తెలంగాణలో మరో మినీ సంగ్రామం!

By Kalyan.S Apr. 08, 2021, 09:45 am IST
తెలంగాణలో మరో మినీ సంగ్రామం!

తెలుగు రాష్ట్రాలలో వరుసగా ఎన్నికల జాతర కొనసాగుతోంది. గత నాలుగు నెలలుగా అక్కడ, ఇక్కడా కూడా ఏదో ఒకటి ఎన్నిక జరుగుతూనే ఉంది. తాజాగా ఏపీలో తిరుపతి లోక్‌ సభకు, తెలంగాణలో నాగార్జునసాగర్‌ శాసనసభకు ఉప ఎన్నిక ప్రచారం జరుగుతోంది. 17న పోలింగ్‌ జరగనుంది. ఇదిలా ఉండగా, తెలంగాణలో మరో ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదీ అతి త్వరలోనే.

తెలంగాణలోని గ్రేటర్‌ వరంగల్‌, ఖమ్మం కార్పొరేషన్‌లు, సిద్దిపేట, అచ్చంపేట, నకిరేకల్‌, జడ్చర్ల, కొత్తూరు మునిసిపాలిటీలకు ఈ నెలాఖరులోగానే ఎన్నికలు నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో పాటు జీహెచ్‌ఎంసీలోని 18వ వార్డు, మరికొన్ని ఖాళీలకు కూడా ఎన్నికలు జరపనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లను వేగిరం చేశాయి. వార్డులను ఇప్పటికే ఖరారు చేశారు. వారం రోజుల్లో పోలింగ్‌ కేంద్రాల ఖరారు, పోలింగ్‌ కేంద్రాల వారీగా ఓటరు జాబితాలను సిద్ధం చేస్తున్నారు. ప్రభుత్వపరంగా కేవలం రిజర్వేషన్‌ల ప్రక్రియ మాత్రమే మిగిలి ఉంది. ఈ నెల 14న వార్డుల వారీగా రిజర్వేషన్‌లను ఖరారు చేయనున్నట్లు విశ్వసనీయ సమాచారం. మేయర్‌లు, చైర్మన్‌ల రిజర్వేషన్లను ఇప్పటికే ఖరారు చేశారు.

17న నోటిఫికేషన్‌?

ఈ ఎన్నికలకు ఈ నెల 17న నోటిఫికేషన్‌ను జారీ చేయనున్నారని, అంతకు ఒకట్రెండు రోజుల ముందే ఎస్‌ఈసీ షెడ్యూల్‌ను ప్రకటించనుందని తెలుస్తోంది. ఈ నెల 30న పోలింగ్‌ జరిపి మే 2 లేదా ఆ తర్వాత ఓట్ల లెక్కింపు చేపట్టి, ఫలితాలను వెల్లడించనున్నారు. అనుకోని సంఘటనలు, పరిణామాలు చోటు చేసుకుంటే తప్ప... ఈ షెడ్యూల్‌లో పెద్దగా మార్పు ఉండబోదన్నది సమాచారం. మే నెలలో ఎండల తీవ్రతకు ముందే పోలింగ్‌ను పూర్తి చేయాలని, అందుకే ఏప్రిల్‌ 30వ తేదీనే ఎన్నికలు జరపవచ్చని తెలుస్తోంది.

ప్రక్రియ ప్రారంభమైంది..

గ్రేటర్‌ వరంగల్‌, ఖమ్మం కార్పొరేషన్‌లు, సిద్ధిపేట, అచ్చంపేట, నకిరేకల్‌, జడర్ల, కొత్తూరు మునిసిపాలిటీలకు సాధారణ ఎన్నికలు, జీహెచ్‌ఎంసీతో పాటు పలు చోట్ల ఏర్పడిన ఖాళీలకు ఎన్నికల నిర్వహణకు ప్రక్రియ ప్రారంభమైందని ఎస్‌ఈసీ కమిషనర్‌ పార్థసారధి తెలిపారు. బుధవారం సంబంధిత జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు(స్థానిక సంస్థలు), మునిసిపల్‌ కమిషనర్‌లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఎన్నికల ఏర్పాట్లు, నిర్వహణ, సిబ్బంది, సామాగ్రి, పోలింగ్‌ కేంద్రాల ఏర్పాటు, భద్రత, బ్యాలెట్‌ పత్రాల ముద్రణ, ఇండెలిబుల్‌ ఇంక్‌ తదితర అంశాలను మునిసిపల్‌ శాఖ సంచాలకులు సత్యనారాయణ పర్యవేక్షిస్తారన్నారు. జనవరి 1వ తేదీతో అర్హత గల ఓటర్ల జాబితాను జనవరి 15న జాతీయ ఎన్నికల కమిషన్‌ ప్రచురించిందని, ఈ జాబితాను టీ-పోల్‌ సర్వర్‌లో రాష్ట్ర ఎన్నికల సంఘం అందుబాటులో ఉంచిందన్నారు. దీని ఆధారంగా ఏప్రిల్‌ 11న ఓటరు తుది జాబితా ప్రచురితమవుతుందన్నారు. ఏప్రిల్‌ 14న పోలింగ్‌ కేంద్రాల తుది జాబితా ప్రచురిస్తారన్నారు. మునిసిపాలిటీల పరిధిలోనే కోడ్‌ అమలులో ఉంటుందన్నారు. ఎన్నికల నిర్వహణలో అన్ని స్థాయిల్లోనూ కరోనా కట్టడి నిబంధనలు పాటించాలని ఆదేశించారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp