ఏపీ మంత్రివర్గ సమావేశానికి ముహూర్తం ఖరారు.. ఈ సారి నిర్ణయాలలో..

By Karthik P Oct. 28, 2020, 02:45 pm IST
ఏపీ మంత్రివర్గ సమావేశానికి ముహూర్తం ఖరారు.. ఈ సారి నిర్ణయాలలో..

ఇటీవల పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్వహణకు తాజాగా ముహూర్తం ఖరారైంది. వచ్చే నెల 4వ తేదీన సచివాలయంలో ఏపీ మంత్రివర్గ సమావేశం జరుగుతుందని ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని సర్కులర్‌ జారీ చేశారు. వివిధ విభాగాలు అజెండాకు అనుగుణంగా అంశాలను రూపొందించి పంపాలని కోరారు.

మంత్రివర్గ సమావేశంలో శాసన సభ సమావేశం నిర్వహణపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందంటున్నారు. జూన్‌ నెలలో బడ్జెట్‌ ఆమోదం కోసం రెండు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలను నిర్వహించారు. నవంబర్‌లో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోంది. కోవిడ్‌ తర్వాత బడ్జెట్‌ ఆమోదం కోసం మాత్రమే అసెంబ్లీ సమావేశమైంది. సమయాభావం వల్ల ప్రతిపక్షం, అధికార పక్షం మధ్య వాడీ వేడీ చర్చలు జరిగేందుకు ఆస్కారం లేకపోయింది. మూడు రాజధానులు అంశం, టీడీపీ మాజీ మంత్రుల అరెస్ట్‌లు, విశాఖ భూ కుంభకోణం, అమరావతి భూ కుంభకోణం, వరదలు.. తదితర అంశాలపై ఈ సారి జరగబోయే సమావేశాల్లో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం జరిగే అవకాశం కనిపిస్తోంది.

అంతేకాకుండా మంత్రివర్గ సమావేశంలో.. దిశ బిల్లులో చేయాల్సిన మార్పులపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. గతంలో దిశ బిల్లును ఆమోదించిన రాష్ట్ర శాసన సభ.. కేంద్రం ఆమోదం కోసం పంపింది. అయితే కేంద్రం అందులో కొన్ని మార్పులను సూచించింది. 4వ తేదీన జరగబోయే సమావేశంలో దిశ బిల్లులో మార్పులు, చేర్పులు చేసి తిరిగి కేంద్రానికి పంపేలా తీర్మానం చేయనున్నారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp