అంబేద్కర్ కు ఆంధ్ర‌ప్ర‌దేశ్ అత్యంత గౌర‌వం

By Kalyan.S Jul. 10, 2020, 09:30 am IST
అంబేద్కర్ కు ఆంధ్ర‌ప్ర‌దేశ్ అత్యంత గౌర‌వం

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌అంబేద్కర్ త‌గిన గౌర‌వం ఇచ్చేలా.. ఆయ‌న‌‌ 125 అడుగుల నిలువెత్తు విగ్రహ ఏర్పాటుకు ఆంధ్ర‌ప్ర‌దేశ్ శ్రీ‌కారం చుట్టింది. విజయవాడ నగరం నడిబొడ్డున విగ్రహ ఏర్పాటుకు పూనుకుంటోంది. స్వరాజ్య మైదానంలో బాబాసాహెబ్‌ అంబేద్కర్ భారీ విగ్రహం, స్మృతివనం ఏర్పాటుకు వీడియో కాన్ఫరెన్సు ద్వారా ముఖ్యమంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి బుధ‌వారం శంకుస్థాపన చేశారు. ఆ ప్రాంతానికి అంబేద్కర్ స్వ‌రాజ్య మైదాన్ గా నామ‌క‌ర‌ణం చేశారు.

ఈ సందర్భంగా జ‌గ‌న్ మాట్లాడుతూ... అంబేద్కర్ కు త‌గిన గౌర‌వం ఇస్తూ.. భారీ విగ్రహం ఏర్పాటు చేస్తే బాగుంటుందని ఆలోచన చేసిన‌ప్పుడు.. విజ‌య‌వాడ‌లోని నీటిపారుదల శాఖకు చెందిన 20.22 ఎకరాల విస్తీర్ణంలో పీడబ్ల్యూడీ మైదానం స‌రైన స్థ‌లంగా భావించామ‌న్నారు. విజయవాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌ 1997లో దీని పేరు ‘స్వరాజ్‌ మైదాన్‌’గా మార్చింద‌ని, ఇప్పుడు ఈ మైదానానికే ‘డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్ ‌ స్వరాజ్‌ మైదాన్‌’గా నామకరణం చేసిన‌ట్లు వివ‌రించారు. ఏడాదిలోగా ఈ పనులన్నీ పూర్తి చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం.. విగ్రహ ఏర్పాటు తదితర అభివృద్ధి పనులను ఏపీఐఐసీకి అప్పగించింది.

20 ఎకరాల స్థలంలో అంబేద్కర్‌ స్మారక మందిరంతో పాటు గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయనున్నారు. అలాగే విగ్రహం చుట్టూ ఆహ్లాదకరమైన (పార్కు), ఓపెన్‌ ఎయిర్‌ థియేటర్‌తోపాటు వాకింగ్‌ ట్రాక్‌ను అభివృద్ధి చేయనున్నారు. న‌లుగురూ అక్క‌డ కూర్చుని ఆహ్లాద‌క‌ర వాతావ‌ర‌ణంలో హాయిగా గ‌డిపేందుకు ఏర్పాట్లు చేసేందుకు అధికారులు ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తున్నారు. అంతేకాక రానున్న రోజుల్లో స్వరాజ్య మైదానం పర్యాటక స్థలంగా మారేలా... విజయవాడ నగరం ప్రపంచ పటంలోకి ఎక్కేలా చ‌ర్య‌లు తీసుకోనున్నారు. ఈ నిర్ణ‌యాన్ని స్వాగ‌తిస్తూ... ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చిత్రపటానికి వైఎస్సార్‌సీపీ దళిత నేతలు పాలాభిషేకం చేశారు. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుకు శంకుస్థాపన చేయడంపై వారు హర్షం వ్యక్తం చేశారు. విజయవాడ నడిబొడ్డున అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్న సీఎం జగన్‌కు ధన్యవాదాలు తెలిపారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp