విజి"లెన్స్" : టీడీపీ మాజీ ఎమ్మెల్యేకు బిగుస్తున్న ఉచ్చు !

By Kalyan.S Sep. 01, 2021, 08:10 am IST
విజి"లెన్స్" : టీడీపీ మాజీ ఎమ్మెల్యేకు బిగుస్తున్న ఉచ్చు !

ఆయ‌నో టీడీపీ మాజీ ఎమ్మెల్యే.. అధికారంలో ఉన్న‌ప్పుడు ఆయ‌న చేసిన హ‌డావిడి అంతా ఇంతా కాదు. అవినీతి కూడా అంతే అన్న విష‌యం విజిలెన్స్‌ విచారణలో వెలుగులోకి వ‌స్తున్న వాస్తవాలను చూస్తే అర్థ‌మ‌వుతోంది. అధికారం కోల్పోయాక ప్ర‌భుత్వ ప‌థ‌కాలు ప్ర‌జ‌ల‌కు అంద‌కుండా చేస్తున్నార‌నే అప‌వాదు మూట‌గ‌ట్టుకున్నారు.

జ‌గ‌న్ ప్ర‌భుత్వం పేద‌ల‌కు ఇళ్ల స్థ‌లాలు అందించేందుకు ప్ర‌య‌త్నిస్తే అడ్డుకునేందుకు శాయ‌శ‌క్తులా ప్ర‌య‌త్నించారు. ఓ సంద‌ర్భంలో పేద‌లు ఆయ‌న ఇంటి ముందు ధ‌ర్నా చేశారు. "నువ్వు అధికారంలో ఉన్న‌ప్పుడు సెంటు భూమి కూడా పేద‌ల‌కు పంచిన దాఖ‌లాలు లేవు. ఇప్పుడు వైసీపీ ప్ర‌భుత్వం మేలు చేస్తుంటే అడ్డుప‌డ‌తారా" అంటూ ధ‌ర్నా కూడా చేశారు. ఆ వ్య‌క్తి చుట్టూ ఇప్పుడు అవినీతి ఉచ్చు బిగుస్తోంది.

అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అధికారం చేతిలో ఉందని టీడీపీ ప్ర‌భుత్వ హ‌యాంలో అడ్డగోలుగా వ్యవహరించారు. నీరు–చెట్టు, బ్రాందీషాపులు, ధాన్యం కొనుగోలులో హమాలీల ముసుగు, లే అవుట్‌ల అనుమతులు, ప్రభుత్వ సబ్సిడీ రుణాలలో ముందస్తు కమీషన్ల కక్కుర్తి...ఇలా ఒకటేంటి.. ఎన్నో దారుల్లో అవినీతికి పాల్ప‌డ్డారు. ఆ అవినీతి గుట్టు ఇప్పుడు రట్టవుతోంది. ఐదేళ్ల ఏలుబడిలో సాగించిన అక్రమాల పుట్ట విజిలెన్స్‌ చేతికి చిక్కింది. విజిలెన్స్‌ విచారణలో వాస్తవాలు విస్తుపోయేలా చేస్తున్నాయి. నీరు–చెట్టు పథకంలో నిబంధనలకు విరుద్ధంగా తవ్వేసి గ్రావెల్, మట్టిని తెగనమ్మేసినట్లు విజిలెన్స్‌ విచారణలో ప్రాథమికంగా తేలిందని సమాచారం. గ్రావెల్‌ను లేఔట్లకు, మట్టిని ఆలమూరు మండలం జొన్నాడ, ఆలమూరు, రాయవరం మండలం సోమేశ్వరం, రాయవరం, అనపర్తి మండలం పొలమూరుతోపాటు జిల్లాలో పలు ప్రాంతాలలో ఇటుకబట్టీలకు అమ్మేశారని అధికారులు నిర్థారణకు వచ్చారు.

నీరు–చెట్టు ద్వారా 2016 నుంచి 2018 వరకూ సుమారు రూ.3 కోట్లతో 51 పనులు చేపట్టారు. ఇందుకు 10 రెట్లు అంటే సుమారు రూ.30 కోట్లు అవినీతి జరిగినట్టు ప్రాథమికంగా తేల్చారని సమాచారం. బిక్కవోలు మండలం లింగాల చెరువు పనుల్లో భారీగానే సొమ్ము చేసుకున్నారని తెలిసింది. రంగంపేట మండల కేంద్రంతో పాటు వెంకటాపురం, వడిశలేరు, సింగంపల్లి గ్రామాల్లో అవినీతి చోటు చేసుకుందని గుర్తించారు. రంగాపురంలో అచ్చన్న చెరువు, తమ్మలపల్లిలో రాళ్ల కండ్రిగ చెరువుల తవ్వకాల్లో దోచుకున్నారని నిఘా విభాగం ఆధారాలు సేకరించింది. మాజీ ఎమ్మెల్యే బ్రాందీ షాపులనూ విడిచిపెట్ట లేదు. మందుబాబులపై ఎన్‌.ఆర్‌.టాక్సు పేరుతో బాటిల్‌పై రూ.20 నుంచి రూ.30 అదనంగా యజమానులు వసూలుకు తలుపులు బార్లా తెరిచారు. 40 షాపుల నుంచి కమీషన్‌లు కొట్టేశారనే అంశంపై విజిలెన్స్‌ లోతుగా విచారిస్తోంది.

ప్రాథమిక సహకార సంఘాల ద్వారా ధాన్యం కొనుగోలులో హమాలీల పేరుతో రూ. లక్షలు కాజేశారు. ఈ మొత్తాన్ని మధ్యవర్తుల ద్వారా వెనకేసుకున్నారని తేలింది. కొమరిపాలెంలో జరిగిన కొనుగోలులో 10 శాతం కమీషన్‌ రూపంలో వెనకేసుకున్నారు. సొసైటీ ప్రతినిధి రెండు విడతల్లో రూ.20 లక్షలు అనపర్తి మండలం పొలమూరుకు చెందిన ముఖ్య అనుచరుడి ద్వారా కమీషన్‌గా రాబట్టడంపై విజిలెన్స్‌ దృష్టి సారించింది. అనధికార లేఔట్లు, ల్యాండ్‌ కన్వర్షన్‌కు అనుమతులు మంజూరు చేయాలంటే ముందుగా లేఔట్‌ యజమాని ఎకరాకు రూ.రెండు లక్షలు ముట్టజెప్సాలిందే. అనపర్తికి చెందిన సత్తి వెంకటరామారెడ్డి ల్యాండ్‌ కన్వర్షన్‌ కోసం టీడీపీ ద్వితీయ శ్రేణి నాయకుడు ఎస్‌డీఆర్‌ ద్వారా ఎకరాకు రెండు ల‌క్ష‌ల రూపాయ‌ల చొప్పున వ‌సూలు చేశార‌ట‌. ఊలపల్లిలో రెండెకరాల లేఔట్‌ అనుమతికి జి.మామిడాడకు చెందిన సూర్యనారాయణరెడ్డి దరఖాస్తు చేసుకుంటే ఎకరాకు రూ.2.50 లక్షలు ఇవ్వాలని టిఎస్సార్‌ అనే ముఖ్య అనుచరుడు మధ్యవర్తిత్వం వహించిన‌ట్లు గా విచార‌ణ‌లో తేలింది.

నాలుగైదు రోజులుగా క్షేత్ర స్థాయిలో అధికారులు విచార‌ణ జ‌రుపుతున్నారు. న‌ల్ల‌మిల్లి పై వ‌చ్చిన ఫిర్యాదుల ఆధారంగా లోతుగా అధ్య‌య‌నం చేస్తున్నారు. ఒక డీఎస్పీ, ఇద్దరు ఇనస్పెక్టర్‌లు, ముగ్గురు వివిధ విభాగాల అధికారులు, మొత్తంగా ఏడుగురు సభ్యులతో కూడిన బృందం ఈ ప‌నిలో నిమ‌గ్న‌మైంది. పూర్తి వివ‌రాలు బ‌య‌ట‌ప‌డితే న‌ల్ల‌మిల్లి అక్ర‌మాల చిట్టా వెలుగులోకి వ‌చ్చే అవ‌కాశం ఉంది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp