మోదీ విసిరిన‌ ఛాలెంజ్ లో గెలిచిన ఏపీ కుర్రాడు..

By Kalyan.S Jul. 13, 2020, 07:12 am IST
మోదీ విసిరిన‌ ఛాలెంజ్ లో గెలిచిన ఏపీ కుర్రాడు..

"మ‌న దేశంలో యాప్స్ త‌యారు చేసే ఔత్సాహికులు చాలా మంది ఉన్నారు. అత్యున్న‌త స్థాయిలో మేడిన్ ఇండియా యాప్స్ త‌యారు చేసే స‌త్తా వారికి ఉంది. సాఫ్ట్ వేర్ ఇంజ‌నీర్లకు ఇది ఒక చాలెంజ్. ఆస‌క్తి ఉన్న వారు యాప్ లు డ‌వ‌ల‌ప్ చేయండి. సుల‌భంగా, సుర‌క్షితంగా ఉండే యాప్ ల‌ను త‌యారు చేసి.. రూ. 2 ల‌క్ష‌ల నుంచి 20 ల‌క్ష‌ల వ‌ర‌కూ ప్రైజ్ మ‌నీ పొందండి." అని ఈ నెల 4న ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ దేశ టెకీల‌కు ఓ చాలెంజ్ విసిరారు.

ఇటీవలే చైనాకు చెందిన 59 యాప్‌లను భారత్ నిషేధించిన నేపథ్యంలో ఆ యాప్‌ల లోటు తీర్చేందుకు, ప్రపంచ స్థాయిలో భారత్‌ యాప్‌లను రూపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా డిజిటల్‌ ఇండియన్‌ ఆత్మనిర్భర్‌ భారత్‌యాప్‌ ఇన్నోవేషన్‌ చాలెంజ్‌ను మోదీ ఆవిష్కరించారు. నీతి ఆయోగ్‌, కేంద్ర ఎలక్ట్రానిక్స్‌, సమాచార సాంకేతిక మంత్రిత్వశాఖలు సంయుక్తంగా ఈ ప్రాజెక్టును నిర్వహించనున్నాయి. "నేడు ప్రపంచస్థాయి భారత యాప్‌లను రూపొందించాలన్న ఉత్సాహం సాంకేతిక, అంకుర వర్గాల్లో కనిపిస్తోంది. వారి ఆలోచనలు, ఉత్పత్తులకు సముచిత రూపం ఇచ్చేందుకు నీతిఆయోగ్‌, సమాచార సాంకేతిక శాఖలు సంయుక్తంగా ఆత్మ నిర్భర్‌ భారత్‌ యాప్‌ ఇన్నోవేషన్‌ ఛాలెంజ్‌ను ఆవిష్కరిస్తున్నాయి.." అని ఆ సంద‌ర్భంగా నరేంద్ర మోదీ ట్వీట్‌ చేశారు.

కాకినాడ కుర్రోడి ప్ర‌తిభ‌

కేంద్ర మంత్రిత్వ శాఖ ప్ర‌క‌టించిన వీడియో కాన్ఫ‌రెన్స్ సొల్యూష‌న్ ఛాలెంజ్‌లో ఆంధ్ర‌ప్ర‌దేశ్ తూర్పు గోదావరి జిల్లా కు చెందిన వంశీకుమార్‌ ఎంపిక‌య్యాడు. జాతీయ స్థాయిలో గుర్తింపు ల‌భించింది. జిల్లా లోని కాకినాడ‌కు చెందిన‌ వంశీ కుమార్.. అమెరిక‌న్ జూమ్ యాప్‌కు ప్ర‌త్యామ్నాయంగా లిబిరో అనే భార‌తీయ యాప్‌ను రూపొందించాడు. ఇది స‌క్సెస్ కావ‌డంతో మోదీ సర్కార్ యాప్ ఛాలెంజ్ లో రూ.15 లక్షల ప్రైజ్ మ‌నీ గెలుచుకున్నాడు. వంశీ ఆదిత్య కాలేజీలో చ‌దువుకున్నాడు. ప్ర‌స్తుతం సోల్ఫీజ్ ఐటీ సొల్యూష‌న్‌లో సీటీఓగా ‌ ప‌ని చేస్తున్నాడు. ఈ పోటీకి 12 కంపెనీలు పోటీ ప‌డ్డాయి. వీరిలో 25 మంది స‌భ్యులు జ్యూరీ ఫైన‌ల్‌కు ఎంపిక‌య్యారు. ఇందులో లిబిరో యాప్ 5వ స్థానంలో నిల‌వ‌డం గ‌మ‌నార్హం.

ప్రాజెక్టుల‌న్నింటినీ ప‌రిశీలిం‌చాక‌...

ఆఫీస్‌ ప్రొడక్టివిటీ, ఇంటి నుంచి పని, సామాజిక మాధ్యమాలు, ఈ-లెర్నింగ్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌, ఆరోగ్యం, అగ్రిటెక్‌, ఫిన్‌టెక్‌, వార్తలు, ఆటలకు సంబంధించిన విభాగాల్లో ట్రాక్‌-1 పోటీలు ఉంటాయి. జూలై 4వ తేదీ నుంచే ఈ చాలెంజ్ మొద‌లైంది. ఈ చాలెంజ్ ద్వారా వ‌చ్చిన ప్రాజెక్టుల‌ను పరిశీలించిన తర్వాత ప్రతి విభాగంలో మొదటి, రెండు, మూడో స్థానంలో నిలిచిన యాప్‌లకు రూ.20 లక్షలు, ఆ త‌ర్వాత స్థానాల్లో నిలిచిన యాప్ ల‌కు రూ.15 లక్షలు, రూ.10లక్షల చొప్పున అందజేయనున్న‌ట్లు గ‌తంలో ప్ర‌క‌టించారు. ఉప విభాగాల్లో రూ. 5 లక్షలు, రూ.3లక్షలు, రూ.2లక్షలు ఇస్తారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp