏపీ ఫ్యాక్ట్‌ చెక్‌ వేదికగా ప్రభుత్వం ఆధారాలతో ఖండిస్తుంది. జరుగుతున్న ప్రచారం ఏ విధంగా తప్పో సాక్షాధారాలతో చూపిస్తారు. నిజం ఏమిటో, అబద్ధం ఏమిటో ఆధార సహితంగా వివరిస్తారు. ఉద్దేశపూర్వంగా ప్రభుత్వంపై దుష్ప్రచారం చేసే వారిపై అధికారులు చట్ట ప్రచారం చర్యలు తీసుకుంటారు. తప్పుడు ప్రచారం ఎక్కడ మోదలైందో, ఎవరు దీనికి కారకులో పోలీసులు గుర్తిస్తారు. వారిపై చట్ట ప్రకారం కేసులు నమోదు చేస్తారు. న్యాయస్థానాల్లో దోషులుగా నిలబెడతారు.

‘‘ ఒక వ్యక్తి ప్రతిష్టను, ఒక వ్యవస్థ ప్రతిష్టను ఉద్దేశపూర్వంగా దెబ్బతీసే హక్కు ఏ ఒక్కరికీ లేదు. వ్యక్తిగత ఉద్దేశాలతో వ్యవస్థలను భ్రష్టు పట్టించే హక్కు ఎవరికీ లేదు. వ్యవస్థలను తప్పుదోవపట్టించే పనులు ఎవరూ చేయకూడదు. అలాంటి ఉద్దేశాలు ఉన్న వారిని కట్టడిచేసే పని ఏపీ ఫ్యాక్ట్‌ చెక్‌ సమర్థవంతంగా నిర్వహించాల’’ని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఏపీ ఫ్యాక్ట్‌ చెక్‌ లక్ష్యాలను, దాని ద్వారా ప్రభుత్వం ఏమి ఆశిస్తుందో వివరించారు.


idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp