ఇంటింటికి రేషన్ పంపిణీ వెనుక అసలు లక్ష్యం అదే...

By Raju VS Jan. 22, 2021, 08:00 am IST
ఇంటింటికి రేషన్ పంపిణీ వెనుక అసలు లక్ష్యం అదే...

దీర్ఘకాలిక లక్ష్యాలతో అడుగులు వేస్తున్న జగన్ ప్రభుత్వం దానికి అనుగుణంగా పలు మార్పులు తీసుకొస్తోంది. కేవలం పాలనా పరమైన విధాన మార్పులే కాకుండా పథకాల అమలులో కూడా కొత్త పద్ధతికి శ్రీకారం చుడుతున్నారు. దేశమంతటా ఆకర్షించే, అనుసరించే స్థాయికి చేర్చుతున్నారు. తాజాగా ఇంటింటికీ రేషన్ పంపిణీ విధానాన్ని ప్రారంభించారు. దానికి అవసరమైన ప్రత్యేక వాహనాలకు ఆయన పచ్చజెండా ఊపారు. ఫిబ్రవరి ఒకటి నుంచి వాడవాడలా వాహనాల్లోనే రేషన్ సరుకులు ఇంటికి తీసుకెళ్లి అందించేందుకు అంతా సిద్ధమయ్యింది.

ఇంటింటికీ ప్రజా పంపిణీ వ్యవస్థ సరుకుల సరుకులను అందించే ప్రక్రియపై కొందరు పెదవి విరుస్తున్నారు. రాజకీయంగా టీడీపీ నేతలు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. కానీ కొందరు మాత్రం విమర్శలకు పూనుకుంటున్నారు. సోషల్ మీడియాలో పలు వాదనలు ముందుకు తెస్తున్నారు. వాటన్నంటి సారాంశం చూస్తే రేషన్ సరుకులు కూడా ఇంటికి అందించాలా, లబ్దిదారులను సోమరిపోతులను చేయడం కాదా, అన్ని ఇంటికే అందిస్తే ఇక సామాన్యుడు కాలు కదుపుతాడా అనేంతవరకూ కూడా వెళుతున్నారు. కానీ వాస్తవాలను విస్మరించి చేస్తున్న విమర్శలుగా వాటిని చూడాల్సి ఉంటుంది. నిజమైన లబ్దిదారుల జీవనం గురించి అవగాహన లేని వాదనలుగా లెక్కించాల్సి ఉంటుంది.

జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రేషన్ సరుకుల పంపిణీ కోసం కొత్త విధానం తీసుకొచ్చింది. అందులో భాగంగా కొత్తగా బియ్యంకార్డులను పంపిణీ చేసింది. తద్వారా అత్యధికులు రేషన్ బియ్యం కోసం కాకుండా కేవలం ఆరోగ్య శ్రీ వంటి అవసరాల కోసమే బీపీఎల్ కోటాలో కార్డుల కోసం ఎగబడుతున్న విషయాన్ని గుర్తించారు. దానిని సరిదిద్ది నెలా నెలా కోటా బియ్యం తీసుకోకుండా కేవలం ఆరోగ్య శ్రీ, పిల్లల చదువులు నిమ్మిత్తం కార్డులు వాడుతున్న వారిని విభజించారు. అందు నిమిత్తం కొలబద్ధలు మార్చారు. పట్టణాల్లో 2.4 లక్షల లోపు ఆదాయం ఉన్న వారికి మాత్రమే బియ్యం కార్డులు అందిస్తున్నారు. పల్లెల్లో అది మరింత కుదించారు. తద్వారా నిజమైన లబ్దిదారులకు మాత్రమే బియ్యం అందించే ఏర్పాట్లు చేశారు. దానిపై విపక్షాలు గగ్గోలు పెట్టాయి. రేషన్ కార్డులు కోత వేస్తున్నారంటూ ఓ సెక్షన్ మీడియా అరచిగీపెట్టింది. కానీ ప్రభుత్వం మాత్రం లబ్దిదారులు బియ్యం తీసుకోకపోవడంతో వాటిని మళ్లీ రీ సైక్లింగ్ చేసి బహిరంగ మార్కెట్లో ప్రజలకు ఎక్కువ ధరకు అమ్ముకుంటున్న మాఫియాకు చెక్ పెట్టే రీతిలో వ్యవహరించింది. దాని ఫలితం కూడా కనిపిస్తోంది.

ఇప్పుడు రేషన్ సరుకులు నేరుగా ఇంటింటికీ తీసుకెళ్ళడం ద్వారా కార్డు యజమాని ఉన్నారా లేదా అనేది ఎప్పటికప్పుడు తెలిసిపోతుంది. పైగా అసలు లబ్దిదారుడికి బియ్యం అవసరమా లేదా అన్నది అర్థమయిపోతుంది. ప్రస్తుతం ఎవరికి బియ్యం కార్డు ఉంది అనే విషయం కొంత గోప్యంగా ఉంటుంది. చాలామంది బియ్యం కార్డులు తీసుకుని బయటకు వెళ్లడించకుండా జాగ్రత్తపడుతున్నారు. కానీ ఇప్పుడు వారి ఇంటికే బియ్యం సహా సరుకులు వెళ్లగానే వాళ్లు నిజంగా అర్హులేనా అన్నది అందరికీ తేటతెల్లం అవుతుంది. బియ్యం తీసుకుంటున్నారా లేదా అన్నది తేలిపోతుంది. ఒక వేళ రేషన్ బియ్యం తీసుకుని మళ్లీ అమ్ముకునే ప్రయత్నం చేస్తుంటే అక్కడే ఉండే బియ్యం పంపిణీ దారులకు సమాచారం సులువుగా చేరుతుంది. తద్వారా దానిని నిలువరించేందుకు మార్గం సుగమం అవుతుంది. బియ్యం అక్రమార్కులకు అడ్డుకట్ట పడుతుంది.

పేదలకు కడుపు నింపాల్సిన రేషన్ సరుకుల వ్యాపారంలో కోట్లు దండుకుంటున్న ఓ సెక్షన్ కి చెక్ పెట్టే మార్గంగా ఈ వాహనాలు ఉపయోగపడబోతున్నాయి. పైగా తూనికల్లో తేడాలు తొలగించే ప్రయత్నం జరుగుతోంది. ప్రజలకు ఊరట కల్పిస్తూ, అవినీతికి అడ్డుకట్ట వేసి, ప్రజాధనం కాపాడే ఓ పెద్ద ప్రయత్నంగా ఈ వాహానాలు కనిపిస్తున్నాయి. దానిని విస్మరించి టీడీపీ నేతలు చేస్తున్న విమర్శలు ఉద్దేశపూర్వకంగా ప్రజలను పక్కదారి పట్టించడం, ప్రభుత్వ లక్ష్యాన్ని నీరుగార్చే ప్రయత్నంగానే చూడాల్సి ఉంటుంది. వాస్తవానికి రేషన్ బియ్యం మాఫియాలో పలువురు టీడీపీ నేతల పాత్ర ఉండడంతో ఈ వ్యవహారాన్ని సహించలేకపోతున్నారనే అభిప్రాయం కూడా వినిపిస్తోంది. ఇప్పటికే నేరుగా పెన్షన్ పంపిణీ వంటివి జరుగుతున్న తరుణంలో అనేక అక్రమాలు అరికట్టే అవకాశం కలిగింది. తదుపురి రేషన్ సరుకుల్లో కూడా ఇది వర్తిస్తుంది. అందుకే విపక్షాలు విమర్శలకు పూనుకుంటున్నట్టు భావించాల్సి ఉంటుంది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp